వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి టీడీపీ యువనేత నారా లోకేశ్‌కు తీరని ద్రోహం చేస్తున్నాడు. కామెడీపై లోకేశ్‌కు ఉన్న హక్కుల్ని మిధున్ బలవంతంగా లాక్కుంటున్నాడు. దీంతో పార్టీలకు అతీతంగా లోకేశ్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసనకు దిగుతున్నారు. లోకేశ్ నుంచి కామెడీ హక్కుల్ని లాక్కోవడాన్ని నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రజలు పెద్ద ఎత్తున ఢిల్లీలో నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించారు.
నిరసన ఏర్పాట్లను టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, తెలుగు మహిళ రాష్ట్ర అధ్యక్షురాలు అనిత తదితరులు పర్యవేక్షిస్తున్నారు. రాజకీయాల్లో తన హాస్య చతురతతో అన్ని పార్టీల వారిని కడుపుబ్బా లోకేశ్ నవ్విస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటిది వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి కొత్త సంప్రదాయానికి తెరలేపారు. లోక్‌సభలో ఆయన మాటలు మన యువ కిషోరం లోకేశ్‌కు నవ్వు తెప్పించాయి. అంతటితో అయిపోలేదు…మిధున్ కామెడీకి తాను ఫిదా అయ్యినట్టు లోకేశ్ ట్విటర్ వేదికగా ప్రకటించాడు.
దీంతో లోకేశ్‌ను, ఆయన కామెడీని నమ్ముకున్న వాళ్లు…తమ ఉపాధిని ఈ విధంగా గండికొట్టడం సమంజసం కాదంటూ…అన్ని పార్టీల్లోని ఆయన అభిమానులు వీధుల్లోకి వచ్చారు.
అసలేం జరిగిందంటే…
వైసీపీ ఎంపీ మిధున్‌రెడ్డి లోక్‌సభలో మాట్లాడుతూ ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ అని అన్నాడు. దీనిపై లోకేశ్ వెటకారం చేశాడు. ‘అది ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌనో, విలేజో కాదు మాస్టారు. ఆ కంపెనీ పేరు ఫ్రాంక్లిన్ టెంపుల్టన్. కంపెనీ పేరు కూడా తెలుసుకోకుండా 'ఫ్రాంక్లిన్ టెంపుల్ టౌన్ చంద్రబాబుగారి బినామీ కంపెనీ' అంటూ పార్లమెంటులో వైసీపీ ఎంపీ చేసిన స్టాండ్ అప్ కామెడీ నన్ను ఫిదా చేసింది’ అని లోకేశ్ ట్వీట్‌లో పేర్కొన్నాడు.
రాజకీయాల్లోకి వచ్చినప్పటి నుంచి లోకేశ్ పండించినంత కామెడీ సినిమాల్లో రేలంగి, బ్రహ్మానందం, అలీ…తదితర హాస్య నటులు కూడా పండించి ఉండరు. అసలు లోకేశ్ లేని ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు ఉల్లి లేని చప్పిడి కూరతో సమానమే.
మొత్తానికి మిథున్‌రెడ్డికి సదరు కంపెనీపై అవగాహన లేకుండా మాట్లాడటంతో లోకేశ్ పండగ చేసుకున్నాడు. ఎప్పుడూ తాను కామెడీ చేస్తూ…అందర్నీ నవ్వుల్లో ముంచెత్తే లోకేశ్‌ను ఫిదా చేసిన మిథున్‌రెడ్డిని అభినందించాల్సిందే. ఇంతకూ తన హక్కులను ఇతరులు లాక్కుంటుంటే లోకేశ్‌కు కామెడీ ఎలా అవుతుందో అర్థం కావడం లేదు. కానీ మిధున్‌రెడ్డి మాత్రం లోకేశ్ హక్కులను లాక్కుంటే మాత్రమే ఆయన అభిమానులు చూస్తూ ఊరుకోరని గుర్తిస్తే మంచిది. ఎందుకంటే ఎవరి పని వాళ్లే చేయాలి. లోకేశ్‌లా నవ్వించడం అందరి వల్ల కాదు. అది లోకేశ్‌కు మాత్రమే అబ్బిన కళ.