కౌశల్ ఆర్మీ.. సోషల్ మీడియాలో ఇదిప్పుడు నయా ట్రెండ్. మోడలింగ్, సినిమాలు, టెలివిజన్ సీరియళ్ళు.. ఇలా కౌషల్ ఓ మోస్తరు పాపులర్ ఫిగర్. అయితే, ఏకంగా బిగ్ బాస్ రియాల్టీ షోని శాసించే స్థాయికి కౌశల్ ఇమేజ్ పెరిగిందా.? అంటే, 'కాదు' అని మాత్రం చెప్పలేం. 'అవును' అనడానికి గత కొంతకాలంగా బిగ్ హౌస్‌లో జరుగుతున్న పరిణామాలే నిదర్శనంగా కన్పిస్తున్నాయి.
జూనియర్ ఎన్టీఆర్, బిగ్ బాస్ రియాల్టీ షోకి వ్యాఖ్యాతగా వ్యవహరించినప్పుడు ఈ తరహా 'ఆర్మీ' ఏ హౌస్ మేట్కీ లేకపోవడం గమనార్హం. కౌశల్‌తో పోల్చితే ముమైత్‌ఖాన్ కావొచ్చు, నవదీప్ కావొచ్చు.. సినిమాల్లో బాగా పాపులర్. అయినాగానీ, వాళ్ళెవరికీ ఈ తరహా 'ఆర్మీ' లేదు, ఆ ఆర్మీ సోషల్ మీడియాలో హల్చల్ చేయలేదు.. దానికి తగ్గట్టుగా బిగ్ హౌస్‌లో పరిణామాలూ చోటు చేసుకోలేదు. కౌశల్‌తో ఎవరన్నా గొడవ పెట్టుకున్నారో, అంతే.! ఆ హౌస్‌మేట్, హౌస్ నుంచి 'ఎలిమినేట్' అయిపోవడం ఖాయమన్న అభిప్రాయం ఇటీవలి కాలంలో బలపడిపోయింది.
కౌశల్‌తో గొడవ పెట్టుకున్న భానుశ్రీ, తేజస్వి ఇలాగే హౌస్ నుంచి బయటకు వెళ్ళిపోయారు. కిరీటి కూడా అంతే. ఇప్పుడు తాజాగా నందిని బిగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయిపోయింది. సరే, నాని తాజాగా కౌశల్‌కి వార్నింగ్ ఇవ్వడం.. అన్నది వేరే విషయం. హోస్ట్‌గా జూనియర్ ఎన్టీఆర్, సరదా సరదా పంచ్‌లు వేయడం, జరిగిన పరిణామాల్ని విశ్లేషించి కామెంట్ చేయడం.. ఫన్‌గా నడిచేది. నాని ఒక్కోసారి తన మీద తానే అదుపు కోల్పోతున్నాడు.
కొందరికి వార్నింగ్స్ కూడా ఇచ్చేస్తున్నాడు. అలా ఆయా హౌస్మేట్స్ ఇమేజ్‌ని నాని దారుణంగా దెబ్బ తీసేస్తుండడం గమనార్హం. ఈసారి కౌశల్, నాని ఆగ్రహానికి గురయ్యాడు. నాని సంగతి పక్కనపెడితే, సోషల్ మీడియాలో కౌశల్ ఆర్మీ.. హౌస్‌లో కౌశల్‌కి వ్యతిరేకంగా పనిచేస్తున్న ఎవర్నీ విడిచిపెట్టడంలేదు. తేజస్విపై ఏ స్థాయిలో వాళ్ళు రెచ్చిపోయారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ బూతుల ప్రవాహం నానికి కూడా గతంలో ఆగ్రహం తెప్పించిందనుకోండి.. అది వేరే సంగతి. ఇప్పుడు డైరెక్ట్‌గా నాని కార్నర్ అయిపోయాడు.
అయితే, బిగ్ బాస్ అనేది ఓ రియాల్టీ షో.. ఇదొక గేమ్. ఇందులో ఎత్తులు, పైఎత్తులు.. అన్నీ టీఆర్పీ రేటింగ్స్ కోసమే. కౌశల్ ఆర్మీతో, బిగ్ బాస్ రియాల్టీ షోకి కొత్త ఊపు వస్తోందని నిర్వాహకులు భావించడం వింతేమీ కాదు. అలాగని, కౌశల్ ఆర్మీ పూర్తిగా బిగ్ బాస్‌ని నడిపించే పరిస్థితి వచ్చేస్తే, 'రియాల్టీ షో' అన్నమాటకే అర్థంలేదు. కౌశల్‌ని హౌస్ మేట్స్ అంతా ఒక్కటై పక్కన పెడుతున్న మాట వాస్తవం. అలాగని, ఈ షో మొత్తాన్నీ సోషల్ మీడియా ద్వారా కౌశల్ ఆర్మీ 'కంట్రోల్'లోకి తీసుకోవడం ఆశ్చర్యకరమే.