విశ్వరూపంకు మరో ‘ఆస్కారం’ లేదు

ఎలాంటి హీరో ఎలా అయిపోయాడు. ఎలాంటి బ్యానర్ ఎలా అయిపోయింది అన్న టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. ఇదంతా విశ్వరూపం-2 సినిమా గురించే. ఎందుకంటే ఆ సినిమా బ్యానర్ ఆస్కార్ రవిచంద్రన్ ది. హీరో కమల్…

ఎలాంటి హీరో ఎలా అయిపోయాడు. ఎలాంటి బ్యానర్ ఎలా అయిపోయింది అన్న టాక్ వినిపిస్తోంది ఇండస్ట్రీలో. ఇదంతా విశ్వరూపం-2 సినిమా గురించే. ఎందుకంటే ఆ సినిమా బ్యానర్ ఆస్కార్ రవిచంద్రన్ ది. హీరో కమల్ హాసన్. హాట్ కేక్ లా అమ్ముడుపోవాలి డబ్బింగ్ రైట్స్. కానీ అడిగేవారు లేకపోయారు. దానికితోడు పాతబాకీలు మీద వున్నాయి. దాంతో సినిమాను ఎన్వీప్రసాద్ చేతిలో పెట్టి చేతులు దులుపుకోవాల్సి వచ్చింది.

ఆస్కార్ రవిచంద్రన్ గతంలో ఐ అనే సినిమా అందించారు. అది పరమ డిజాస్టర్. అక్కడ ఎన్వీప్రసాద్ కు కోటిన్నర బకాయిపడ్డారు. ఇప్పుడు విశ్వరూపం-2 సినిమాను ఎవరు తీసుకున్నా, ముందువాళ్లు కావచ్చు, వాళ్లు ఇచ్చే అమౌంట్ లోంచి కావచ్చు. ఆ పాత బాకీ చెల్లించాలి. ఇంకేం మిగులుతుంది?

అందుకే సినిమానే పాత బాకీ కింద ఎన్వీప్రసాద్ చేతిలో పెట్టేసినట్లు వినికిడి. సినిమాకు బజ్ ఎలాగూ పెద్దగాలేదు. విడుదలయిన తరువాత టాక్ ను బట్టే వుంటుంది వ్యవహారం. పైగా సినిమాకు ముందుగా దిల్ రాజు శ్రీనివాస కళ్యాణం, వెనుకగా విజయ్ దేవరకొండ గీత గోవిందం వస్తున్నాయి. అందుకే విడుదల తరువాత టాక్ మీద భారం వేసి, సినిమాను థియేటర్లలోకి వదులుతున్నారు.

సినిమా ఏమాత్రం బాగున్నా కమల్ సినిమాలు చూసే జనాలు తెలుగునాట ఇంకా వున్నారు. అదే ఆశ.