విజయ్ దేవరకొండ గీతగోవిందం సినిమా విడుదల మరో పదిరోజుల్లో వుంది. థియేటర్ ట్రయిలర్ ఇంకారాలేదు. వస్తుందా? అని కూడా అనుమానంగా వుంది. ఎందుకంటే గీతగోవిందం సినిమా సెన్సారు అయిపోయింది కానీ, రీరికార్డింగ్ తదితర వ్యవహారాలు ఇంకా జరుగుతూనే వున్నాయి. యూనిట్ ఆ పనుల్లో ఫుల్ బిజీగా వుంది. ఈ టైమ్ లో ట్రయిలర్ కట్ చేయాలంటే కాస్త టైమ్ పడుతుంది.
విడుదల చేస్తే తొమ్మిది లోపు విడుదల చేయాలి. లేదూ అంటే మరీ సినిమా విడుదల ముందుగా 12వ తేదీకి కాస్త ఇటుగా అటుగా వుండాలి. ఇంక అంత దగ్గరగా ట్రయిలర్ ఇవ్వడమా? మానడమా? అన్నది ఓ డైలామా? పైగా గీత గోవిందం ట్రయిలర్ చాలా జాగ్రత్తగా కట్ చేయాల్సిన అవసరం వుందని యూనిట్ భావిస్తోంది. కథ బయటకు రాకూడదు. అలా అని అనాసక్తిగా వుండకూడదు. ఈ ఫీట్ అంతా అంత సులువుకాదు.
అందుకే అసలు ట్రయిలర్ లేకుండా ముందుకు వెళ్తే ఏం పోయే? అని అలోచిస్తోంది యూనిట్. బహుశా ట్రయిలర్ లేకుండానే గీత గోవిందం విడుదలయ్యే అవకాశాలే ఎక్కువ వున్నాయి. ఎలాగూ డిలీటెడ్ సీన్లు అంటూ కొన్ని ఆరు లేదా ఎనిమిది తేదీల్లో విడుదల చేసే ప్రయత్నాల్లో వున్నారు. ఇక అదే ట్రయిలర్ అనుకోవాలేమో ?
విజయ్ దేవరకొండ, రష్మిక మడొన్నా జంటగా నటించిన ఈ సినిమాకు పరుశురామ్ దర్శకుడు. బన్నీ వాస్ నిర్మాత.