‘అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియా….మన రాష్ట్రం నుంచి వెంటనే తరలిపోవాలి. రాజధాని మాత్రం అమరావతిలోనే కొనసాగాలి’ ఇదీ ‘ఎల్లో’ గ్యాంగ్ ఆకాంక్ష. అనంతపురం జిల్లాలో రూ.14 వేల కోట్లతో స్థాపించిన కియాపై అంతర్జాతీయ, జాతీయ, పేర్లతో చెలామణి అవుతున్న కిరాయి వార్తా పత్రికలు తలా ఒక ‘రాయి’ వేశాయి. వీటికి ప్రాంతీయ ‘పసుపు’ పత్రికలు తోడయ్యాయి.
అంతర్జాతీయ కార్ల తయారీ పరిశ్రమ కియా…మన రాష్ట్రం నుంచి తమిళనాడుకు తరలిపోతున్నదని ‘రాయిటర్స్’లో ఓ కథనం వచ్చింది. ‘ఏపీలో కొత్త ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ విధానాల్లో మార్పులు రావడంతో ప్లాంట్‌ను తమిళనాడుకు తరలించాలన్న యోచనలో కియా ఉన్నట్టు సమాచారం. రాష్ట్రంలో ఏర్పాటయ్యే పరిశ్రమల్లో స్థానికులకే 75 శాతం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం చెప్పడంతో నిపుణులైన సిబ్బంది దొరకడం కష్టమవుతోంది. ప్రోత్సాహకాల విషయంలో గత ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలను సమీక్షించాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. ఇది కియాకి ఇబ్బందిగా మారినట్టు సమాచారం’ …ఇదీ రాయిటర్స్‌లో కియాపై రాసిన కథనానికి సంబంధించి సంక్షిప్త సమాచారం.
ఎద్దు ఈనిందంటే గాటిన కట్టేయమని చెప్పే రాజకీయ పెద్ద మనుషులు, పత్రికలు, వార్తా చానళ్లు బహుశా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నంతగా మరెక్కడా ఉండరు, ఉండవు. రాయిటర్స్‌పై కథనం వచ్చిందో లేదో…చంద్రబాబు మీడియా ముందుకొచ్చాడు. ఆయన పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు.
‘నిర్దిష్టంగా అందరితో మాట్లాడే ఈ కథనాన్ని ఇచ్చారు. ఒక అంతర్జాతీయ సంస్థ తమ పరిశ్రమను ఒక రాష్ట్రంలో ఏర్పాటు చేసి రెండేళ్లలోనే మరో రాష్ట్రానికి మార్చాలని ఆలోచిస్తుందంటే ఎంత వేధించి ఉంటారు?. రాయిటర్స్‌కు ఆర్థిక అంశాలపై ప్రపంచ స్థాయిలో ఎంతో విశ్వసనీయత ఉంది. అలాంటి సంస్థను ఎవరైనా ప్రభావితం చేయగలరా? అదేమైనా సాక్షి పత్రికా? ’ ఇదీ 40 ఏళ్ల రాజకీయ అనుభవం ఉన్న చంద్రబాబు నోటి నుంచి వచ్చిన మాటలు.
ఇటీవల తెలుగు సమాజానికి ఈనాడును భగవద్గీతగా అభివర్ణించిన చంద్రబాబే…ఇప్పుడు రాయిటర్స్ విశ్వసనీయత గురించి సర్టిఫికెట్ ఇస్తున్నాడు. అంతేకాదు నిర్దిష్టంగా అందరితో మాట్లాడే ఈ కథనం ఇచ్చారని బాబు చెప్పడం వల్లే ఆ కథనంపై అనుమాన మేఘాలు ముసురుకున్నాయి.
చంద్రబాబు తానా అంటే తందానా అనే మరో నాయకుడు పవన్‌కల్యాణ్ ఆగమేఘాల మీద ప్రెస్‌నోట్ విడుదల చేశాడు. పెట్టుబడిదారులను భయపెడితే రాష్ట్రానికి పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయని పవన్‌కల్యాణ్ ప్రశ్నించాడు. నాయకుల ఫ్యాక్షన్ పోకడలతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతోందని, రాకరాక వచ్చిన కియా కార్ల కంపెనీ పక్క రాష్ట్రానికి తరలిపోయే పరిస్థితి దాపురించిందని ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు.
ఇదిలా ఉంటే తమ సంస్థ ఎక్కడికీ తరలిపోవడం లేదని కియా మోటార్స్ ఇండియా మార్కెటింగ్ అమ్మకాల హెడ్ మనోహర్ భట్ ప్రకటించాడు. అంతేకాదు, రాయిటర్స్ కథనం చూడగానే పెద్ద షాక్‌కు గురయ్యామన్నాడు. ఆంధ్రప్రదేశ్‌లో అద్భుతంగా నడుస్తున్న ప్లాంట్‌పై ఇలాంటి వార్త రావడం ఆశ్చర్యం కలిగించిందన్నాడు. అది పూర్తిగా అవాస్తవాలతో కూడుకున్న కథనమని, ఆ వార్త వెనుక ఎవరున్నారో అర్థం కావడం లేదని ఆయన చెప్పడం గమనార్హం.
ఇదే విషయమై పరిశ్రమలశాఖ మంత్రి గౌతమ్‌రెడ్డి, ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, ఇతర ఐఏఎస్ అధికారులు వెంటనే స్పందించారు. రూ.14 వేల కోట్ల పెట్టుబడి పెట్టిన కియా కార్ల తయారీ కంపెనీకి ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందించామని వారంతా స్పష్టం చేశారు. పరిశ్రమ ఎక్కడికీ తరలిపోదని స్పష్టం చేశారు. తమిళనాడు ప్రభుత్వం కూడా తాము కియాతో ఎలాంటి చర్చలు జరపలేదని పేర్కొంది.
నిజానికి టీడీపీ, జనసేన పార్టీల ప్రధాన ఆకాంక్ష ….మన రాష్ట్రం నుంచి కియా పరిశ్రమ తరలిపోవాలన్నదే. కియాపై చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌ల అవేదన కేవలం మొసలి కన్నీళ్లే. కియా తరలిపోతే, జగన్ జర్కార్ అప్రతిష్టపాలవుతుందని, తద్వారా తాము రాజకీయ లబ్ధి పొందాలని ఎదురు చూస్తున్నారు.
మరో వైపు రాజధాని అమరావతి విషయానికి వస్తే …విశాఖలో పరిపాలనా రాజధాని, కర్నూల్లో న్యాయ రాజధాని ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబితే మాత్రం….అది వీరికి రుచించదు. తమ రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అమరావతి నుంచి సచివాలయం, హైకోర్టు తరలిపోయేందుకు వీల్లేదంటూ కృత్రిమ ఉద్యమాన్ని సృష్టిస్తారు. మరోవైపు ప్రశాంతంగా పని చేసుకుపోతున్న కియా మాత్రం ఎక్కడికో తరలిపోతున్నదనే మన దేశానికి, ప్రాంతానికి సంబంధం లేని వార్తా సంస్థలో కథనం రాయించి దేశ వ్యాప్తంగా జగన్ సర్కార్ ప్రతిష్టను దెబ్బతీయాలని కుట్రపన్నారు.
రాజధాని విషయంలో జోక్యం చేసుకోలేం, అది రాష్ట్ర పరిధిలోని అంశమని కేంద్రం చెప్పినా…ఎల్లో గ్యాంగ్‌కు చెవికెక్కవు. ఆ సమాచారాన్ని మాత్రం దాస్తాయి. లేనిదాన్ని మాత్రం విస్తృతంగా దుష్ప్రచారం చేయడంలో వీరికి మించిన వాళ్లు దేశంలోనే లేరు. చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌లకు రాష్ట్ర ప్రయోజనాల కంటే సొంత ప్రయోజనాలపై పైన్నే శ్రద్ధ. వారి టార్గెట్ ఎంత సేపూ సీఎం జగనే. అందుకోసం ఎంతటి దుర్మార్గాలకైనా వారు వెనుదీయరు. ఇందుకు నిదర్శనం… రాయిటర్స్‌లో కియాపై రాయించిన కథనం, దాన్ని దేశ వ్యాప్తంగా వివాదం సృష్టించడం.