అయ్యో పాపం.. మళ్లీ దొరికిపోయావా పవన్

చాన్నాళ్ల తర్వాత మరోసారి తొందరగా స్పందించానని అనుకున్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేశానని చంకలు గుద్దుకున్నారు. కానీ ఎప్పట్లానే ఈసారి కూడా లేట్ అయ్యారు పవన్ కల్యాణ్. ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేసే టైమ్…

చాన్నాళ్ల తర్వాత మరోసారి తొందరగా స్పందించానని అనుకున్నారు. జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేశానని చంకలు గుద్దుకున్నారు. కానీ ఎప్పట్లానే ఈసారి కూడా లేట్ అయ్యారు పవన్ కల్యాణ్. ప్రభుత్వంపై ఆయన విమర్శలు చేసే టైమ్ కు సదరు టాపిక్ పై పూర్తి స్పష్టత రావడంతో పాటు, ఆ వివాదానికి తెరపడింది కూడా. అదే కియా తరలింపు అంశం.

కియా కార్ల ప్లాంట్ ను ఏపీ నుంచి తమిళనాడుకు తరలించే యోచనలో ఆ కంపెనీ ఉందంటూ ఓ కథనం వచ్చింది. దీనిపై టీడీపీ నుంచి దేవినేని ఉమ, గల్లా జయదేవ్ లాంటి వాళ్లు విమర్శలు కూడా చేశారు. ఆ వెంటనే ప్రభుత్వం నుంచి క్లారిటీ కూడా వచ్చేసింది. కియా అలాంటి ఆలోచనలో లేదని ప్రభుత్వం స్పష్టం చేయగా.. అటు కియా కూడా కథనాన్ని వాస్తవ దూరంగా కొట్టిపడేసింది. స్వయంగా కియా రంగంలోకి దిగి స్పష్టత ఇవ్వడంతో ఇక ఎవ్వరూ ఆ టాపిక్ ను ఎత్తలేదు.

ఇలా అంతా సద్దుమణిగిన తర్వాత పవన్ రంగంలోకి వచ్చారు. ఈరోజు మధ్యాహ్నం ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ఎప్పట్లానే ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. కియా లాంటి పరిశ్రమలు అనంతపురం నుంచి తరలిపోతున్నాయనే వార్తలు విస్మయాన్ని కలిగిస్తున్నాయంటూ మొసలికన్నీరు కార్చారు. కొత్త పరిశ్రమల స్థాపనకు సానుకూల పరిస్థితులు కల్పించాల్సిన ప్రభుత్వం తన బాధ్యతను విస్మరిస్తోందంటూ పెద్దపెద్ద మాటలు మాట్లాడారు. కియా తరలిపోతోందనే వార్త రాష్ట్ర ప్రభుత్వం విధానాల్లో లోపాలను తెలియజేస్తోందంటూ రాసుకొచ్చారు.

అయితే వివాదం లైమ్ లైట్లో ఉన్నప్పుడు పవన్ ఈ పని చేసుంటే బాగుండేది. అప్పటికే ఆలస్యమైంది. ప్రభుత్వంతో పాటు కియా కూడా ఖండిస్తూ వివరణ ఇచ్చిన తర్వాత పవన్ నుంచి ఈ ప్రెస్ నోట్ రావడంతో అంతా ఫక్కున నవ్వుకున్నారు. సహజంగా ఇష్యూ జరిగిన 2-3 రోజుల వరకు పవన్ స్పందించరు. ఆ తర్వాత తాపీగా దానిపై రియాక్ట్ అవుతారు. అయితే కియాపై మాత్రం పవన్ నుంచి రియాక్షన్ కాస్త వేగంగానే వచ్చిందని చెప్పుకోవాలి. కానీ పవన్ దురదృష్టం ఏంటంటే.. అంతకంటే వేగంగానే ఈ వివాదం సమసిపోయింది.

3 రాజధానుల విషయంలో కూడా పవన్ ఇలానే వేగంగా స్పందించి తిట్లు తిన్నారు. 3 రాజధానులకు వ్యతిరేకంగా ట్వీట్లు పెట్టి ఉత్తరాంధ్ర-రాయలసీమ ప్రజల ఆగ్రహానికి గురయ్యారు. ఇప్పుడు కియా విషయంలో కూడా వేగంగానే స్పందించానని భావించిన జనసేనాని.. మరోసారి అభాసుపాలయ్యారు.

ప్రస్తుతం జనసేన పార్టీ అఫీషియల్ పేజ్ లో పెట్టిన ప్రెస్ మీట్ పై ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. మళ్లీ లేట్ అయ్యావ్ అజ్ఞాతవాసి అంటూ సెటైర్లతో కుమ్మేస్తున్నారు నెటిజన్లు. మరికొందరైతే కియా ఇచ్చిన వివరణను, ప్రభుత్వం చేసిన ప్రకటనను స్క్రీన్ షాట్స్ తీసి తిరిగి పవన్ కే ట్యాగ్ చేస్తున్నారు.

కులాలకు సంబంధించి  త్వరలో పుస్తకం రాస్తాను