సినిమా రివ్యూ: జాను

సమీక్ష: జాను రేటింగ్‌: 3/5 బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ తారాగణం: శర్వానంద్‌, సమంత, సాయి కిరణ్‌ కుమార్‌, గౌరి జి. కిషన్‌, వెన్నెల కిషోర్‌, వర్ష బ్లొమ్మ, శరణ్య ప్రదీప్‌, తాగుబోతు రమేష్‌,…

సమీక్ష: జాను
రేటింగ్‌: 3/5
బ్యానర్‌:
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌
తారాగణం: శర్వానంద్‌, సమంత, సాయి కిరణ్‌ కుమార్‌, గౌరి జి. కిషన్‌, వెన్నెల కిషోర్‌, వర్ష బ్లొమ్మ, శరణ్య ప్రదీప్‌, తాగుబోతు రమేష్‌, రఘుబాబు, తనికెళ్ల భరణి త‌దిత‌రులు
మాటలు: మిర్చి కిరణ్‌
కూర్పు: ప్రవీణ్‌ కె.ఎల్‌.
సంగీతం: గోవింద్‌ వసంత
ఛాయాగ్రహణం: మహేందిరన్‌ జయరాజు
నిర్మాతలు: రాజు, శిరీష్‌
కథ, కథనం, దర్శకత్వం: సి. ప్రేమ్‌ కుమార్‌
విడుద తేదీ: ఫిబ్రవరి 07, 2020

ఏ ప్రేమకథలో అయినా కానీ ఆ ప్రేమజంట చివరకు కలుస్తారా లేదా అనేదే క్లయిమాక్స్‌. ‘జాను’లో పరిచయం కావడమే పదిహేడేళ్ల క్రితం విడిపోయిన ఇద్దరు ప్రేమికులు మళ్లీ స్కూల్‌ రీయూనియన్‌లో కలుస్తారు. అప్పటికే విడిపోయిన ఈ ప్రేమికులు అసలు ఎలా విడిపోయారు, ఇప్పుడు ఈ దూరాన్ని ఎలా డీల్‌ చేస్తారు అనేది ‘జాను’ కథ.

జాను పట్ల తనకి వున్న ఫీలింగ్‌కి పేరేమిటో కూడా తెలియని వయసులో ఆమెని ఇష్టపడతాడు రామ్‌. కొన్ని పరిస్థితుల‌ వల్ల‌ దూరమయిన ఈ జంట మళ్లీ కలుసుకోలేదు. తను ఎదురు పడినపుడు గుండె సడి పెరిగి, గొంతు పెగల‌నంత ఇబ్బంది పడే రామ్‌ తన ప్రేమని ఎప్పుడూ వ్యక్తం చేయడు. అసలు అతను ఎక్కడున్నాడో కూడా తెలియని జాను పరిస్థితుల‌కి అనుగుణంగా శ్రీమతి అయిపోయి, తల్లి కూడా అవుతుంది. పదిహేడేళ్ల తర్వాత కలిసిన ఈ జంట అప్పటి తమ స్మృతులు నెమరు వేసుకుంటుంది. రామ్‌ని దాటి జాను లైఫ్‌ ముందుకెళ్లినా కానీ రామ్‌ మాత్రం ఆమె జ్ఞాపకాల‌తో అక్కడే వుండిపోయాడు.

అసలు వాళ్లిద్దరూ విడిపోవడానికి దారి తీసిన పరిస్థితులు ఏంటి? ఒకవేళ విడిపోతే మళ్లీ కలిసే ప్రయత్నం ఎందుకు చేయలేదు? రామ్‌తో జానకి చెబుతుంది… ఏదో ఒక రోజు తిరిగి వస్తావని చాలా ఎదురు చూశానని. తన పెళ్లి పీటల‌ మీదినుంచి సినిమాల‌ తరహాలో తీసుకుపోతావని అనుకున్నానని చెబుతుంది. తనని కల‌వడానికి వచ్చానని, ఎప్పుడూ తనతో మాట్లాడ్డానికి ధైర్యం చాల‌ని తనకి ఒకే ఒక్కసారి వచ్చిన ధైర్యంతో కల‌వడానికి వచ్చినా నువ్వు కల‌వను అని చెప్పేసరికి వెళ్లిపోయానని, అప్పట్నుంచి తన గురించి ప్రతి విషయం తెలుసుకున్నానని, చివరకు పెళ్లికి కూడా వచ్చానని చెప్పేసరికి జాను తట్టుకోలేకపోతుంది. ఎవరో అనుకుని రామ్‌ని కల‌వలేకపోవడం వల్ల‌ అతనితో జీవితాన్ని పంచుకునే అవకాశాన్ని కోల్పోయానని రోదిస్తుంది.  ‘జాను’లోని ప్రేమకథ రెగ్యుల‌ర్‌గానే అనిపించినా కానీ ఇలాంటి సన్నివేశాలు హృదయాన్ని తాకుతాయి.

ఒకవేళ అతడిని కలిసి వుంటే తన జీవితం ఎలా వుండేదనేది ఊహించుకుని రామ్‌ స్టూడెంట్స్‌కి జాను చెప్పే కథ, ‘మా సర్‌ మంచివాడండీ. ఆయనని జాగ్రత్తగా చూసుకోండి’ అని రామ్‌ స్టూడెంట్‌ జానుకి చెబితే, ‘మీ సర్‌ మంచివాడని నాకు తెలుసు. కానీ అతడిని జాగ్రత్తగా చూసుకోవడం ఎలాగో తెలియడం లేదు’ అని చెప్పే సన్నివేశం… ఇలాంటి మూమెంట్స్‌ ఈ చిత్రాన్ని ప్రత్యేకతని చాటుతాయి. ఈ తరహా ఎమోషనల్‌ మూమెంట్స్‌ ఈ చిత్రంలో అనేకం వుంటాయి.  కేవ‌లం హీరోహీరోయిన్లు మాత్రమే ద్వితియార్ధమంతటా కనిపిస్తారు. మామూలుగా అయితే అలాంటి సెటప్‌ బోర్‌ కొట్టించేస్తుంది. కానీ వారి మధ్య బల‌మైన సన్నివేశాలు, హత్తుకునే సంభాషణతో మనసుని స్పృశిస్తారు. ముఖ్యంగా ప్రీ క్లయిమాక్స్‌, క్లయిమాక్స్‌లో వచ్చే సీన్స్‌ ఎమోషన్స్‌తో విశేషంగా ఆకట్టుకుంటాయి. పదిహేడేళ్ల తర్వాత కలిసినా కానీ తమ హద్దు తాము తెలుసుకుని, ఒకరి మంచిని ఒకరు కోరుకునే ప్రేమికుల‌ ప్రవర్తన మెప్పిస్తుంది. జానుకి కూతురు వుందంటే బాధ పడకుండా, ఆమె కూతురి ఫోటో చూడడానికి రామ్‌ పడే ఆరాటం లాంటివి ఈ చిత్రంలోని పాత్రని చిరకాలం గుర్తుండేట్టు చేస్తాయి.

ఇక జాను ఇబ్బందుల‌ విషయానికి వస్తే… ఒరిజినల్‌ 96కి దర్శకుడు ప్రేమ్‌కుమార్‌కి ఎలాంటి రాజీలు పడాల్సిన పని పడలేదు. లీడ్‌ యాక్టర్స్‌ దగ్గర్నుంచి ప్రతి విషయాన్ని తనకి కావాల్సినట్టుగా ఎంచుకున్నాడు. అప్పటికే మెచ్యూర్డ్‌ పాత్రలు చేస్తోన్న విజయ్‌ సేతుపతి ల‌వ్‌స్టోరీ చేశాడు. ప్రేయసి కోసం జీవితమంతా అలాగే మిగిలిపోయిన వాడిగా చూడగానే అనిపిస్తాడు. కానీ శర్వానంద్‌ యంగ్‌గానే కనిపిస్తాడు. అతని గడ్డంలో తెల్ల‌ వెంట్రుకలు చూపించి బల‌వంతంగా ఏజ్డ్‌ అన్నట్టు చూపించారు. నిజానికి శర్వానంద్‌తో ఆ టెన్త్‌ క్లాస్‌ క్యారెక్టర్‌ కూడా వేయించినా కానీ ఎవరికీ ఎలాంటి ఇబ్బంది అనిపించదన్నట్టుంటాడు. అలాగే త్రిష కూడా అందులోని మిడిల్‌ ఏజ్డ్‌ ఆంటీ పాత్రకి తగ్గట్టుంది. శర్వానంద్‌, సమంత ఇద్దరూ చాలా బాగా నటించినా కానీ, ఒరిజినల్‌ చూడని వారికి ఎలాంటి లోటు తెలియకుండా పర్‌ఫార్మెన్స్‌ ఇచ్చినా కానీ ‘96’ చూసిన వారు మాత్రం సేతుపతి, త్రిషని మిస్‌ అవుతారు. అలాగే శర్వానంద్‌, సమంత కోసం నైంటీస్‌ కథని 2004కి మార్చారు. దాంతో కొన్ని అడ్జస్ట్‌మెంట్స్‌ అవసరమయ్యాయి. కానీ వాటిని చేయడానికి దర్శకుడు ఇష్టపడలేదు.

దాంతో ఇంత ‘పవిత్ర ప్రేమ’ ఇప్పుడుంటుందా అనే ప్రశ్న తలెత్తుతుంది. ప్రేమించిన అమ్మాయి చెయ్యి తాకినా కూడా అదిరి పడే అబ్బాయి… ఆ అమ్మాయి కోసం ‘వర్జిన్‌’గానే వుండిపోయిన అబ్బాయి… ఇలాంటి క్యారెక్టర్‌ని ఇప్పుడు వుంటాడనుకోవడం కాస్త కష్టమే. అందుకే తమిళంలో తొంభైలో జరిగిన ప్రేమకథగా దర్శకుడు చూపించాడు. కానీ ఇక్కడ శర్వానంద్‌, సమంత ఏజ్‌కి అనుగుణంగా అడ్జస్ట్‌ చేసారు. దీంతో అప్పటి వాతావరణం సృష్టించడంలో దర్శకుడిలో కాస్త గందరగోళం ఏర్పడిరది. కనీసం పల్లెటూరిలో కాకుండా విశాఖపట్నంలో స్టోరీ సెట్‌ చేయడంతో స్టూడెంట్స్‌, వారి ప్రవర్తన అప్పటికే ఇంటర్నెట్‌ పాపులర్‌ అయిన ప్రపంచాన్ని ప్రతిబింబించకుండా పాత పద్ధతుల్లో సాగుతున్నట్టు అనిపిస్తుంది. కుటుంబమంతా టీవీ ముందు చేరి దూరదర్శన్‌లో కార్యక్రమాలు చూడడం కూడా దర్శకుడు తొంభై కాలాన్నే చూపించాలని ఫిక్స్‌ అయినట్టు అనిపిస్తుంది.

ఇలాంటి ఇబ్బందులు పంటి కింద రాయిలా తగులుతున్నా, కథాగమనం మందకొడిగా సాగుతున్నా కానీ బలమైన భావోద్వేగాలు, హృద్యంగా రాసుకున్న సన్నివేశాలు, శర్వానంద్‌, సమంత అభినయం ‘జాను’ చిత్రానికి బలంగా నిలిచాయి. 96లా క్లాసిక్‌ అయ్యేంతగా దర్శకుడు ఆ చిత్రంలోని ఆత్మని పునఃసృష్టించలేకపోయాడు. కానీ సిన్సియర్‌ స్టోరీ టెల్లింగ్‌, స్ట్రాంగ్‌ ఎమోషన్స్‌, కదిలించే సంగీతం, గుర్తుండిపోయే పాత్రలు, బలంగా తాకే భావోద్వేగాలు ‘జాను’ని రెగ్యుల‌ర్ సినిమా మధ్య స్పెషల్‌గా నిలబెడతాయి. ఒరిజినల్‌ చూడని వారికి కంపారిజన్స్‌ కూడా వుండవు కనుక జాను మరింత మెప్పించే అవకాశముంది. మెజారిటీ ఆడియన్స్‌ కోరుకునే వినోదం, వేగం లేకపోవడం జానుని లిమిటెడ్‌ ఆడియన్స్‌కి పరిమితం చేస్తుంది.

బాటమ్‌ లైన్‌: ఎమోషనల్‌ ల‌వ్‌స్టోరీ!

గణేష్‌ రావూరి