రాజుల కోట అంటే విజయనగరం జిల్లాయే గుర్తుకువస్తుంది. ఇక్కడ చాలా రాజవంశాలు ఉన్నాయి. పూసపాటి వారు, బొబ్బిలి రాజులు, కురుపాం రాజులు, శత్రుచర్ల రాజులు ఇలా ఎవరి మటుకు వారు తమదైన రాజకీయం చేస్తూ జనాల్లో పేరు తెచ్చుకున్నారు.
ఇక రాజకీయ కుటుంబాలు తీసుకుంటే బొత్స సత్యనారాయణ అగ్రభాగంలో ఉన్నారు. అలాగే కిమిడి కుటుంబం, పతివాడ, కొండపల్లి కుటుంబాలు ఉన్నాయి.
అటు వైసీపీ అయినా ఇటు టీడీపీ అయినా రాజుల కుటుంబాలు, రాజకీయ కుటుంబాల నుంచే నాయకులను ఎన్నుకుంటూ టికెట్లు ఇస్తున్నాయి. దీంతో రాజకీయాలు కాస్తా కుటుంబాలకు పరిమితం అయిపోతున్నాయని లోక్ సత్తా రాష్ట్ర అధ్యక్షుడు భీశెట్టి బాబ్జీ అంటున్నారు.
రాజకీయ కుటుంబాలు కాదు అందరికీ ప్రాధాన్యత ఉండాలని ఆయన చెప్పడం విశేషం. అందుకోసం కొత్త రాజకీయ శక్తి ముందుకు రావాలని కోరుకున్నారు. లోక్ సత్తా ఆ దిశగా తన వంతుగా ప్రయత్నాలు చేస్తుందని ఆయన అంటున్నారు. అలాగే, అభివృద్ధి గురించి, సుపరిపాలన గురించి ప్రజలలో చర్చ సాగాలని కూడా ఆయన అంటున్నారు.
వర్తమాన రాజకీయాలు అంతా అర్ధబలం అంగబలం ప్రాధాన్యతగా మారిన నేపధ్యంలో కొత్త రాజకీయం వస్తుందా. వచ్చినా నిలబడుతుందా అన్నదే ప్రశ్న. ఇక లోక్ సత్తా వంటి పార్టీలు 2009లో దూకుడుగా వచ్చినా ఎందుకో ఇపుడు రేసులో వెనకబడిపోయాయి.
ఏది ఏమైనా తరాలు మారినా రాజ్యాలు పోయినా ప్రజాస్వామ్యంలో నయా రాచరిక వ్యవస్థ కొనసాగుతోందని మేధావులు కూడా అంటున్నారు.