ఏపీ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి భారీ షాక్ ఇచ్చింది. ఆర్-5 జోన్లో పేదల ఇళ్ల నిర్మాణంపై స్టే ఇచ్చింది. ఇళ్ల నిర్మాణాలను వెంటనే ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ మేరకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం మధ్యంతర ఉత్తర్వులు వెలువరించింది.
కాగా రాజధానేతర ప్రాంతవాసులకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ఆర్-5 జోన్ ఏర్పాటుతో పాటు 1,402 ఎకరాలను గుంటూరు, ఎన్టీఆర్ జిల్లాల కలెక్టర్లకు ప్రభుత్వం బదిలీ చేసింది. దీంతో రాజధాని గ్రామాల రైతు సంక్షేమ సంఘాలు హైకోర్టును ఆశ్రయించాయి. విచారణ అనంతరం జస్టిస్ డివిఎస్ఎస్ సోమయాజులు, జస్టిస్ చీకటి మానవేంద్రనాథ్ రాయ్, జస్టిస్ రవినాథ్ తిల్హరిలతో కూడిన హైకోర్ట్ ఫుల్ బెంచ్ ఇళ్ల నిర్మాణంపై స్టే విధిస్తూ ఆదేశాలిచ్చింది.
గత నెలలో సీఎం జగన్ పేదలకు ఇళ్ల పట్టాలు పంపిణీ చేశారు. ఆ సభలో జగన్ మాట్లాడుతూ.. అమరావతిలో పేదలకు ఇళ్లు ఇస్తే సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని కొందరు కోర్టుకు వెళ్లారు. పేదలకు ఇళ్లు కట్టించకుండా చంద్రబాబు, దత్తపుత్రుడు అడ్డుకున్నారు. ఇప్పటికీ ఇళ్లు కట్టకుండా దుర్మార్గులు అడ్డుకుంటున్నారు. పేదలకు వ్యతిరేకంగా హైకోర్టులో 18 కేసులు, సుప్రీంకోర్టులో 5 కేసులు వేశారంటూ విమర్శించిన విషయం తెలిసిందే.