గుమ్మడికాయ దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టు తయారైంది శ్రీనివాసకళ్యాణం యూనిట్ పరిస్థితి. ఈ సినిమాకు మొదట మిక్స్ డ్ టాక్ వచ్చిందన్నారు. తర్వాత వసూళ్లు దారుణంగా పడిపోయి సినిమా ఫ్లాప్ అయింది. ఇక్కడితో ఈ మేటర్ ను వదిలేస్తే బాగుండేది. కానీ దిల్ రాజు ఊరుకోలేదు. సినిమాను లేపే ప్రయత్నంలో సక్సెస్ మీట్ పెట్టాడు. అది కూడా విడుదలైన 5 రోజులకు సక్సెస్ మీట్ పెట్టాడు.
పేరుకు ఇది సక్సెస్ మీట్ అయినప్పటికీ, అంతాకలిసి మూకుమ్మడిగా తమ సినిమా ఆడడం లేదని తమకుతాము ప్రకటించుకొని అభాసుపాలయ్యారు. పైకి బాగుందని అంతా చెప్పుకొచ్చినప్పటికీ, అంతర్లీనంగా సినిమా ఆడడం లేదనే బాధ అందర్లో కనిపించింది. దీనికి వాళ్లు సక్సెస్ మీట్ అని పేరుపెట్టడం విశేషం.
“సినిమా రిలీజైంది. మొదటి ఆటకు మొత్తం పాజిటివ్ వైబ్రేషన్ కనిపించింది. నేను, సతీశ్ వేగేశ్న ఐమాక్స్ కు వెళ్లాం. అంతా బాగుందన్నారు. తర్వాత సుదర్శన్ కు వెళ్లాం. అక్కడ కూడా సూపర్ రెస్పాన్స్. కానీ ఏమైందో ఏమో మ్యాట్నీ నుంచి సినిమా పడిపోయింది. రివ్యూస్ రాసేవాళ్లకు సినిమా నచ్చలేదు. అప్పటికే సినిమా చూసిన యూత్ కూడా సోషల్ మీడియాలో నెగెటివ్ గా రెస్పాండ్ అయ్యారు.”
ఇలా సినిమా గురించి ఉన్నది ఉన్నట్టు మాట్లాడాడు దిల్ రాజు. రిలీజైన రెండో రోజుకే వసూళ్లు దారణంగా పడిపోయాయని చెప్పిన దిల్ రాజు, శని-ఆదివారాలు మాత్రం ఊపందుకుందని చెబుతున్నాడు. ఈ సినిమా రిజల్ట్ ఇప్పటికీ తనను అయోమయానికి గురిచేస్తోందంటున్నాడు. మరోవైపు హీరో నితిన్ అయితే ఏకంగా సినిమా ఆడట్లేదని ప్రకటించాడు.
“ఈ సినిమాకు ఫ్యామిలీస్ నుంచి టాక్ అద్భుతంగా ఉంది. అయితే గుర్తింపు మాత్రం రావట్లేదు. రెస్పాన్స్ బాగుంది. కాకపోతే గుర్తింపు రేపు వస్తుందా, ఎల్లుండి వస్తుందా, నెక్ట్స్ ఇయర్ వస్తుందా, 5 ఏళ్ల తర్వాత వస్తుందా అనేది చెప్పలేను. బట్ గుర్తింపు మాత్రం గ్యారెంటీగా వస్తుంది.”
ఇలా నితిన్, దిల్ రాజు మాత్రమేకాదు.. సక్సెస్ మీట్ లో దర్శకుడు, హీరోయిన్ కూడా దాదాపు ఇలానే మాట్లాడారు. సక్సెస్ మీట్ పెట్టి మరీ సినిమా ఆడట్లేదని అంగీకరించారు.