నిర్మాత అనిల్ సుంకర, దర్శకుడు మెహర్ రమేష్, హీరో… మెగాస్టార్ చిరంజీవి, ఇంకా.. తమన్నా.. సుశాంత్ వుండనే వున్నారు.
2013 తరువాత అంటే సరిగ్గా పదేళ్ల తరువాత దర్శకుడు మెహర్ రమేష్ అందిస్తున్న సినిమా ఇది. శక్తి, షాడో సినిమాలు ఇచ్చిన నెగిటివ్ ఫలితాల కారణంగా మెహర్ రమేష్‌కు చేతిలోకి సినిమాలు రాలేదు. ఇన్నాళ్ల తరువాత సినిమా దొరికింది. అది కూడ రీమేక్. మెగాస్టార్ లాంటి హీరో, భారీ ప్రొడక్షన్ సంస్థ.. దేనికీ లోటు లేదు. అందువల్ల ఇక ప్రూవ్ చేసుకోవాల్సింది తన స్టామినా మాత్రమే. అలా ప్రూవ్ చేసుకుంటేనే టాలీవుడ్‌లో మెహర్ రమేష్‌కు కంటిన్యూటీ వుండడానికి అవకాశం వుంటుంది. లేదంటే కష్టం అవుతుంది.
నిర్మాత అనిల్ సుంకర. ఇటీవల అందించిన భారీ ప్రాజెక్ట్ ఏజెంట్ బాక్సాఫీస్ దగ్గర గట్టిగా ఫెయిలయింది. నిర్మాతగా ఆయన కొంత నష్టపోయారు. బయ్యర్లు అయితే దారుణంగా కుదలేయిపోయారు. ఇప్పుడు ఈ సినిమా కచ్చితంగా హిట్ కొట్టాలి. లేదంటే బయ్యర్లు మళ్లీ మరోసారి దెబ్బతినే ప్రమాదం వుంది. ఇప్పటికే ఏజెంట్ వల్ల కొందరు బయ్యర్లు మళ్లీ ఇప్పట్లో కోలుకోలేని స్థితి, ఆస్తులు అమ్ముకునే స్థితికి చేరుకున్నారు. ఇప్పుడు ఈ సినిమా కూడా అలా ఝలక్ ఇస్తే భవిష్యత్‌లో అనిల్ సుంకర భారీ సినిమాలు నిర్మించి మార్కెట్ చేయడం కష్టం అవుతుంది.
తమన్నా కెరీర్.. ఓ ఎండ్ కు చేరిపోయింది. ఆమె రెండు పెద్ద సినిమాలు ఒకే రోజు విడుదలవుతున్నాయి. జైలర్ లో.. కావాలయ్యా.. నువ్వు కావాలి.. అనే పాట పెద్ద హిట్ అయింది. భోళాలో ఎలా వుండబోతోందో తెలియాల్సి వుంది. ఈ సినిమాలు ఆమెకు ప్లస్ అయితే సీనియర్ హీరోల పక్కన చాన్స్ లతో మరి కొంత కాలం కెరీర్ సాగించే అవకాశం వుంటుంది.
సుశాంత్.. అక్కినేని బ్యాక్ గ్రవుండ్ వున్నా, స్ట్రగులింగ్ తప్పడం లేదు. ఖాతాలో హిట్ లు అనేవి అతి తక్కువ. ఫ్లాపులు అంటే లెక్కలు ఎక్కువ. ఇటీవలే రావణాసుర వచ్చి వెళ్లింది. ఇప్పుడు ఈ సినిమా మలి చాన్స్. సరైన పెర్ ఫార్మెన్స్, హిట్ ఖాతాలో పడితే యంగ్ హీరోలను పక్కన పెట్టుకునే సీనియర్ హీరోలు చాలా మంది వెయిటింగ్ లో వున్నారు. అక్కడి నుంచి పిలుపు రావచ్చు.
ఇక సినిమాకే కీలకం.. ప్రాజెక్ట్ కే కీలకం.. మెగాస్టార్. ఆచార్య లాంటి వైవిధ్యమైన రోల్ ట్రయ్ చేసారు.. జనాలకు నచ్చలేదు. గాడ్ ఫాదర్ గా కనిపించారు. జస్ట్ ఓకె అన్నారు. వాల్తేర్ వీరయ్య అంటూ మాస్ కామెడీ చేస్తే ఓహో అన్నారు. ఇప్పుడు ఓ అన్నగా ప్లస్ మాస్ హీరోగా రెండు షేడ్స్ వున్న పాత్ర చేస్తున్నారు. వాల్తేర్ వీరయ్య ఇచ్చిన కిక్‌తో ఆ ఛాయలు పక్కాగా వుండేలా చూసుకున్నట్లు కనిపిస్తోంది. అందువల్ల ఇది కూడా అలా సక్సెస్ అయితే ఇక ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. ఇకపై ఈ రూట్ లోనే వెళ్లిపోతారు. లేదంటే మళ్లీ ఏ తరహా సినిమా చేయాలా అని ఆలోచనలో పడతారు.
అందువల్ల భోళా శంకర్ చాలా మంది టెస్టింగ్ ఫీల్డ్ గా మారనుంది.