సరిగ్గా 4 రోజుల కిందట శ్రీశైలం పరిధిలోని నల్లమల అడవుల్లో జరిగిన హత్యను పోలీసులు ఛేదించారు. మహిళను హత్య చేసిన మట్కాస్వామిని పోలీసులు అరెస్ట్ చేశారు. అంతేకాదు.. మహిళను తనతో పాటు మట్కాస్వామి తీసుకుపోతున్న విజువల్స్ ను కూడా పోలీసులు రిలీజ్ చేశారు.
మహారాష్ట్రకు చెందిన మహిళకు కాస్త దైవ భక్తి ఎక్కువ. ఏమాత్రం సమయం దొరికినా దేశంలోని వివిధ దేవాలయాల్ని దర్శించుకోవడం ఆమెకు అలవాటు. అందులో భాగంగానే శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చిందామె. ఇక తమిళనాడుకు చెందిన మట్కాస్వామి దాదాపు రెండేళ్ల కిందటే శ్రీశైలం చేరుకున్నాడు. వీళ్లిద్దరికీ అక్కడ పరిచయమైంది.
మంచివాడిగా నమ్మించిన మట్కాస్వామి, ఆమెను అక్కమహాదేవి ఆలయానికి తీసుకెళ్తానని చెప్పాడు. ఆమె నమ్మి, అతడితో వెళ్లింది. అభయారణ్యంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ్నుంచి కొంతదూరం నడవాలని చెప్పాడు. ఆమె అతడ్ని అనుసరించింది. అటవీ ప్రాంతంలో కొంతదూరం వెళ్లిన తర్వాత మట్కాస్వామీ, మహిళపై అత్యాచారానికి పాల్పడ్డాడు. తన వివరాలు బయటకు చెబుతుందేమోనని భయపడి, నిమ్మకాయలు కోసే కత్తితో ఆమెను హత్య చేశాడు.
ఇక తనను ఎవరూ గుర్తించరని హంతకుడు భావించాడు. కానీ అడవిలో కూడా సీసీ కెమెరాలు ఉంటాయనే విషయం అతడికి తెలియదు. దీంతో పాటు మృతదేహం వద్ద లభించిన బ్యాగ్ లో ఆధారాల ఆధారంగా శ్రీశైలంలో ఉన్న సీసీ ఫూటేజ్ ను కూడా పోలీసులు పరీక్షించారు. రెండు వీడియోలు మ్యాచ్ అవ్వడంతో మట్కాస్వామిని అదుపులోకి తీసుకున్నారు. సీసీ టీవీ ఫూటేజ్ వీడియోను ఈరోజు మీడియాకు విడుదల చేశారు.