సిఎమ్ గా ఎవరు వుండాలి? నేనా.. జగనా? చంద్రబాబా? అంటూ ప్రశ్నించారు జనసేనాధిపతి పవన్ కళ్యాణ్. ఆయన అడిగిన ఈ ప్రశ్నకు కొనసాగింపు కూడా వుంది. చంద్రబాబు-జగన్ ఒకరిపై ఒకరు లక్షకోట్లు, లక్షన్నర కోట్ల అవినీతి ఆరోపణలు చేసుకుంటున్నారని అందువల్ల వారు బెటర్ నా? తాను బెటర్ నా అన్నది పవన్ క్వశ్చను. నిజమే, ప్రస్తుతానికి పవన్ కు ఏ మరకలేదు. అందువల్ల ఆయన తాను మిస్టర్ క్లీన్ అని చెప్పుకుంటున్నారు. అంతేకాదు, తాను కోట్ల ఆదాయం వదిలేసి, రాజకీయ రంగంలోకి వచ్చానని అంటున్నారు.
పవన్ ఇలా అనడంలో తప్పేంలేదనే అనుకోవాలి. ఎందుకంటే తెలుగుదేశం అభిమానులు చాలా తెలివిగా ఓమాట చెబుతుంటారు. చిన్న దొంగ బెటరా? పెద్ద దొంగ బెటరా? అని అనుకుంటే చిన్న దొంగ అయిన చంద్రబాబు బెటర్ అని తాము ఆయనను అభిమానిస్తున్నామని, జగన్ పెద్దదొంగ అని చాలా తెలివిగా తమ అభిమానాన్ని సమర్థించుకుంటూ వుంటారు. తెలుగుదేశం పార్టీని సామాజిక పరంగా అభిమానించడం, కానీ ఆ విషయం దాచి చంద్రబాబు కూడా అవినీతి పరుడే అని, అయితే జగన్ ఇంకా పెద్ద అవినీతి పరుడు అని, తాము అందుకే బాబుకు మద్దతు ఇస్తున్నామని అంటుంటారు.
ఇది అందరికీ తెలిసిన సంగతే, అందుకే అలాంటి వాళ్లకు తగిలేలా ఈ ప్రశ్న సంధించినట్లుంది పవన్. కానీ ఆయన ఓ విషయం తెలుసుకోవాలి. ఎవరికైనా అవినీతి అంటేది అధికారం అందిన తరువాతే. అప్పటి వరకు అందరూ గొప్పవారే. అవినీతి అంటనివారే. అంతవరకు ఎందుకు పవన్ సొదరుడు చిరంజీవి మీద కూడా కేంద్రమంత్రి అయిన తరువాత అవినీతి ఆరోపణలు వేరే విధంగా వచ్చాయి. ఆయన ఓ పత్రికకు కోట్ల రూపాయలు టూరిజం శాఖ ప్రకటనలు కట్టబెట్టారని, అలాగే ఆయన సన్నిహితులు కొందరికీ టూరిజం ప్రాజెక్టులు ఇచ్చారని అప్పట్లో వార్తలు వచ్చాయి.
అందువల్ల అధికారం అందనంత వరకే అందరూ గొప్పోళ్లు. అందిన తరువాతే తెలుస్తుంది ఎవరు ఏ రేంజ్ అవినీతి పరులు అన్నది. పవన్ విషయానికి వస్తే, ఆయన తాను అధికారంలోకి వచ్చినా ఇలాగే వుంటాను అని చెప్పొచ్చు. కానీ తనకు కులంలేదు.. కులాభిమానం లేదు అంటూనే ఇప్పుడు తనచుట్టూ, తన పార్టీలో కీలకమైన వ్యవహారలాల చుట్టూ తన సామాజికవర్గం జనాలను ఏరికోరి నియమిస్తున్నారు. మరి అధికారం వచ్చాక కూడా ఇలాగేమాట ఒకటిచేత ఒకటి వుంటుందేమో? అని జనాలు అనుకోవడం తప్పా?