జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఊపిరి

గ‌త కొంత కాలంగా వివిధ అంశాల‌పై హైకోర్టులో వ‌రుస ఎదురు దెబ్బ‌లు తింటున్న జ‌గ‌న్ స‌ర్కార్‌కు గొప్ప రిలీఫ్ దొరికింది. క‌ర్నూల్‌కు విజిలెన్స్ క‌మిష‌న‌ర్‌, కమిష‌న‌ర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాల‌యాల త‌ర‌లింపుపై స్టే ఇచ్చేందుకు…

గ‌త కొంత కాలంగా వివిధ అంశాల‌పై హైకోర్టులో వ‌రుస ఎదురు దెబ్బ‌లు తింటున్న జ‌గ‌న్ స‌ర్కార్‌కు గొప్ప రిలీఫ్ దొరికింది. క‌ర్నూల్‌కు విజిలెన్స్ క‌మిష‌న‌ర్‌, కమిష‌న‌ర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాల‌యాల త‌ర‌లింపుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాక‌రించింది. ఈ నిర్ణ‌యంతో జ‌గ‌న్ స‌ర్కార్‌కు ఊపిరిపోసిన‌ట్టైంది. కార్యాల‌యాల త‌ర‌లింపుపై స్టే ఇవ్వాల‌ని పిటిషన‌ర్ విజ్ఞ‌ప్తిని హైకోర్టు ప‌రిగ‌ణ‌లోకి తీసుకోక‌పోవ‌డం  జ‌గ‌న్ స‌ర్కార్‌కు నైతికంగా చాలా బ‌లాన్ని ఇచ్చింద‌ని చెప్పొచ్చు.

క‌ర్నూల్‌కు విజిలెన్స్ క‌మిష‌న‌ర్‌, కమిష‌న‌ర్ ఆఫ్ ఎంక్వైరీస్ కార్యాల‌యాల త‌ర‌లిస్తూ ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వుల‌ను స‌వాల్ చేస్తూ హైకోర్టులో ప్ర‌జా ప్ర‌యోజ‌నాల వ్యాజ్యం దాఖ‌లైంది. ఈ విష‌య‌మై హైకోర్టులో విచార‌ణ‌లో భాగంగా  పిటిష‌న‌ర్ల‌కు ప‌లు ప్ర‌శ్న‌లు వేసింది. ప్ర‌భుత్వ కార్యాల‌యాల‌ను అమ‌రావ‌తి నుంచి మ‌రో ప్రాంతానికి మార్చ‌కూడ‌ద‌ని ఎక్క‌డైనా ఉందా? ఉంటే చెప్పండి అని ప్ర‌శ్నించింది. కార్యాల‌యాల మార్పు వెనుక ఏదో జ‌రుగుతోందంటే కుద‌ర‌ద‌ని, వాటి ఆధారాల‌ను చూపాల‌ని కోరింది.

లేనిపోని అపోహ‌లు వ‌చ్చేలా వాద‌న‌లు చేసి కోర్టు స‌మ‌యాన్ని పాడు చేయ‌వ‌ద్ద‌ని ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ జీకే మ‌హేశ్వ‌రి, న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎస్‌.జ‌య‌సూర్య‌ల‌తో కూడిన ధ‌ర్మాస‌నం సూచించింది. అంతేకాదు, పిటిష‌నర్ల త‌ర‌పు న్యాయ‌వాది వాద‌న‌లో జోక్యం చేసుకుంటూ రిట్లు వేయ‌డం కాద‌ని, చ‌ట్టాల‌ను కూడా లోతుగా అధ్య‌య‌నం చేసి రావాల‌ని, ఆధారాలు లేకుండా వాద‌న‌లు చేయ‌డం ఎంత మాత్రం స‌బ‌బు కాద‌ని పేర్కొంది.

పిటిష‌న‌ర్ త‌ర‌పు మ‌రో న్యాయ‌వాది కె.ఇంద్ర‌నీల్ బాబు వాదిస్తూ అమ‌రావ‌తిలో రాజ‌ధాని ప‌నుల‌న్నింటినీ ప్ర‌భుత్వం నిలిపివేసింద‌ని, ఇప్పుడు రెండు ఆఫీసుల్ని క‌ర్నూల్‌కు త‌ర‌లిస్తూ జీఓ ఇచ్చింద‌ని, ఇలా చేయ‌డం చ‌ట్ట వ్య‌తిరేక‌మ‌ని అన్నారు. ఇటీవ‌ల త‌ర‌లింపు వెనుక దురుద్దేశాలు ఉన్నాయ‌ని అన‌గా, డివిజ‌న్ బెంచ్ అభ్యంత‌రం చెప్పింది.

ఇష్టానుసారంగా ఆరోప‌ణ‌లు చేయ‌వ‌ద్ద‌ని, ప్ర‌సంగాలు చేయ‌వ‌ద్ద‌ని, అస‌లు ఆఫీసులు త‌ర‌లించ‌కూడ‌ద‌ని ఏ చ‌ట్టంలో ఉందో చెప్పాల‌ని ప్ర‌శ్నించింది. వాద‌న‌లో చెబుతున్న విష‌యాల‌న్నీ పిటిష‌న్‌లో ఉన్నాయా అని కూడా ప్ర‌శ్నించింది. దురుద్దేశాలు ఎవ‌రికి ఉన్నాయో కూడా చెబితే వాళ్ల‌ను కూడా పిలిచి విచారిస్తామ‌ని చెప్ప‌డంతో న్యాయ‌వాది మౌనంగా ఉండిపోయారు.

ఈ విధంగా గ‌త రెండు రోజులుగా కార్యాల‌యాల త‌ర‌లింపుపై హైకోర్టులో వాద‌న‌లు సాగాయి. చివ‌రిగా కార్యాల‌యాల త‌ర‌లింపుపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాక‌రించింది. ఈ నేప‌థ్యంలో కార్యాల‌యాల త‌ర‌లింపున‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోనుంది.

ఇదే నా చివరి ల‌వ్ స్టోరి సినిమా