ఎమ్బీయస్‌: రాజకీయ వారసుడిగా నవీన్‌ పట్నాయక్‌

                            ప్రజాస్వామ్య రాజకీయాల్లో కుటుంబ వారసత్వం రాచరికపు అవలక్షణపు అవశేషాల్లో ఒకటి అని చాలామంది అభిప్రాయ…

                            ప్రజాస్వామ్య రాజకీయాల్లో కుటుంబ వారసత్వం రాచరికపు అవలక్షణపు అవశేషాల్లో ఒకటి అని చాలామంది అభిప్రాయ పడతారు. ‘‘సినిమా రంగంలో లాగానే మా తండ్రి పేరు మాకు ప్రవేశానికి ఉపయోగపడుతుంది కానీ నిలదొక్కుకోవడానికి ప్రజామోదం ఉండాలి కదా’’ అని వారసులు వాదిస్తారు. వారసులలో చాలా కొద్దిమంది మాత్రమే నిలదొక్కుకున్నారని గ్రహించినపుడు ఆ వాదనలో బలముందని అర్థమౌతుంది. ఎటొచ్చీ వాళ్లకు ఎక్కువకాలం ప్రయోగం చేసే అవకాశం ఉంటుంది. కుటుంబనేపథ్యం లేనివారికి ఆ వెసులుబాటు ఉండదు. అల్టిమేట్‌గా ప్రేక్షక/ఓటరు ఆమోదమే ముఖ్యం.

తెలుగు రాష్ట్రాలో వారసత్వం నడుస్తోంది. కెసియార్‌ది స్వయంప్రతిభ కానీ కెటియార్‌, కవిత, హరీశ్‌లది వారసత్వమే. చంద్రబాబుది కాంగ్రెసులో సాధారణ మంత్రి స్థాయే, కానీ పిల్ల నిచ్చిన మామ పార్టీలోకి మారి, వారసత్వంతో ఎదిగారు. లేకపోతే కాంగ్రెసు సముద్రంలో యీదుతూనే ఉండేవారు. జగన్‌ వారసత్వపు హక్కుగా ముఖ్యమంత్రి పదవి ఆశించి, భంగపడి, పదేళ్లపాటు ఢక్కామొక్కీలు తిని స్వయంకృషితో ముఖ్యమంత్రి అయిన మాట వాస్తవమే కానీ మాటిమాటికీ తండ్రి నామజపం చేస్తూ, ఫలానావారి కొడుకుని సుమా అని ప్రజలకు గుర్తు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు.

మొన్న ఎన్నికల ముందు జగన్‌ ప్రభంజనాన్ని ఎదుర్కోవడానికి బాబు ఫరూఖ్‌ అబ్దుల్లాను లాక్కుని వచ్చి వారసత్వ రాజకీయాలను విమర్శింప చేశారు. తమాషా ఏమిటంటే జగన్‌కు వారసత్వంగా పదవి దక్కలేదు. దక్కినవారు – బాబు, ఫరూఖ్‌! ఫరూఖ్‌ మాట్లాడుతూ ‘‘తండ్రి చావు తర్వాత జగన్‌ తను ముఖ్యమంత్రి అయిపోదామనుకోవడం ఎంత వింత! కాంగ్రెసు హైకమాండ్‌కు రూ. 1500 కోట్ల లంచం యిస్తానని నాతో కబురు పెట్టడానికి చూశాడు. ఇతనికి అంత డబ్బెలా వచ్చిందా అనుకుని ఆశ్చర్యపడ్డాను.’’ అన్నాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి పదవికి అంత తక్కువ రేటు కట్టినందుకు హై కమాండ్‌కు కోపం వచ్చి జగన్‌ను శిక్షించారేమో తెలియదు కానీ, కాంగ్రెసులో తన తండ్రి ఆప్తులు అనేకమంది ఉండగా జగన్‌ పోయిపోయి వేరే పార్టీ వాళ్లను రాయబారిగా ఎందుకు పంపుదామనుకున్నాడో అర్థం కాలేదు.

ఫరూఖ్‌ యీ సంచలన వార్త ఓటర్ల మీద ఏ ప్రభావమూ కలిగించలేదు కానీ, నా బోటి వాళ్లకు యీ ఫరూఖ్‌ ఎలా ముఖ్యమంత్రి అయ్యాడో మాత్రం గుర్తు తెచ్చింది. ఈయనేమీ స్వయంప్రతిభతో ముఖ్యమంత్రి కాలేదు. ఈయన తండ్రి షేక్‌ అబ్దుల్లా కశ్మీర్‌ ముఖ్యమంత్రి. వీళ్ల బావగారు (అక్క ఖలీదా భర్త) జిఎం షా పార్టీలో ముఖ్యుడు, దశాబ్దాలుగా పార్టీ కోసం పనిచేసినవాడు. ఫరూఖ్‌ పార్టీలో పనిచేసి ఎరగడు. చరణ్‌ సింగ్‌ కొడుకు అజిత్‌ సింగ్‌ కూడా పార్టీలో కష్టపడి ఎరగడు. అమెరికాలో కంప్యూటర్‌ ఇంజనియరుగా పనిచేసేవాడు. తండ్రి జబ్బు పడ్డప్పుడు మాత్రం వచ్చి, పార్టీ పగ్గాలు అందుకున్నాడు. అప్పటిదాకా పార్టీ జండా మోసినవాళ్లు కార్యకర్తలగానే మిగిలిపోయారు. ఈ ఫరూఖ్‌దీ అలాటి కేసే. డాక్టరీ చదివి ఇంగ్లండులో ప్రాక్టీసు చేశాడు. భార్య ఇంగ్లీషు వనిత. 42 ఏళ్ల దాకా ఇంగ్లండ్‌లోనే ఉన్నాడు.

1980లో షేక్‌ తీవ్రంగా జబ్బు పడ్డాడు. ఇంగ్లండు నుంచి కొడుకుని రప్పించి శ్రీనగర్‌ నుంచి పోటీ లేకుండా ఎంపీగా గెలిపించాడు. 1981 ఆగస్టులో పార్టీకి అధ్యక్షుణ్ని చేశాడు. 1982 నాటికి జబ్బు ముదిరింది. పెద్ద కూతురు ఖలీదా, కొడుకు అబ్దుల్లా వారసత్వం కోసం పోటీపడి పార్టీని చీలుస్తారని భయపడి తన ఛాయిస్‌ ఎవరో చాటడానికి తన మరణానికి జస్ట్‌ పదిహేను రోజుల ముందు ఫరూఖ్‌ను తన కాబినెట్‌లో హెల్త్‌ మినిస్టర్‌గా తీసుకున్నాడు. ఇలా జరుగుతుందని గ్రహించి, అలకతో షా అంతకు పదిహేను రోజు ముందే మంత్రి పదవికి రాజీనామా చేశాడు. 1984లో షేక్‌ భయపడినంతా అయింది. ఖలీదా, ఫరూఖ్‌ మధ్య పార్టీ చీలింది. ఇందిరా గాంధీ సహాయంతో జిఎం షా ఫరూఖ్‌ను కూలదోసి తను ముఖ్యమంత్రి అయిపోయాడు.

షేక్‌ చనిపోయినప్పుడు సీనియారిటీ ప్రకారం తన కాబినెట్‌లో ఫైనాన్స్‌ మంత్రిగా ఉన్న డి.డి. ఠాకూర్‌ ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కావాలి. కానీ షేక్‌ చనిపోయిన గంటన్నర లోగా ఫరూఖ్‌ గద్దె నెక్కేశాడు, ఆలస్యం చేస్తే బావగారు తన్నుకుపోతాడని భయం. మద్దతు కూడగట్టుకునేదాకా తండ్రి మరణవార్తను ప్రకటించలేదు. తర్వాత తండ్రి అంతిమయాత్రలో గన్‌ క్యారేజీపై శవం పక్కనే 11 గంటల పాటు కూర్చుని ప్రజల దృష్టిలో తనే వారసుడిగా ముద్ర పడేలా చూసుకున్నాడు. తండ్రి కాబినెట్‌ను కొనసాగిస్తే బావ అనుచరులు బలపడతారనే భయంతో ముఖ్యమంత్రి అయిన నిమిషాల్లోనే మొత్తం కాబినెట్‌ను రద్దు చేసి పడేశాడు. ఇలా పార్టీ కార్యకర్తలకు, యితర నాయకులకు అసంతృప్తి కలిగించడంతోనే 1984లో జిఎం షా ఫరూఖ్‌ను పదవీభ్రష్టుణ్ని చేయగలిగాడు! తర్వాత ఫరూఖ్‌ మళ్లీ ముఖ్యమంత్రి కాగలిగాడు. తన కొడుకు ఉమర్‌ అందిరాగానే పార్టీ పగ్గాలు అతనికి అప్పగించాడు, ముఖ్యమంత్రిని చేశాడు తప్ప మరొకణ్ని చేయలేదు. ఇలాటి వ్యక్తులు వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడితే నవ్వు రాదా?

రాజకీయ వారసత్వం అనగానే మనకు గుర్తుకు వచ్చే మరో పేరు ` మన పొరుగు రాష్ట్రమైన ఒడిశా ముఖ్యమంత్రి నవీన్‌ పట్నాయక్‌. ఆయన పార్టీ పేరు బిజూ (నవీన్‌ తండ్రి పేరు) జనతా దళ్‌. అయితే అతను రాజకీయాల్లోకి ఎప్పుడు, ఎలా వచ్చాడు అన్నది తెలిస్తే అతనిది వారసత్వ రాజకీయం అవునో కాదో అర్థమౌతుంది. ఒడిశా రాజకీయాల్లో భీష్ముడనదగిన బిజూ పట్నాయక్‌ 1997 ఏప్రిల్‌లో చనిపోయేనాటికి  ముఖ్యమంత్రి పదవిలో లేడు. 1990 నుంచి 1995 వరకు అధికారంలో ఉండి 1995 ఎన్నికలో కాంగ్రెస్‌ చేతిలో ఓడిపోయాడు. 1996 పార్లమెంటు ఎన్నికలలో జనతా దళ్‌ పార్టీ తరఫున గంజాం జిల్లాలోని ఆస్కా నియోజకవర్గం నుంచి ఎంపీ అయ్యాడు. ఆయనతో పాటు మరో ముగ్గురు మాత్రమే ఒడిశా నుంచి గెలవటం చేత కేంద్రంలోని యునైటెడ్‌ ఫ్రంట్‌ ప్రభుత్వంలో సముచిత గౌరవం దక్కలేదు. ‘మీరు వృద్ధులు, మీ అనుచరుడు శ్రీకాంత్‌ జేనాకు మంత్రి పదవి యిస్తాం’ అన్నారు. ఈయన గతిలేక సరేనన్నాడు.

దిల్లీలోనే ఉంటూ అక్కడే చనిపోయాడు. శవాన్ని ఒడిశాకు తీసుకుని వచ్చారు. అంత్యక్రియలకు రికార్డు స్థాయిలో ఐదు లక్షలమంది హాజరయ్యారు. బిజూ పోయాక ఏం చేయాలో అనుచరులకు పాలుపోలేదు. ఆయన మరణంతో జరిగే ఆస్కా ఉపయెన్నికలో ఎలాగైనా గెలవాలి. లేకపోతే ఇక ఒడిశాలో పార్టీ బట్టకట్టడం అసాధ్యమనుకున్నారు. గెలుపుకోసం సరైన అభ్యర్థి కోసం వెతకసాగారు. ఆ ప్రాంతానికే చెందిన, కళ్లికోట రాజవంశానికి చెందిన సుజ్ఞాన కుమారి దేవ్‌ను నిలబడమన్నారు. ‘‘గత ఏడాదే బరంపురంలో పివి నరసింహారావుపై పోటీ చేసి ఓడిపోయాను. మళ్లీ నిలబడను.’’ అందామె. రామకృష్ణ పట్నాయక్‌ అనే సీనియర్‌ నేతను సంప్రదిస్తే ‘బిజూ రంగంలో లేకపోతే మనకేం ఓట్లు పడతాయ్‌?’ అంటూ ఆయన నిరాకరించాడు. నామినేషన్ల గడువు దగ్గర పడుతోంది. నిలబడకపోతే పరువు నష్టం. యుద్ధానికి ముందే ఓటమి అంగీకరించినట్లవుతుంది. పార్టీ నాయకుందరూ దిల్లీలో శ్రీకాంత్‌ జేనా యింట్లో సమావేశమయ్యారు.

జేనా చాలా తెలివైనవాడు. బిజూ బతికి వున్నపుడే పార్టీని అతని చేతిలోంచి గుంజుకుందామని చూసినవాడు. కానీ మంచి వక్త కాకపోవడం వలన క్రౌడ్‌ పుల్లర్‌ కాదనీ, అతను నెంబర్‌ వన్‌గా పనికి రాడని ఒడిశా జనతా దళ్‌ పార్టీ నాయకుల అభిప్రాయం. ఆ విషయం అతనికీ తెలుసు. పైగా బిజూ అంత్యక్రియలకు వచ్చిన జనం భావావేశంలో ‘‘నువ్వు బిజూ బాబుకి వెన్నుపోటు పొడిచి ఆయనకు రావలసిన మంత్రి పదవి లాక్కున్నావ్‌’’ అంటూ బూతులు తిట్టారు, చెప్పులు విసిరారు. ఇవన్నీ ఆలోచించుకుని జేనా తనే దగ్గరుండి బిజూ కుటుంబసభ్యులెవరినైనా అభ్యర్థిగా నిలిపితే తనపై నింద తొలగిపోతుందనుకున్నాడు. పైగా ఆయన అంత్యక్రియలకు వచ్చిన జనాన్ని చూస్తే బిజూ అంటే ప్రజలకు మోజుందని తొస్తోంది. గెలుపు తథ్యం. పార్టీ నిలబడుతుంది, దానికి తను నాయకుడిగా వుండవచ్చు. ఈ లెక్కతో బిజూ కుటుంబసభ్యులను ముగ్గులోకి దింపుదామనుకున్నాడు.

బిజూ పెద్ద కొడుకు ప్రేమ్‌ నాకు యిష్టం లేదని చెప్పేశాడు. అతను వ్యాపారస్తుడు. తను రాజకీయాల్లోకి వస్తే తనూ, తన ఫ్రెండ్స్‌ కూడా భూతద్దం పాలిట పడతారని జంకాడు. బిజూ కూతురు గీతా మెహతా రచయిత్రి. తండ్రికి చాలా ఆప్తురాలు. ఆమె సోనీ మెహతా అనే పబ్లిషరుని పెళ్లి చేసుకుని, ఎన్నడో అమెరికాలో స్థిరపడింది. నాకు ఇండియా వచ్చే ఉద్దేశం లేదు, నన్ను వదిలేయండి అంది. ఇక మిగిలినది రెండో కొడుకు నవీన్‌. 1946లో పుట్టాడు. అతను ఒడిశాలో ఎప్పుడూ నివసించలేదు. అతనికి ఆ భాష అర్థం కాదు, మాట్లాడడం రాదు. రాష్ట్ర ఆచారవ్యవహారాల, సంస్కృతీసంప్రదాయాల గురించి ఏమీ తెలియదు. దెహ్రాదూన్‌ స్కూల్లో చదువుకున్నాడు. దిల్లీలో బిఏ చేశాడు. ఫారిన్‌ యాసతో ఇంగ్లీషు మాట్లాడతాడు. దిల్లీలోనే కాపురం ఉంటాడు. పెళ్లి చేసుకోలేదు. హ్యేపీగా పార్టీలకు హాజరవుతూ కులాసాగా కాలక్షేపం చేస్తూంటాడు.

కొంతకాలం పాటు దిల్లీ ఒబరాయ్‌ హోటల్‌లో ఓ షాపు తీసుకుని బొతిక్‌ నడిపాడు. దాని క్లయింట్లలో ప్రఖ్యాత గాయకబృందం బీటిల్స్‌ కూడా ఉన్నారు. పుస్తకాలు చదవడం, సినిమాలు చూడడం అతని హాబీ. మర్చంట్‌ ఐవరీ తీసిన ‘‘ద డిసీవర్స్‌’’ (1988) ఇంగ్లీషు సినిమాలో ఓ వేషం కూడా సరదాగా వేశాడు. మూడు కాఫీ టేబుల్‌ పుస్తకాలు వెలువరించాడు. వీటిలో రెండు పుస్తకాలను జాన్‌ ఎఫ్‌ కెనడీ భార్య జాక్విలిన్‌ (ఒనాసిస్‌) ఎడిట్‌ చేసింది. ఆమె యితని స్నేహితురాలు. 1983లో ఇండియా వచ్చినపుడు యితన్ని వెంట పెట్టుకుని ఊళ్లు తిరిగింది. తండ్రి రాజకీయాల్లో నవీన్‌ ఎన్నడూ తలదూర్చలేదు. ఆయన రాజకీయ మిత్రులతో, అనుచరులతో ఏ సంబంధబాంధవ్యాలూ లేవు.

మిగతా యిద్దరూ వద్దన్నారు కాబట్టి యిక యితనిపై ఒత్తిడి పెంచారు. నవీన్‌ చాలా రోజులు ఆలోచించి, ఆలోచించి సరేనన్నాడు. అతని అక్క, అన్న అతనిపై ఏ రకమైన ఒత్తిడి తేలేదు. నవీన్‌ ఆస్కాకు వెళ్లి సుజ్ఞాన కుమారి దేవ్‌ని, రామకృష్ణ పట్నాయక్‌ను వెంటపెట్టుకుని నామినేషన్‌ వేశాడు. భాష రాదు కాబట్టి నియోజకవర్గంలో తిరిగేటప్పుడు జనాలకు చేతులూపేవాడంతే. ఉపన్యాసాలిచ్చే ప్రశ్నే లేదు. అయినా మంచి మెజారిటీతో నెగ్గాడు. అలా నవీన్‌ రాజకీయప్రస్థానం 50వ ఏట అనుకోకుండా ప్రారంభమైంది. ఒకసారి అడుగు పెట్టాక, ఎంత చాకచక్యంతో వ్యవహరించాడో, తమ చేతిలో కీలుబొమ్మగా ఉంచుకుందామనుకున్న తండ్రి అనుచరులను ఎలా కంగు తినిపించాడో మరోసారి చెప్తాను.

– ఎమ్బీయస్‌ ప్రసాద్‌ (ఫిబ్రవరి 2020)

[email protected]