సోనియా కుటుంబానికి ఆ నిబంధన వర్తిస్తుందా?

మన దేశంలో పరిపాలనలోగానీ, రాజకీయ పార్టీల్లోగానీ ప్రజాస్వామ్యం అనేది డొల్ల. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక్క కారణం పార్లమెంటుకుగానీ, రాష్ట్ర అసెంబ్లీలకుగానీ ఎన్నికలు సజావుగా జరగడం. ధనబలం, కండబలం,…

మన దేశంలో పరిపాలనలోగానీ, రాజకీయ పార్టీల్లోగానీ ప్రజాస్వామ్యం అనేది డొల్ల. భారతదేశం ప్రజాస్వామ్య దేశం అని చెప్పుకోవడానికి ఉన్న ఒకే ఒక్క కారణం పార్లమెంటుకుగానీ, రాష్ట్ర అసెంబ్లీలకుగానీ ఎన్నికలు సజావుగా జరగడం. ధనబలం, కండబలం, ప్రలోభాలు వగైరా అంతా వేరే విషయం. దేశంలోని ప్రతి పార్టీ తమది ప్రజాస్వామ్య పార్టీ అని చెప్పుకుంటుంది. కుటంబ పార్టీలైన ప్రాంతీయ పార్టీలు కూడా అలాగే చెప్పుకుంటాయి. కానీ అదంతా అబద్ధం అని అందరికీ తెలుసు. 

రాజకీయాల్లో, ఎన్నికల్లో ఆధిపత్యం వహించే కొన్ని కుటుంబాలు ఉంటాయి. ఎన్నికలు వచ్చినప్పుడు ఈ కుటుంబాల్లోని భర్తకు, భార్యకు, వారి కొడుకుకు, కూతురుకు టిక్కెట్లు తప్పనిసరిగా ఇవ్వాల్సిందే. అల్లుళ్ళు, బావమరుదులు, సోదరులు కూడా ఉంటారనుకోండి. ఇలా ఒకే కుటుంబంలోని ఇద్దరు లేదా ముగ్గురికి టిక్కెట్లు ఇస్తుంటాయి పార్టీలు. అలా ఇవ్వడానికి నిరాకరిస్తే తిరుగుబాటు చేస్తారు. ఇలా డిమాండ్ చేసి టిక్కెట్లు తీసుకోవడంవల్ల కొందరికి అవకాశాలు పోతాయి. ఇలాంటి పరిస్థితి దేశంలో దశాబ్దాలుగా ఉంది. 

మన చట్ట సభల్లో ఇప్పటికీ భార్యాభర్తలు, అన్నదమ్ములు, ఒకే కుటుంబానికి చెందిన బంధువులు ఉన్నారు. ఒకరు పార్లమెంటులో ఉంటే, మరొకరు అసెంబ్లీలో ఉంటారు. కాటికి కాళ్ళు జాపుకొని ఉన్నవారికి కూడా పార్టీలు టిక్కెట్లు ఇస్తున్నాయి. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఒక కుటుంబానికి (పార్టీ నాయకుల కుటుంబాలు ) ఒక్కటే టిక్కెట్ ఇవ్వాలనేది ఆ నిర్ణయం. ఎన్నికలనాటికి ఈ నిర్ణయం అమలు అవుతుందా అనేదే సందేహమే. మరో ప్రశ్న ఏమిటంటే ఈ నిర్ణయం సోనియా కుటుంబానికి వర్తిస్తుందా అనేది ప్రశ్న. అలాగే పార్లమెంటుకు పోటీ చేయాలంటే 55 ఏళ్ళ వయసు మించకూడదు. ఇది కూడా ఎంతవరకు అమలు చేస్తారనేది మిలియన్ డాలర్ల ప్రశ్న.

ఈ నిబంధనలకు నాయకులు భయపడుతున్నారు. కొందరు లైట్ తీసుకుంటున్నారు. వరస ఓటములతో కుదేలైపోయిన భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ ఇంతకాలానికి ఒక ముందడుగు వేసింది. మూడు రోజుల పాటు రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ‘నవ సంకల్ప్ శివిర్‌’ వేదికగా మేధోమథనం సాగించింది. గతానికి కొంత భిన్నంగా సాగిన మేధోమథన సదస్సులో నాయకులు ఎంతో కొంత మనసు విప్పి మాట్లాడారు. బృందాలుగా ఏర్పడి, విభిన్న అంశాలను చర్చించారు. నివేదికలు తయారు చేశారు. పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీకి నివేదికలు సమర్పించారు. 

తీర్మానాలు చేశారు ఆ నివేదికల ఆధారంగా కార్యాచరణ రూపొందించారు. అదే వేదికగా సమావేసమైన కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ( సీడబ్ల్యూసీ) ‘నవ సంకల్ప్ శివిర్‌’ తీర్మానాలకు ఆమోదముద్ర వేసింది. సంస్థాగత వ్యవహారాలకు సంబంధించి తీవ్ర మార్పులు తీసుకురావాలని స్వయంగా సోనియాగాంధీ పిలుపునిచ్చారు. పార్టీ పదవుల్లో ఎవరూ కూడా ఐదేళ్లకు మించి ఉండరాదని, సదస్సు తీర్మానం కూడా చేసింది.

అంటే ఇప్పటికే 20 ఏళ్లకు పైగా (మధ్యలో స్వల్ప గ్యాప్ ఉన్నా) పార్టీ అధ్యక్ష పదవిలో కొనసాగుతున్న సోనియా గాంధీ ఆ పదవి నుంచి తప్పుకోవాలనే నిర్ణయానికి వచ్చారని అనుకోవచ్చని అంటున్నారు. ఈ నేపద్యంలో సొనియా గాంధీ అధ్యక్ష పదవి నుంచి తప్పుకున్న అనంతరం పార్టీ పగ్గాలు ఎవరు చేపడతారు అనే విషయంలో ఇటు పార్టీ వర్గాల్లో అటు రాజకీయ, మీడియా వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతోంది. కొందరు ప్రియాంక గాంధీకి జాతీయస్థాయిలో ‘పెద్ద’ బాధ్యత ఇచ్చి ఆమె సేవలను సద్వినియోగం చేసుకోవలసిన అవసరం ఉందని బహిరంగంగానే తమ అభిప్రయాన్ని వ్యక్త పరిచారు. అలాగే, మరి కొందరు కీలక నేతలు పార్టీ అధ్యక్ష బాధ్యతలను మరో మారు రాహుల్ గాంధీ తీసుకోవాలని కోరుతున్నారు.

ప్రియాంకా వాద్రాను ఉత్తర ప్రదేశ్’కు పరిమితం చేయకుండా జాతీయ స్థాయిలో ఆమె సేవలు వినియోగించుకోవాలని దీపేంద్ర హుడా చేసిన ప్రతిపాదనకు ఇంచుమించుగా ఏకాభిప్రాయం వ్యక్తమైనట్లు తెలుస్తోంది. రాహుల్ గాంధీ కాని పక్షంలో ప్రియాంకా వాద్రాకు పార్టీ పగ్గాలు అప్పగించాలనే ప్రమోద్ కృష్ణన్ ప్రతిపాదనకు కూడా పార్టీ నాయకుల నుంచి గట్టి మద్దతు లభించినట్లు పార్టీ వర్గాల సమాచారం. 

ప్రియాంక గాంధీని జాతీయ అధ్యక్షురాలిగా చేయాలని పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారా అని సచిన్ పైలట్‌ను ప్రశ్నించగా.. చింతన్ శిబిర్‌లో తమ అభిప్రాయాలు చెప్పే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని సచిన్ పైలట్ అన్నారు. మరి పార్టీ నిర్ణయాలు ఎలా అమలు జరుగుతాయో, అధ్యక్ష పదవిపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.