మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నాయకుడు రావెల కిషోర్‌బాబు టీడీపీ గూటికి చేరనున్నారా? అంటే ఔననే సమాధానం వస్తోంది. కాసేపటి క్రితం ఆయన బీజేపీకి రాజీనామా చేయడం ప్రాధాన్యం సంతరించుకుంది.
రాజీనామా లేఖను ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజుకు పంపారు. బీజేపీలో తనకు సముచిత ప్రాధాన్యం కల్పించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగత కారాణాలతో బీజేపీకి రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు.
ఇదిలా వుండగా ఆయన టీడీపీలో చేరేందుకు కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. గత నెలలో ఆయన తన మాజీ బాస్, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడిని కలుసుకున్నారు. పార్టీలో చేరక కోసం చర్చించినట్టు గతంలోనే వార్తలొచ్చాయి. చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా పని చేశారు. అయితే మంత్రివర్గం నుంచి తొలగించడంతో రావెల మనస్తాపం చెంది ఆ పార్టీ నుంచి బయటి కొచ్చారు.
ఆ తర్వాత జనసేనలో చేరారు. 2019లో జనసేన నుంచి పోటీ చేశారు. ఆ తర్వాత ఆయన బీజేపీలో చేరారు. బీజేపీలో యాక్టీవ్‌గా వుంటూ వచ్చారు. అయితే బీజేపీకి ఏపీలో భవిష్యత్ లేదనే ఉద్దేశంతోనే టీడీపీ వైపు చూస్తున్నట్టు కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.
గత నెలలో చంద్రబాబుతో చర్చించి, పార్టీలో చేరికకు ఆమోదం పొందారని, ఇప్పుడు అదను చూసుకుని బీజేపీకి రాజీనామా చేశారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఇక టీడీపీలో చేరడం లాంఛనమే అంటున్నారు.