ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రతిపక్షాలపై విమర్శల దూకుడు పెంచారు. సార్వత్రిక ఎన్నికలకు ఇంకా రెండేళ్ల గడువు వున్నప్పటికీ, ఇప్పటి నుంచే జనం ఆదరణ పొందేందుకు వ్యూహాత్మకంగా జగన్ అడుగులు వేస్తున్నారు. గతంలో చంద్రబాబు, ప్రస్తుత తన పాలనకు తేడా చూసి, ఎవరేమిటో గుర్తించాలని కోరుతున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.
ఏలూరు జిల్లా గణపవరంలో ‘వైఎస్సార్ రైతు భరోసా’ కార్యక్రమంలో సీఎం మాట్లాడుతూ చంద్రబాబు హయాంలో రైతులను నిలువునా ముంచినా దుష్టచతుష్టయం ఎందుకు ప్రశ్నించలేదని నిలదీశారు.
గత పాలనలో రైతు వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తే చంద్రబాబు దత్తపుత్రుడు ఎందుకు ప్రశ్నించలేదని అడిగారు. నాడు చంద్రబాబుపై దత్తపుత్రుడు విపరీతమైన ప్రేమ చూపించారని ఎండగట్టారు. ఇటీవల కౌలురైతుల పరామర్శ యాత్ర చేపట్టిన జనసేనాని పవన్‌కల్యాణ్‌ను ఓ రేంజ్లో జగన్ విమర్శించారు.
ఇటీవల రైతుల పరామర్శ యాత్ర అంటూ దత్తపుత్రుడు బయల్దేరాడని వెటకరించారు. పట్టాదారు పాసు పుస్తకం ఉండి ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం అందని ఒక్కరిని కూడా దత్తపుత్రుడు చూపించలేకపోయాడన్నారు. గత ప్రభుత్వంలో రైతులకు హామీలిచ్చి గాలికొదిలేశారన్నారు. వాటిని ఏ మాత్రం పట్టించుకోకుండా, ప్రశ్నించాల్సిన సమయంలో ప్రశ్నించకుండా, చంద్రబాబు అంటే విపరీతమైన ప్రేమ కురిపించాడీ దత్తపుత్రుడని ఎద్దేవా చేశారు.
ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన మాట తప్పిన నాయకుడు రాజకీయాల్లో ఉండటానికి తగునా అని తన ప్రభుత్వంపై విమర్శలు చేసే వారిని ప్రశ్నిస్తున్నట్టు జగన్ అన్నారు. ఇవాళ వీరంతా మొసలి కన్నీరు కారుస్తున్నారన్నారు. తనకు ఓటు వేసినా వేయకపోయినా మంచి చేస్తున్నట్టు జగన్ చెప్పుకొచ్చారు. ఇదే తనకు, ప్రధాన ప్రత్యర్థి చంద్రబాబుకు ఉన్న తేడా అని వైఎస్ జగన్ అన్నారు.
వ్యవసాయం దండగ అన్ననాయకుడు ఇప్పుడు రైతుల గురించి మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. రైతుల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబుకు ఉందా?. రైతుల ఉచిత విద్యుత్, వ్యవసాయం దండగ అన్న నాయకుడు, రైతులపై కాల్పులు జరిపించిన నాయకుడు, రుణాల పేరుతో మోసం చేసిన నాయకుడి పాలనను ఒకసారి గుర్తు చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి మధ్య తేడాను ప్రజలు గమనించాలని సీఎం జగన్ కోరారు.
చంద్రబాబు 2014లో పెట్టిన మేనిఫెస్టోను టీడీపీ వెబ్సైట్ నుంచి కూడా తీసేశారని గుర్తు చేశారు. చెత్తబుట్టలో వేసిన చంద్రబాబు నైజాన్ని చూడాలని కోరారు. జగన్ మీ బిడ్డ అన్నారు. రైతుల తరఫున నిలబడే బిడ్డగా తనకు తాను చెప్పుకున్నారు. ఎన్నికలప్పుడు ఒకలా? ఆ తర్వాత మరో విధంగా ఉండేవాడు కాదు జగన్ అని చెప్పారు.
మీ బిడ్డకు నిజాయితీ, నిబద్ధత ఉందని జగన్ చెప్పారు. ఏది చెబుతాడో… అదే చేస్తాడన్నారు. ఈ సందర్భంగా మరోసారి ఎల్లో మీడియాపై విమర్శలు సంధించారు. దుష్ట చతుష్టయంగా అభివర్ణించారు.