జాన్వీకపూర్ పై ముందుగా తెలుగువాళ్ల కన్నేపడింది. జగదేకవీరుడు అతిలోక సుందరికి సీక్వెల్ అని, అందులో జాన్వీ హీరోయిన్ అని, రామ్ చరణ్ హీరో అని.. ఇలా ఒక ప్రతిపాదన చాన్నాళ్ల కిందటే వచ్చింది. అప్పటికి జాన్వీ వయసు కూడా చాలా తక్కువ. ఈ ప్రతిపాదనకు శ్రీదేవి నో చెప్పినట్టుగా తెలుస్తోంది. తన కూతురు వయసు మరీ తక్కువ అని హీరోయిన్‌ని చేసే ఉద్దేశం లేదని అప్పట్లో శ్రీదేవి చెప్పినట్టుగా సమాచారం. ఇది ఐదేళ్ల కిందటి ప్రతిపాదన.
ఆ తర్వాత జాన్వీని హీరోయిన్ గా తీసుకొచ్చింది శ్రీదేవి. అది దక్షిణాది భాషల ద్వారా కాకుండా బాలీవుడ్ ద్వారానే తీసుకొచ్చింది. జాన్వీ కోసం సహజంగానే మూవీ మేకర్లు పోటీపడ్డారు. ఆ తర్వాత చాలా జరిగాయి. ధర్మా ప్రొడక్షన్స్ వంటి పెద్ద బ్యానర్ ద్వారా జాన్వీ కెరీర్ మొదలుకావడం, అంతలోనే శ్రీదేవి మరణం. ఆపై ‘ధడక్’ వచ్చింది జాన్వీకి మంచి మార్కులు పడ్డాయి. ఆ సినిమా వందకోట్ల రూపాయల పైస్థాయి వసూళ్లతో సాగుతోందిప్పుడు.
శుభారంభం పొందిన జాన్వీకపూర్, ఇక కెరీర్ ను ఎలా సాగిస్తుందో చూడాల్సి ఉంది. ఆమెకు అవకాశాలకు అయితే లోటులేదు. ఇదిలా ఉంటే.. ఇప్పుడు జాన్వీ మీద కన్నేశాడట తమిళ హీరో శింబు. తన తదుపరి సినిమా ఒకదాంట్లో జాన్వీని నటింపజేయడానికి ఇతడు ప్రయత్నాలు సాగిస్తున్నాడట. వెంకట్ ప్రభు దర్శకత్వంలో శింబు హీరోగా రూపొందే ఆ సినిమాలో జాన్వీని హీరోయిన్ గా ఒప్పించేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టుగా తెలుస్తోంది.
మరి తన తల్లి క్వీన్ గా వెలిగిన దక్షిణాది పరిశ్రమకు జాన్వీ ఇప్పుడే ఓకే చెబుతుందా? జాన్వీకపూర్ నటించే తొలి సౌత్ సినిమా ఏది కాబోతోంది? లెట్ వెయిట్ అండ్ సీ!?