ఏళ్లకు ఏళ్లుగా వార్తల్లోనే వుంటూ వస్తున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. ఒరిజినల్ కథ అనుకున్నారు. మళ్లీ దాన్ని పక్కన పెట్టి తెరి రీమేక్ గా ప్లాన్ చేసారు. పూజ చేసి, మూడు నాలుగు రోజులు షూట్ చేసి ఆగారు. ఆ ఫుటేజ్ నుంచే గ్లింప్స్ రిలీజ్.. హడావుడి. ఒకటి కాదు. ఆ తరువాత ఇక మలి షెడ్యూలు లేదు. బ్రో, ఓజి సినిమాల మీదకు, ఆపై వారాహి మీదకు వెళ్లిపోయారు పవన్ కళ్యాణ్. ‘మనల్ని ఎవడ్రా ఆపేది’ అనే ట్వీట్ మాత్రమే మిగిలింది మేకర్లకు.
ఇప్పుడు అవకాశం వచ్చింది. ఎన్నికలు మరో ఆరు నెలల వరకు వుండవని తేలిపోయింది. ఈ లోగా ఓ మాంచి మాస్ సినిమా చేస్తే ఎన్నికల వేళకు ఉపయోగపడుతుందనే సలహాలు నచ్చాయి. మొత్తం మీద మలి షెడ్యూలు ప్లానింగ్‌కు హీరో పవన్ కళ్యాణ్ జెండా ఊపారు. ఆ మేరకు సన్నాహాలు మొదలయ్యాయి. తెరి రీమేక్ చిన్న సినిమా కాదు, బ్రో మాదిరిగా ఇరవై రోజులు, ఓజి మాదిరిగా నలభై రోజులు ఇస్తే సరిపోదు. కనీసం 90 రోజులు ఇవ్వాలి. ఎంత కాదన్నా అరవై డెభై రోజులు షూట్ చేయాలి.
అంతకు మించి పవన్‌కు ఇష్టపడని డ్యాన్స్ లు, ఫైట్ లు చేయాలి. ఎన్ని షెడ్యూళ్లు వేస్తారు.. ఎన్ని రోజులు డేట్ లు ఇస్తారు. ఓజి పరిస్థితి, డిసెంబర్ విడుదల ఏమిటి? ఆపై పొలిటికల్ యాక్టివిటీ సంగతేమిటి? ఇవన్నీ చూసుకుని చేయాల్సి వుంటుంది. కానీ ఈ లోగానే సంక్రాంతి 2024 విడుదల అంటూ అత్యుత్సాహంతో ‘ఏవరో’ ఫీలర్లు బలంగా వదిలేసారు. ‘నమ్మకమైన వర్గాలు’ కావడంతో ఫీలర్లు వార్తలుగా, ట్వీట్ లు గా మారిపోయాయి.
కానీ ఈ ఆగస్టు నుంచి డిసెంబర్ లోగా అంటే నాలుగున్నర నెలల్లో తెరి లాంటి భారీ సినిమా రీమేక్ ను ఫినిష్ చేయడం అయ్యే పనేనా? హీరో కోపరేట్ చేసి, వరుసగా మరే పని పెట్టుకోకుండా ఈ సినిమా మీదే వుండిపోతే అయ్యే అవకాశం వుంది. కానీ పవన్ కు అలా సాధ్యం కాదు కదా.
సంక్రాంతికి విడుదలైతే దర్శకుడు హరీష్ శంకర్‌కూ మంచిదే. ఎందుకంటే ఉస్తాద్ ఇప్పుడు వుండదేమో అని ఆయన రవితేజతో సినిమా ఫిక్స్ చేసుకున్నారు. ఆ సినిమాను సంక్రాంతి నుంచి చేయాల్సి వుంది. ఇప్పుడు ఈ సినిమా కొత్త షెడ్యూలు మొదలు కావడం అన్నది దానికి బ్రేక్‌గా మారకూడదు అంటే సంక్రాంతికి విడుదల కావాలి.