'దర్భార్' సినిమా నష్టాల వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నటించిన ఆ సినిమాకు సంబంధించి నష్టపోయిన వాళ్లు రోడ్డెక్కారు ఇప్పటికే. భారీ ధరలకు ఆ సినిమాను కొన్న వాళ్లు ఇప్పుడు అంతే స్థాయి నష్టాలు రావడంతో.. పరిహారం కోరుతూ ఉన్నారు.ఇప్పటికే ఆ సినిమా ప్రొడక్షన్ హౌస్ ను వాళ్లు చుట్టుమట్టినా.. ఆ నిర్మాతలు చేతులెత్తేశారు. తాము కూడా ఆ సినిమాతో నష్టపోయినట్టుగా.. దర్శకుడు మురుగదాస్ భారీ పారితోషకం తీసుకున్నాడని, నష్టాలను అతడితో వసూలు చేసుకోవాలని దాని నిర్మాతలు స్పష్టం చేశారట.
ఇలాంటి నేపథ్యంలో.. డిస్ట్రిబ్యూటర్లు మురుగదాస్ ఆఫీసును ముట్టడించినట్టుగా తెలుస్తోంది. చెన్నైలో ఈ మేరకు వరసగా తన ఆఫీసు మీద కొంతమంది అగంతకులు పడుతున్నారని, తమ వారిని బెదిరించారని అంటున్నారట దర్శకుడు మురుగదాస్. తమ వాళ్లపై దాడి జరిగిన నేపథ్యంలో.. తమకు రక్షణ కల్పించాలని కోరుతూ చెన్నై పోలిస్ కమిషన్ ను ఆశ్రయించాడట మురుగదాస్. ఇలా దర్బార్ సినిమాతో డిస్ట్రిబ్యూటర్లు భారీగా నష్టపోవడం.. దాని దర్శకుడు మురుగదాస్ కు ఇబ్బందికరంగా మారినట్టుగా ఉంది.
ఇది వరకూ మురుగ కొన్ని సినిమాలను ప్రొడ్యూస్ చేశాడు. అప్పుడు కూడా ఆయన ఇలాంటి ఇబ్బందులను పడలేదు. అయితే దర్శకుడిగా వ్యవహరించిన సినిమా నష్టాలు మాత్రం మురుగకు ఇలాంటి ఇక్కట్లు తెచ్చినట్టుగా ఉన్నాయి. దర్భార్ సినిమాకు ఈ దర్శకుడు ఏకంగా 60 కోట్ల రూపాయల పారితోషకం తీసుకున్నాడని అందుకే ఈ పరిస్థితి వచ్చిందనేది ఇన్ సైడ్ టాక్!