సీఎం జగన్‌ను బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఏకాంతంగా కలిశారా? ఏపీ బీజేపీ శాఖకు తెలియకుండా జగన్‌ను ఎప్పుడు కలిశాడు? ఎందుకు కలిశాడు? ఇప్పుడీ ప్రశ్నలు టీడీపీ నేత వర్ల రామయ్య సంధిస్తున్నాడు. సహజంగానే అబద్ధానికి ఉన్న ఆకర్షణ ఆడవాళ్లకి కూడా లేదంటారు. నిజం గడప దాటేసరికి అబద్ధం లోకం చుట్టేస్తుందంటారు. తాజాగా వర్ల రామయ్య ఆరోపణలు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమయ్యాయి.
ఏపీలో మూడు రాజధానుల రచ్చ మొదలైనప్పటి నుంచి పాలక ప్రతిపక్ష పార్టీలు పరస్పరం మాటల తూటాలు పేల్చుకుంటున్నాయి. మరీ ముఖ్యంగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీలో రాజధాని విషయమై స్పష్టమైన విభజన వచ్చింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మినారాయణ, ఎంపీ సుజనాచౌదరి తదితరులు చంద్రబాబు వాదనకు అనుకూలంగా, జీవీఎల్ నరసింహారావు సీఎం జగన్‌కు మద్దతుగా గత కొంతకాలంగా తమతమ వాదనలు వినిపిస్తూ వస్తున్నారు.
రాజధానిని అంగుళం కూడా కదిలించలేరని సుజనాచౌదరి హెచ్చరిస్తే, అది కేంద్ర పరిధిలోని అంశం కాదని, తాము జోక్యం చేసుకునేది లేదని జీవీఎల్ స్పష్టం చేశాడు. చివరికి జీవీఎల్ వాదనను బలపరుస్తూ ఇటీవల లోక్‌సభలో కేంద్రహోంశాఖ సహాయ మంత్రి కూడా లిఖిత పూర్వక ప్రకటన చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో జీవీఎల్ అంటే టీడీపీ నేతలకు కొరకరాని కొయ్యగా తయారయ్యాడు. టీడీపీని ఒక రేంజ్‌లో ఆడుకుంటున్న జీవీఎల్‌పైకి తాజాగా ప్రతిపక్ష టీడీపీ ఒక వ్యూహం ప్రకారం దళితనేత వర్ల రామయ్యను ఉసిగొల్పింది. జీవీఎల్‌పై వర్ల అవాకులు చెవాకులు పేలారు. జీవీఎల్ బీజేపీ నేత అనే విషయాన్ని మరిచిపోయి…ఏపీ బీజేపీ వ్యవహారాల్లో ఎందుకు జోక్యం చేసుకుంటున్నాడని వర్ల ప్రశ్నించాడు.
మూడు రాజధానులు ఉంటే తప్పేంటన్న జీవీఎల్.. ఓ పనికిమాలిన ఎంపీ అని వర్ల రామయ్య తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతేకాదు ఖబర్దార్ అంటూ హెచ్చరించాడు. వైసీపీకి అనుకూలంగా జీవీఎల్ మాట్లాడటంలో మతలబు ఏంటి? అని ప్రశ్నించాడు. జగన్‌ను జీవీఎల్ ఏకాంతంగా ఎందుకు కలిశారని ప్రశ్నించడం గమనార్హం.
ఇటీవల ఢిల్లీలోని లోథి హోటల్‌లో వైసీపీ ముఖ్య నేతను జీవీఎల్ ఎందుకు కలిశారని వర్ల ప్రశ్నించాడు. మూడు రాజధానులపై జీవీఎల్ కారుకూతలు కూయడం మానుకోవాలంటూ వర్ల రామయ్య నోరు పారేసుకున్నాడు. జీవీఎల్‌కు ధైర్యముంటే రాజధానిలో పర్యటించాలని సవాల్ విసిరాడు.
బీజేపీ కూడు తింటూ, వైసీపీ పాట పాడుతున్నాడంటూ వర్ల ధ్వజమెత్తాడు. అంతేకాదు ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యుడైన జీవీఎల్‌ను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కంట్రోల్ చేయాలని డిమాండ్ చేయడం కొసమెరుపు. వర్ల రామయ్య మాటలు వింటుంటే జీవీఎల్‌పై టీడీపీ ఎంత ఆగ్రహంగా ఉందో అర్థమవుతోంది.