శ్రీనివాసకళ్యాణం విషయంలో చాలా ఎక్కువగా మాట్లాడి తప్పు చేసామని నిర్మాత దిల్ రాజు గ్రహించినట్లున్నారు. ఈ విషయాన్ని ఆయనే మెల్లగా తన మాటల్లో చెప్పేసారు.
మంచి సినిమా తీస్తే యూత్ ఎందుకు కనెక్ట్ కాలేదని అనుకున్నామని, తాను, తన సినిమా నటులు, సినిమా గురించి మరీ ఎక్కువ చెప్పడం వల్ల, ప్రేక్షకులు సినిమా గురించి మరీ ఎక్కువ ఊహించుకుని డిస్సపాయింట్ అయ్యారని తాను గ్రహించానని ఆయన అన్నారు.
ఇప్పుడు మళ్లీ జనం థియేటర్ వైపు వస్తున్నారని, సోషల్ మీడియాలో సినిమా గురించి పాజిటివ్ బజ్ నడుస్తోందని ఆయన అంటున్నారు.
దిల్ రాజు ఈ విధంగా మాట్లాడడానికి రీజన్ వుంది. గురువారం సినిమా విడుదలయితే శుక్రవారం డల్ అయ్యాయి కలెక్షన్లు. శనివారం మార్నింగ్ షో కూడా అలాగే వున్నాయి.
కానీ శనివారం మాట్నీ, ఫస్ట్ షో, సెకెండ్ షో లు మాత్రం చాలా చోట్ల ఫుల్స్ కావడం, లేదా 80 నుంచి 90 శాతం ఫుల్స్ కావడం జరిగింది. ఈ ట్రెండ్ చూస్తుంటే ఆదివారం కూడా బాగానే వుండేలా వుంది. అంటే ఆ లెక్కన ఫస్ట్ వీకెండ్, ఓ ఆరేడు కోట్ల వరకు లాగేలా వుంది. ఈ లెక్కలు దిల్ రాజుకు కాస్త ఆశ కలిగించి వుంటాయి.
అందుకే తన తప్పు ఒప్పుకున్నట్లు ఓ స్టేట్ మెంట్ పడేసారు. జనాలకు కాస్త ఆసక్తి కలుగుతుందని అనుకుని వుంటారు.
దిల్ రాజు అంచనా ఎలా వుంటుందో మండే నాడు తేలిపోతుంది.