బీచ్ విత్ ఐటీ సిటీ….. కొత్త నినాదం..

అందమైన సాగర తీరం ఒక వైపు ఉంది. మరో వైపు సుందరమైన ప్రకృతి ఉంది. ఈ రెంటింటి మధ్య ఎలాంటి వారికైనా ఏ పని చేయాలన్నా హాయిగానే ఉంటుంది. ఇక విశాఖ సిటీని బీచ్…

అందమైన సాగర తీరం ఒక వైపు ఉంది. మరో వైపు సుందరమైన ప్రకృతి ఉంది. ఈ రెంటింటి మధ్య ఎలాంటి వారికైనా ఏ పని చేయాలన్నా హాయిగానే ఉంటుంది. ఇక విశాఖ సిటీని బీచ్ సిటీ విత్ ఐటీ సిటీగా రూపకల్పన చేయాలన్నది వైఎస్సార్ ఆలోచన.

ఆయన ఆనాడు తన ఏలుబడిలో పట్టుబట్టి విశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టారు కాబట్టే ఐటీ జోన్ అన్నది విశాఖకు వచ్చింది. ఈ రోజు రుషికొండ దగ్గర కనిపించే ఐటీ కంపెనీలు నాడు వైఎస్సార్ ముందు చూపు, చలవ అని చెప్పకతప్పదు.

మళ్లీ ఆ తరువాత ఎవరూ అంతలా దృష్టి పెట్టలేకపోయారు. ఇక వైసీపీ ఏలుబడిలో మాత్రం విశాఖ సిటీని కేరాఫ్ ఐటీగా తీర్చిదిద్దుతామని చెబుతున్నారు. కొత్తగా ఐటీ మంత్రి అయిన గుడివాడ అమరనాధ్ బీచ్ విత్ ఐటీ సిటీ అన్న కాన్సెప్ట్ ని బలంగా వినిపించడం ద్వారా విశాఖకు ఐటీ పెట్టుబడులు ఇబ్బడి ముబ్బడిగా తీసుకువస్తామని చెబుతున్నారు.

త్వరలో జరగబోయే దావోస్ సదస్సుకు తొలిసారి పరిశ్రమల శాఖ మంత్రిగా హాజరు కాబోతున్న గుడివాడ ఏపీకి ఐటీ సెక్టార్ నుంచి భారీగా పెట్టుబడులు వస్తాయని అంటున్నారు. విశాఖ బీచ్ సిటీని చూపించి వాటిని రాబడతామని అంటున్నారు. అలాగే టూరిజం సెక్టార్ లో కూడా పెట్టుబడులు ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన చెబుతున్నారు.

మొత్తానికి కొన్ని ఎంపిక చేసుకున్న అంశాల మీద రాష్ట్ర ప్రభుత్వం దావోస్ టూర్ లో చర్చించబోతోందని, వాటి ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని మంత్రి అంటున్నారు. మరి విశాఖ కేరాఫ్ ఐటీగా మారుస్తాను అంటున్న గుడివాడ ఆలోచనలు సాకారం కావాలని అంతా కోరుకుంటున్నారు.