ఈ రోజుల్లో సినిమా తీయడం కన్నా దాన్ని కాపాడుకోవడం పెద్ద సమస్యగా మారింది. డిజిటల్ కంటెంట్ ను కాపాడుకోవడం అంటే చిన్న విషయంకాదు. ఎక్కడో అక్కడి నుంచి ఏదో ఒకటి లీక్ అయిపోతోంది. ఒక్కోసారి సినిమానే లీక్ అయిపోతొంది. అత్తారింటికి దారేది దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా సినిమాలు ఇలాంటి సమస్యను ఎదుర్కొన్నాయి. యంగ్ హీరో విజయ్ దేవరకొండ నటించిన రెండు సినిమాలు విడుదలకు రెడీగా వున్నాయి. ఈ రెండు సినిమాలు కూడా లక్కీగా లీక్ బారినుంచి తప్పించుకున్నాయి.
ఆలస్యంగా అందిన సమాచారం ఇలావుంది. కొన్నినెలల కిందట అంటే మార్చినెల అనుకోవచ్చు. ఆ టైమ్ లో టాక్సీవాలా, గీత గోవిందం సినిమాల ఎడిటింగ్ పని మొదలు కావాల్సి వుంది. ఈ రెండు సినిమాల అవిడ్ సిస్టమ్స్ గీతా ఆఫీస్ లోనే వున్నాయి. ఎలా లీక్ అయ్యాయో, కొంత రా ఫుటేజ్ లీక్ అయింది. అది నేరుగా కృష్ణాజిల్లాకు చేరినట్లు తెలిసింది. ఆ విషయం ఓలీక్ పిక్చర్ ద్వారా ఓ చిన్న డైరక్టర్ కు తెలిసింది. ఆయన గీతా వాళ్లను అలెర్ట్ చేసారు. ఆ వెంటనే వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేసారు.
పోలీసులు సకాలంలో వెళ్లి ఒకరిద్దరిని అదుపులోకి తీసుకుని, ఫుటేజ్ ఫార్వార్డ్ కాకుండా జాగ్రత్తపడ్డారు. ఆ విధంగా ఆ రెండు సినిమాలు లక్కీగా సేవ్ అయ్యాయి. లేదూ అంటే రెండు నిర్మాణ సంస్థలు, ఇద్దరు నిర్మాతలు చాలా ఇబ్బంది పడేవారు. ఎంతగా అవిడ్ సిస్టమ్ లను నిర్మాత తన ఆఫీసులోనే పెడుతున్నా, ఎంత నిఘా పెడుతున్నా, ఇలాంటివి జరుగుతూ వుండడం దారుణంగా వుంది.