మెడ వరకు జుట్టు పెంచుకుని జులపాలు వదిలేసి.. చేత్తో సరిచేసుకుంటూ రఫ్ గా కనిపించడం ఒకప్పటి ఫ్యాషన్. హీరోలు కూడా డిప్ప కటింగ్ కి అలవాటు పడ్డాక.. ఇప్పుడెవరూ జుట్టు పెంచడానికి ఇష్టపడట్లేదు. ఒకవేళ పెంచినా అమ్మాయిల్లాగా రిబ్బనో, రబ్బర్ బ్యాండో తగిలించేసి, లేదా రుషులు చేసినట్టు పైకి కొప్పుకట్టి వదిలేయడం ట్రెండ్ అయి కూర్చుంది. అన్ని రకాల ఫ్యాషన్లు కనిపిస్తున్నా.. ఎక్కువమంది ఇస్మార్ట్ లుక్ కే ఫిక్స్ అయ్యారు.
అయితే చాలా రోజుల తర్వాత అల వైకుంఠపురంలో అల్లు అర్జున్ వెనక కాస్త జుట్టు పెంచి న్యూ లుక్ లో అదరగొట్టాడు. ఒకప్పటి చిరంజీవి స్టైల్ ని గుర్తు చేశాడు. బన్నీకి అది బాగానే సెట్ అయింది కూడా. వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాతో విజయ్ దేవరకొండ కూడా ఇలాగే లాంగ్ హెయిర్ తో కనిపిస్తున్నాడు. ఇక పవన్ కల్యాణ్ కూడా ఇదే ట్రెండ్ కంటిన్యూ చేయబోతున్నాడు.
క్రిష్ సినిమాలో ఇలా పెరిగిన జుట్టుతో కనిపించబోతున్నాడు పవన్. గడ్డం తీసేసి పెద్ద మీసాలతో, జుట్టు మాత్రం ట్రిమ్ చేయకుండా కార్యకర్తల మీటింగ్ కు హాజరయ్యాడు. గడ్డం తీసేశాక వయసు పెరిగిన ఛాయలు కనిపిస్తున్నాయి కానీ, మునుపటి గ్రేస్ మాత్రం పవన్ లో ఏమాత్రం తగ్గలేదని క్లియర్ గా తెలుస్తోంది.
తొలిప్రేమ, బద్రి, ఖుషి.. సినిమాల టైమ్ లో పవన్ కల్యాణ్ హెయిర్ స్టైల్ పెద్ద ఫేమస్. ఇప్పటికి కూడా దాన్ని ఫాలో అయ్యే అభిమానులున్నారు. ఆ తర్వాత కొమరంపులి, కాటమరాయుడు టైమ్ లో అప్పుడప్పుడు కాస్త వేరియేషన్ చూపించినా ఏదీ పెద్దగా క్లిక్ కాలేదు. మళ్లీ ఇన్నాళ్లకు పవన్ తనదైన స్టయిల్ స్టేట్ మెంట్ ఇవ్వబోతున్నాడన్నమాట. పింక్ రీమేక్, క్రిష్ సినిమాల తర్వాత అందరూ పవన్ స్టైల్ నే ఫాలో అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. మొత్తమ్మీద రీఎంట్రీలో కూడా పవన్ తన మార్క్ మిస్ అవ్వట్లేదు.