అదేంటో రాజధాని రాజకీయ గందరగోళంలో ఏపీలోని విపక్ష పార్టీలు అన్నీ పడిపోయాయి. మాకు కచ్చితమైన విధానం ఉంది. అభిప్రాయాలు ఉన్నాయి అని జబ్బలు చరచుకునే జాతీయ పార్టీ బీజేపీ కూడా మూడు రాజధానుల విషయంలో మూడు చెరువుల నీళ్ళు తాగుతోంది
ఆ పార్టీ జాతీయ నేతలు ఒకలా, రాష్ట్ర నేతలు మరోలా మాట్లాడుతూంటే జిల్లా స్థాయి నేతలు కూడా తమకు తోచినట్లుగా తలో మాటా చెబుతున్నారు. ఇంతకీ మూడు రాజధానులు కావాలా వద్దా అన్న దానికి క్లారిటీగా సమాధానం మాత్రం బీజేపీ పెద్దల వద్ద లేదంటే లేదు.
ఇక ఉత్తరాంధ్ర ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ కూడా ఈ విషయంలో పడ్డ గందరగోళం అంతా ఇంతా కాదు, మొదట జై విశాఖ రాజధాని అన్న ఆయనే ఆ తరువాత నై విశాఖ అని సులువుగా అనేసారు. ఇపుడేమో విశాఖను పట్టించుకుంటూనే అమరావతిలో రాజధానిని అలాగే ఉంచమంటూ సలహాలు ఇస్తున్నారు.
అమరావతిలో రాజధానిని అలాగే కొనసాగించండి. కానీ ఒక్క షరతు, అది చంద్రబాబు మార్క్ ఊహాజనితమైన రాజధాని, ఇంద్రుని అమరావతి కాకుండా చూసుకోండి. జనాలు నివసిందే రాజధాని అమరావతి కావాలంటూ టీడీపీకి ఝలక్ ఇచ్చిన ఈ బీజేపీ నేత విశాఖలో మాత్రం సచివాలాయం పెట్టవద్దు అంటున్నారు.
అక్కడ కేవలం కొన్ని ప్రభుత్వ కార్యాలయాలను పెడితే చాలు, అలాగే కొన్ని హెచ్ ఓడీ విభాగాలు కూడా ఇక్కడ నుంచి కార్యకలాపాలు నిర్వహించేలా చూడాలని సలహా ఇస్తున్నారు. మరి ఆయన జగన్ ఫార్ములానూ వ్యతిరేకించి, బాబు అమరావతిని ధిక్కరించి చివరికి ఏం చెప్పారంటే అది కూడా గందరగోళమేనని కాషాయ పార్టీ నేతలే అంటున్నారు.