రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు.. చివరకు ఆ హామీని మాఫీ చేసి ఎన్నికల్లో దారుణంగా ఓటమి పాలయ్యారు. ఒకరకంగా రైతులు, వ్యవసాయం అనే పేరెత్తే అర్హత లేని వ్యక్తి బాబు. సీఎం జగన్ కూడా పదే పదే అదే విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
రైతుల పేరెత్తే అర్హత చంద్రబాబుకి కానీ, దత్త పుత్రుడికి కానీ లేవన్నారు. అర్హులైన కౌలురైతు కుటుంబాలన్నిటికీ పరిహారం అందినా పవన్ కల్యాణ్ కావాలనే ప్రభుత్వంపై నిందలేస్తున్నారని, అప్పుడు లేవని నోరు ఇప్పుడెందుకు లేస్తోందని ప్రశ్నించారు.
రైతు భరోసా నిధుల విడుదల సందర్భంగా మాట్లాడిన జగన్.. రైతుల పేరెత్తే అర్హత కానీ, వారిని ఓట్లు అడిగే అర్హత కానీ కేవలం వైసీపీకి మాత్రమే ఉందన్నారు.
రైతులకిచ్చిన మాట తప్పిన నాయకులు రాజకీయాల్లో ఉండటానికి అర్హులేనా అని ప్రశ్నించారు సీఎం జగన్. గతంలో చంద్రబాబు రైతు రుణమాఫీ విషయంలో మాట తప్పారు, గిట్టుబాటు ధరలపై, ధాన్యం సేకరణలోనూ అబద్ధాలు ఆడారు. అలాంటి చంద్రబాబుని రైతులే ఓడించారు.
ఎన్నికల్లో 23సీట్లకు పరిమితం చేసి కసి తీర్చుకున్నారు. దీంతో ఈ దఫా రైతు జపం చేస్తున్నారు బాబు. ఆయన దత్తపుత్రుడు కూడా రైతు కుటుంబాలను కలుస్తున్నారని, గతంలో చంద్రబాబు అన్యాయం చేసినప్పుడు ఈ దత్తపుత్రుడు ఎక్కడికెళ్లారని ప్రశ్నిస్తున్నారు సీఎం జగన్. అప్పుడు ప్రశ్నించకుండా ఇప్పుడు పరామర్శకు బయలుదేరితే ఏం లాభముంటుందని అన్నారు.
సీసీఆర్సీ కార్డు, పట్టాదారు పాసు పుస్తకం ఉన్న రైతు కుటుంబాలకు ఎక్కడా అన్యాయం జరగలేదని, నష్టపరిహారం అందించడంలో ఏ ఒక్కరికీ ఇబ్బంది కలగకుండా చూశామన్నారు జగన్. రైతు భరోసా నిధులను 50లక్షలమందికి అందజేశామని, 23,875కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేశామని చెప్పారు. పంట బీమా ద్వారా 31లక్షలమందికి లబ్ధి చేకూరిందని చెప్పారు.
ఏపీలో ఆహార ధాన్యాల ఉత్పత్తి తమ హయాంలో 16 లక్షల టన్నులు పెరిగిందని గుర్తు చేశారు. వడ్డీలేని రుణాల పథకం ద్వారా 1282కోట్ల రూపాయలు రైతులకు ఆర్థిక సాయం అందిందని అన్నారు. ఆత్మహత్యలకు పాల్పడిన కౌలు రైతుల కుటుంబాలకు 7లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించామని చెప్పారు.
వ్యవసాయం దండగ అని చెప్పిన చంద్రబాబు తన హయాంలో రైతులను చిన్నచూపు చూశారు. అమరావతి రైతులను దగా చేసి, అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారులకు వంతపాడారు. ఏపీలో సకాలంలో వర్షాలు కురిసి, రైతులు సుఖసంతోషాలతో ఉన్నారంటే.. అది గత మూడేళ్లుగానే. రైతు ద్వేషి, రైతు ద్రోహి చంద్రబాబుకి నిజంగానే రైతు అనే పేరెత్తే అర్హత లేదు.
జగన్ అమలు చేస్తున్న రైతు సంక్షేమ పథకాలను చూసి చంద్రబాబుకి మరోసారి దిమ్మతిరుగుతోంది. ఎలాగైనా రైతులను తమవైపు తిప్పుకోడానికే దత్తపుత్రుడిని రంగంలోకి దింపారు. కౌలు రైతులకు సొంత డబ్బు ఇస్తున్నట్టు కలరింగ్ ఇస్తున్నారు. ఈ ఓవర్ యాక్షన్ నే ఇప్పుడు జగన్ నిలదీశారు. బాబు, పవన్ ఇద్దరికీ మరోసారి కోటింగ్ ఇచ్చారు.