ప్రసార మాధ్యమాలు పెరిగిన తర్వాత వార్తలు ఎంత త్వరగా వ్యాప్తి చెందుతున్నాయో.. అవాస్తవాలు కూడా అంతే వేగంగా వ్యాపిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఏది నిజమే, ఏది అబద్ధమో కూడా చెప్పలేని పరిస్థితి. అలాంటిదే ఓ భయంకరమైన ఫేక్ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది అలాంటిలాంటి అవాస్తవం కాదు, ఒక రకంగా చెప్పాలంటే దుర్మార్గమైన న్యూస్ ఇది.
ఇంతకీ ఆ న్యూస్ ఏంటంటే.. చైనాలో 20వేల మంది కరోనా వైరస్ బాధితుల్ని చంపేయాలని ఆ దేశ ప్రభుత్వం నిర్ణయించిందట. ఈ మేరకు అత్యున్నత న్యాయస్థానాన్ని చైనా ప్రభుత్వం ఆశ్రయించిందట. వైరస్ మరింతగా వ్యాప్తి చెందకుండా ఉండాలంటే, ఆ 20వేల మందిని చంపేయడమే మార్గం అని కోర్టుకు విన్నవించిందట చైనా.
చూశారుగా.. నిన్న రాత్రి నుంచి సోషల్ మీడియాలో దుమారం రేపుతున్న వార్త ఇది. చైనా చరిత్ర తెలిసిన చాలామంది అది నిజమే అనుకున్నారు. ఇంత దుర్మార్గం ఏంటని కొంతమంది తమలోతామే బాధపడ్డారు. కానీ ఆ వార్తలో నిజం లేదు. అదొక ఫేక్ న్యూస్.
ఈ వార్త వచ్చిన వెంటనే బీబీసీతో పాటు అంతర్జాతీయ వార్తాసంస్థలన్నీ ఎలర్ట్ అయ్యాయి. చైనా నిజంగానే ఈ ఘాతుకానికి పూనుకుంటుందా అంటూ నిజనిర్థారణ ప్రారంభించాయి. అలా ఎంక్వయిరీ ప్రారంభించిన నిమిషాల్లోనే అది గాలివార్త అనే విషయం తేలిపోయింది. నిజంగా కరోనా బాధితుల్ని చంపేయాలని అనుకుంటే.. వారం రోజుల పాటు రాత్రిపగలు కష్టపడి హాస్పిటల్ నిర్మించాలని అవసరం లేదని.. చైనా అధికారి ఒకరు వెల్లడించారు.
అయినా కరోనా బాధితుల్ని చంపేస్తే వైరస్ వ్యాప్తి ఆగిపోతుందని భావించడం భ్రమే అవుతుందంటున్నారు అధికారులు. బాధితుల్ని చంపితే అది చేతకానితనం అవుతుందని, వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి అందుబాటులో ఉన్న అన్ని ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవడంతో పాటు.. కరోనాకు యాంటీవైరస్ కనుగొనే దిశగా తమ శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారని తెలిపారు.