ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు గట్టి పోటీదారుడు తయారయ్యారు. కేఏ పాల్‌ను మరిపించేలా ఆయన మాటలు వుంటున్నాయి. పాల్‌ను తలదన్నేలా మాట్లాడుతున్న ఆ నాయకుడే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు. ఆలూ లేదు, చూలూ లేదు కొడుకు పేరు సోము వీర్రాజు అన్నట్టుగా వుంది ఆయన వ్యవహారం. ఇవాళ ఆయన తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నారు.
ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. తాము అధికారంలోకి రాగానే బియ్యం రీసైక్లింగ్‌కు పాల్పడుతున్న రైస్ మిల్లర్లపై చర్యలు తీసుకుంటామన్నారు. ఇదేమైనా అయ్యే పనా, పోయే పనా? అని జనం నవ్వుకుంటున్నారు. ఒకవైపు తెలంగాణలో అధికార పార్టీపై దూకుడు ప్రదర్శిస్తూ ప్రధాని మోదీ నుంచి బండి సంజయ్ ప్రశంసలు అందుకున్నారనే వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఏపీలో చూద్దామంటే, జనసేనాని పవన్‌ను నమ్ముకుని అడపాదడపా తప్ప ప్రజల్లో బీజేపీ కనిపిస్తున్న దాఖలాలు లేవు. కేవలం మీడియాకే పరిమితమై ఉత్తుత్తి హెచ్చరికలు చేస్తూ ఏపీ బీజేపీ నేతలు పబ్బం గడుపుకుంటున్నారనే విమర్శలున్నాయి. ఏపీలో అనేక ప్రజాసమస్యలున్నాయి. వాటిపై ప్రత్యక్ష పోరాటాల ఊసేలేదు. మీడియాలో కనిపించడానికి మాత్రం పోటీ పడుతున్నారు. ఏపీలో బీజేపీకి అధికారం కనుచూపు మేరలో లేనే లేదు.
ఆంధ్రప్రదేశ్ బీజేపీలో కార్యకర్తల కంటే నాయకులే ఎక్కువ. సోము వీర్రాజు, కన్నా లక్ష్మినారాయణ, సత్యకుమార్, సీఎం రమేశ్, సుజనౌచౌదరి, ఆదినారాయణరెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద జాబితానే వుంది.
కేవలం జగన్ ప్రభుత్వం నుంచి రక్షణ కోసం బీజేపీలో ఉన్న వాళ్లే ఎక్కువ. 2024 సార్వత్రిక ఎన్నికల సమయానికి బీజేపీలో ఎంత మంది ఉంటారో ఎవరూ చెప్పలేని పరిస్థితి. పార్టీ బలోపేతానికి నాయకత్వ బాధ్యతలు అప్పగిస్తే, ఆ పని చేయకుండా సోము వీర్రాజు చెప్పిందే చెబుతూ కాలం గడుపుతున్నారనే విమర్శలు సొంత పార్టీ నుంచి వినిపిస్తున్నాయి.
కాకినాడలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ వైసీపీ ప్రభుత్వం పోలవరం తప్ప ఉత్తరాంధ్ర, రాయలసీమలో ఒక్క ప్రాజెక్ పనులు ప్రారంభించలేదని ఆరోపించారు. వైసీపీకి తామే నిజమైన ప్రతిపక్షం అని సోము వీర్రాజు పేర్కొనడం జోక్ కాక మరేంటి? ఇటీవల కేఏ పాల్ కూడా ఇలాగే మాట్లాడుతున్నారు. జాతీయ స్థాయిలో బీజేపీకి తమ పార్టీనే ప్రత్యామ్నాయం అని చెబుతున్న సంగతి తెలిసిందే.
కేఏ పాల్‌కు, ఏపీ బీజేపీకి తేడా లేకుండా పోయింది. తెలంగాణ బీజేపీలా ఏపీలో కూడా పోరాటాలు చేస్తూ కాస్త పార్టీ పరువును కాపాడండయ్యా అని కార్యకర్తలు కోరుతున్నారు.