బ్యాంకుల నుంచి భారీ ఎత్తున లోన్లు తీసుకుని, తిరిగి చెల్లించడంలో జాప్యం చేస్తున్న జాబితాలో మరో ప్రముఖుడు చేరాడు. ఈ సారి తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు సమీప బంధువు, సినిమా నటుడు బాలకృష్ణ చిన్నల్లుడు శ్రీభరత్ కుటుంబం ఈ వార్తల్లోకి ఎక్కింది. ఇప్పటికే చంద్రబాబుకు అతి సన్నిహితుల్లో ఒకరైన సుజనా చౌదరి ఈ తరహా వార్తలో నిలిచారు. ఇప్పుడు శ్రీభరత్ పేరు ఈ జాబితాలోకి ఎక్కింది. అబిడ్స్ లోని కరూర్ వైశ్యా బ్యాంక్ నుంచి శ్రీభరత్ కుటుంబం తీసుకున్న అప్పు వడ్డీతో కలిసి 124 కోట్ల రూపాయలకు చేరిందని వార్తలు వస్తున్నాయి.
ఈ అప్పు సరిగా చెల్లించకపోవడంతో.. ఆస్తుల జప్తుకు కేవీబీ నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తోంది. టెక్నో యూనిక్ ఇన్ ఫ్రాటెక్ పేరిట శ్రీభరత్ కుటుంబం కేవీబీ నుంచి అప్పులు తీసుకున్నట్టుగా సమాచారం. ఈ అప్పును తిరిగి చెల్లించాలని ఇప్పటికే బ్యాంకు పెట్టిన గడువు కాలం కూడా పూర్తి అయినట్టుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో శ్రీభరత్ కుటుంబ ఆస్తుల జప్తుకు బ్యాంకు నోటీసులు ఇచ్చినట్టుగా వార్తలు వస్తున్నాయి.
ఇక భరత్ కుటుంబీకులకు ఈ తరహా అప్పులు కొత్తవి కావనే మాటా వినిపిస్తూ ఉంది. ఇది వరకూ వారు ఆంధ్రా బ్యాంకు కు కూడా వంద కోట్ల రూపాయల వరకూ వీరు అప్పు పడ్డారట. ఆ వ్యవహారం కూడా ఆస్తుల జప్తువరకూ వెళ్లిందని, ఇప్పుడు కేవీబీ నోటీసులు ఇచ్చినట్టుగా ప్రచారం జరుగుతూ ఉంది. మొత్తానికి బాలకృష్ణ చిన్నల్లుడు, లోకేష్ బాబు తోడల్లుడు ప్రభుత్వ రంగ బ్యాంకులకు ఎగనామం పెట్టిన ఘనతను వహిస్తున్నట్టుగా ఉన్నారు.