జగన్ ప్రభుత్వంపై ఇంత దుష్ప్రచారమా?

కియా కార్ల ప్లాంట్ తరలిపోతోంది..ఇది ఒక వార్తా సంస్థ ఇచ్చిన కధనం. అది ఎలా బయటకు వచ్చిందో తెలియదు కాని వెంటనే తెలుగుదేశం పార్టీ ఎమ్.పిలు పార్లమెంట్‌లో గాత్రం అందుకున్నారు. అందులో వాస్తవం ఎంత?…

కియా కార్ల ప్లాంట్ తరలిపోతోంది..ఇది ఒక వార్తా సంస్థ ఇచ్చిన కధనం. అది ఎలా బయటకు వచ్చిందో తెలియదు కాని వెంటనే తెలుగుదేశం పార్టీ ఎమ్.పిలు పార్లమెంట్‌లో గాత్రం అందుకున్నారు. అందులో వాస్తవం ఎంత? ఎపి ప్రభుత్వం అభిప్రాయం ఏమిటి? మొదలైన విషయాలతో నిమిత్తం లేకుండా ఇలాంటి వార్తలు వస్తే ఏమి చేయాలి? నిజంగానే ఇది అందరిని కలవరపరచింది.

వాస్తవానికి కియా కార్ల ప్లాంట్ ఏర్పాటు సందర్భంగా అప్పటి ప్రభుత్వం బారీగా రాయితీ ఇచ్చిందన్న విమర్శ ఉంది. అయినా ప్రస్తుత ప్రభుత్వం దాని జోలికి పోకుండా ఆ కంపెనీకి మద్దతు ఇచ్చింది. స్వయంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కియా ప్లాంట్ ప్రారంభానికి వెళ్లి వారికి ఏ అవసరం ఉన్నా తీర్చడానికి సిద్దం అని ప్రకటించారు. అదే సమయంలో గతంలో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి గా ఉన్నప్పుడు ఆయన తమను ఎపిలో ప్లాంట్ పెట్టాలని కోరారని కియా వారు ఒక లేఖ రాశారు. ఇంత జరిగిన తర్వాత ఆ ప్లాంట్ ఎందుకు ఇక్కడ నుంచి తరలిస్తారు?

పైగా ఇప్పుడు ఆ ప్లాంట్ నుంచి వచ్చిన కార్లకు మంచి గిరాకి వచ్చిందన్న వార్తలు కూడా వచ్చాయి. అలాంటి సమయంలో ఏ సంస్థ అయినా మళ్లీ ఉత్పత్తి నిలిపి వేరే చోటకు ఎందుకు తరలిస్తుంది? మరి కియా ఎమ్.డి మొదలు, ఇటు ఎపి ప్రభుత్వ ముఖ్య అదికారులు వరకు అంతా ఆ వార్తలను ఖండించవలసి వచ్చింది. చివరికి తమిళనాడు ప్రభుత్వ అధికారులే తమ వద్దకు కియా తరపున ఎవరు రాలేదని, సంప్రదించలేదని చెప్పారు. పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంటే ఎపి ప్రభుత్వం జాగ్రత్తపడవలసి ఉంటుంది. అది వేరే విషయం.

కాని వదంతిని పెద్ద ఎత్తున ప్రచారం చేయడమే కాకుండా, లోక్ సభలో కూడా టిడిపి ఎమ్.పిలు రామ్మోహన్ నాయుడు కాని, గల్లా జయదేవ్ కాని ప్రస్తావించడం ద్వారా ఎవరి ప్రయోజనాలు కాపడుతున్నారు. ఆ వార్త వచ్చాక వారు కియా వారితో కాని, రాష్ట్ర ప్రభుత్వ అదికారులతో కాని మాట్లాడి, అది నిజమే అని నమ్మితే దాని గురించి పార్లమెంటులో ప్రస్తావించి ఎపికి నష్టం జరుగుతోందని చెప్పవచ్చు. లేదా విమర్శించవచ్చు. అవేవీ చేయకుండా యాగీ చేయడానికి టిడిపి ప్రయత్నించిందంటే ఎపి ప్రయోజనాల కన్నా, తమకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యమని బావిస్తున్నట్లే కదా..ఇదే కనుక టిడిపి అదికారంలో ఉండి, వైసిపి లేదా మరో పక్షం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జరిగి ఉంటే, ఇలాంటి వార్తలు వచ్చి ఉంటే..వెంటనే టిడిపి నేతలు  ఏమనేవారు.

టిడిపి నేతలేం ఖర్మ..స్వయంగా చంద్రబాబు నాయుడే రంగంలోకి దిగి రాష్ట్రాన్ని ప్రతిపక్షం నాశనం చేస్తోందని అనేవారా కాదా? వారికి ఈ రాష్ట్రం బాగుపడడం ఇష్టం లేక, కుట్రలు చేస్తున్నారని ఇష్టం వచ్చినట్లు తిట్టేవారా? లేదా? కాని టిడిపి ఇప్పుడు ప్రతిపక్షంలో  ఉంది కనుక వారు ఏమైనా చేయవచ్చని అనుకుంటున్నారు.

గతంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రాష్ట్రానికి ఉచిత గ్యాస్ కనెక్షన్ ల స్కీమ్ ఒకటి వచ్చింది. దానికి అప్పట్లో ఆయన దీపం స్కీమ్ అని పేరు పెట్టారు. అది కేంద్ర ప్రభుత్వ పదకం. ఎన్.డి.ఎ.లో భాగస్వామి కనుక ఆయన ఓన్ చేసుకున్నారు. ఆ సమయంలో అప్పట్లో ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్ నేత రోశయ్య, లో్క్ సభ సభ్యుడు గా ఉన్న పి.ఉపేంద్రలు కేంద్రానికి ఈ స్కీమ్ కు సంబందించి ఏవో పిర్యాదులు చేస్తూ కేంద్రానికి లేఖ లు రాశారు. అంతే ..రాష్ట్రానికిద్రోహం చేస్తారా అంటూ చంద్రబాబు మండిపడ్డారు.

అలాగే కేంద్రం నుంచి వచ్చిన బియ్యం టిడిపి నేతలు తినేస్తున్నారని కాంగ్రెస్‌ ఆరోపిస్తే,వెంటనే చంద్రబాబు ఆయన మంత్రులు కాంగ్రెస్ పై విరుచుకుపడ్డారు. లక్షల టన్నుల బియ్యం తెచ్చి రాష్ట్రానికి ఉపయోగపడుతుంటే, కాంగ్రెస్ అడ్డుపడుతోందని ప్రచారం చేసేవారు. మరి ఇప్పుడు టిడిపి ఎంపీలు ఏకంగా లోక్ సభలోనే కియా వార్తను ప్రచారం చేయడం ద్వారా ఎపి ప్రతిష్టను దెబ్బతీయాలని చూశారే.మరి ఇది న్యాయమేనా అంటే వారికి బాకా ఊదే పత్రికలు ఉన్నాయి కనుక ఏమైనా కరెక్టే అని ప్రజలు అనుకోవాలన్నమాట.

ఇదొక్కటే కాదు, చంద్రబాబు గతంలో అమరావతి రాజధాని లో వేల ఎకరాలు సమీకరిస్తున్న క్రమంలో చాలా మంది రైతులను నానా బాదలకు గురి చేశారు. అప్పట్లో వరల్డ్ బ్యాంక్ వారు వచ్చి పరిశీలన చేశారు. వారికి కొందరు రైతులు ప్రభుత్వం పై పిర్యాదు చేశారు. అప్పడు అదంతా వైసిపి పనే అని తాను అంతర్జాతీయ స్థాయి నగరం సృష్టిస్తుంటే వైసిపి అడ్డుపడుతోందని ప్రచారం చేసేవారు. అదికారంలో ఉన్నప్పుడే ఆయనే ప్రచారం చేయగలిగారు. ఇప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చి కూడా అదే ఆర్ట్‌ ప్రదర్శిస్తున్నారు.

నిజానికి ఈ ఎనిమిది నెలల వైసిపి పాలనలో ప్రభుత్వాన్ని నడపడం ఒక ఎత్తు అయితే, టిడిపి దుష్ప్రచారం అనండి..వారికి మద్దతు ఇచ్చే మీడియా అబద్దపు ప్రచారం అనండి వాటిని ఎదుర్కోవడమే ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారింది. కొన్నాళ్లు ఇసుక అంటూ ఆత్మహత్యలు ఎవరు ఏ రకంగా చనిపోయినా ఇసుక కోసమే చనిపోయారని ఒక పిచ్చి ప్రచారం చేశారు. కొన్ని కేసులలో స్వయంగా మరణించినవారి కుటుంబాల వారే వచ్చి ఇసుకతో  సంబందం లేదని చెప్పినా, వీరు మాత్రం ఆ ప్రచారం మానలేదు.

ఆ తర్వాత లక్షపాతికవేల సచివాలయ ఉద్యోగాల ఎంపిక ఎక్కడా లోటు లేకుండా నిర్వహిస్తే పరీక్ష పత్రిం ఎవరో ఒక అవుట్ సోర్సింగ్ ఉద్యోగికి అవుట్ అయిందంటూ తప్పుడు కధనాలను వండి వార్చారు. అనంతపురం యూనివర్శిటీ లోని ఒక విభానికి అంటగడితే, వారు అసలు ఆ పరీక్ష పత్రాలే తమ వద్దకు రాలేదని చెప్పాల్సి వచ్చింది. కొన్నాళ్లు మతం అన్నారు, మరి కొన్నాళ్లు కులం అన్నారు.

రాజధాని ఉద్యమం పేరుతో జరుగుతున్న అసత్య ప్రచారం అంతా ,ఇంతా కాదు. ఆ పరిసరాలలో ఎవరూ ఏ కారణంతో మరణించినా, చివరికి వృద్దాప్యంతో కన్నుమూసినా, టిడిపి నేతలు, టిడిపి మీడియా గద్దల్లా వాలిపోతున్నారు. రాజదాని తరలింపు బాదతో గుండె ఆగిపోయిందని ప్రచారం చేయడం నిత్య కృత్యంగా మారింది.

ఇటీవల ఛీప్ సెక్రటరీని సెలవుపై వెళ్లమన్నారని ఒక ప్రచారం చేస్తే ఆమె కార్యాయం ఆ వార్తను ఖండించింది. ఈ మద్య పార్లమెంటు ప్రాంగణంలో తానా సభ్యుల బృందం ఒకటి గాంధీ విగ్రహం వద్ద ఎపి రాజధాని విషయంలో నిరసన తెలిపిందని ఒక పెద్ద పత్రిక రాసింది. అంతా ఆశ్చర్యపోవల్సి వచ్చింది. అదెలా సాద్యమని?అక్కడ ఎమ్.పిలు తప్ప ఎవరైనా నిరసన చేపడితే వెంటనే అరెస్టు చేసే అవకాశం ఉంటుంది. ఆ కనీస పరీజ్ఞానం లేకుండా వారు రాశారు. పైగా వచ్చినవారిలో కోమటి జయరామ్ అనే టిడిపి నేత కూడా ఉన్నారు. ఆయన చంద్రబాబు టైమ్ లో అమెరికాలో ఎపి ప్రభుత్వ ప్రతినిధిగా పనిచేశారు. ఆయనతో పాటు మరో ముగ్గురు గాందీ విగ్రహం వద్ద పోజ్ ఇచ్చి పోటో దిగారు. దానిని నిరసనగా చిత్రీకరించి, అదేదో తానా వారు నిరసన తెలిపారని అంత పెద్ద పత్రిక కూడా రాసే దుస్సహాసానికి ఇడిగడితే పత్రికల విలువల గురించి ఏమని ఆలోచించాలి.

తోక పత్రికగా పేరొందిన మరో పత్రిక అయితే రెచ్చిపోయి అబద్దాలు రాస్తోంది. పిచ్చి వాదనలు చేస్తోంది. చివరికి తెల్ల రేషన్ కార్డులు ఉంటే కోట్ల రూపాయలు పెట్టి రాజధానిలో భూములు కొనరాదా అని ప్రశ్నిస్తూ, అసలు ఈడికి ఆ భూములతో ఏమి సంబందం అని రాసే స్తితికి వెళ్లింది. అంతేకాదు. నాగార్జున యూనివర్శిటీలో వికేంద్రీకరణ సదస్సు జరిగితే దాని గురించి కూడా తప్పుడు వార్త రాసింది. అందుకు నేనే సాక్ష్యం. సదస్సు ముగిసేవరకు వందలాది మంది విద్యార్దులు మీటింగ్ హాల్ లోనే ఉన్నారు. ఆయా సందర్భాలలో బాగా స్పందించారు. అంతా అయిపోయాక ఒక విద్యార్దిని వచ్చి తమకు సందేహాలు ఉన్నాయని అంటూ ప్రశ్నించబోతే, ముందుగా అనుమతి తీసుకోవాలని చెప్పి నిర్వాహకులు తిరస్కరించారు. దానిని చిలవలు, పలవలుగా చిత్రీకరించి వైస్ చాన్సలర్ రాజశేఖర్ పై అబద్దాలు రాయడానికి తెగబడ్డారంటే ఏమనుకోవాలి. ఇంత దారుణంగా అబద్దాలు రాస్తారా అన్న ఆవేదన కలిగింది.

నలభై రెండు ఏళ్లుగా జర్నలిజంలో ఉన్న నాకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే, మామూలుగా ఈ  మీడియా మాఫియాగా మారి ఎంతమందిని వేధిస్తోందో అన్న భావన కలుగుతుంది. అయినా ఈ మీడియా జోలికి వెళ్లవద్దని జర్నలిస్టు సంఘాలు చెబితే జర్నలిజాన్ని ఎవరూ రక్షించలేరు. బ్లాక్ మెయిల్ చేయడమే జర్నలిజం అవుతుంది. అబద్దాలు రాయడమే జర్నలిజం అవుతుంది. నైతిక విలువలు అక్కర్లేదని జర్నలిజమే జనానికి చెప్పినట్లు అవుతుంది. మరి ఇలాంటి జర్నలిజాన్ని సహించాల్సిందేనా?

కొమ్మినేని శ్రీనివాసరావు