పదోతరగతి లేదా ఇంటర్మీడియట్ పరీక్షలు అనే ముసుగులో ఎలాంటి బాగోతాలు జరుగుతూ ఉంటాయో.. ఇప్పుడు బయటపడుతోంది. తీగలాగితే డొంకంతా కదిలినట్టు.. ఎక్కడో ప్రభుత్వ స్కూళ్లలో పేపర్లు లీకల్ అవుతోంటే.. వాటి మూలవిరాట్టులు ఎక్కడెక్కడ ఉంటారో కూడా బయటకు వస్తోంది. లీకేజీల బాగోతం వెనుక ఉండగల అసలైన అనకొండలు ఎంత సులభంగా చట్టం చేతినుంచి తప్పించుకోగలరో కూడా కనిపిస్తోంది. మంచో చెడో ఈ సమయంలో లీకేజీల బాగోతం బయటకు రావడం ఒక సంస్కరణలకు పునాది వేస్తే చాలా గొప్ప విషయం.
అసలు ప్రెవేటు స్కూళ్లు సాగిస్తున్న మార్కుల, ర్యాంకుల బాగోతాల మీదనే ప్రభుత్వం దృష్టిసారించాలి. ప్రెవేటు స్కూళ్లు ఎన్ని రకాల ముసుగుల్లో ఎన్ని రకాల దందాలు నడిపిస్తూ ఉన్నాయో కూడా బయటకు తీయాలి. విద్యారంగంలో- తులసివనాన్నే కబళించేస్తున్న గంజాయిమొక్కలను పీకి పారేయాలి. అందుకే ప్రభుత్వానికి ఇది గ్రేట్ ఆంధ్ర విజ్ఞప్తి.. ఇటీజ్ టైం టు క్లీనప్!
ప్రెవేటు పాఠశాల అనేది కొంచెం నాణ్యమైన (?), ప్రభుత్వ స్కూళ్ల బోధనలో ఉండని కొన్ని అదనపు విషయాలు నేర్పడం అనే పునాదిలోంచే పుట్టుకొచ్చాయి. కానీ కాలక్రమంలో ఈ ప్రెవేటు పాఠశాలల, ప్రెవేటు జూనియర్ కాలేజీలు వందల, వేల కోట్ల రూపాయల కార్పొరేట్ సామ్రాజ్యంగా మారి వర్ధిల్లుతున్నాయి. ఎక్కడా నిబంధనలు పాటించరు.. నిబంధనలు అడ్డు వస్తాయని అనిపించే చోట దొంగమార్గాలను అన్వేషిస్తుంటారు. కార్ఖానాలో వస్తువుల్ని తయారుచేసినట్టుగా రాంకర్లను తయారు చేస్తుంటారు. కనీస అవగాహన ఉండని మార్కుల మేధావుల్ని తయారు చేస్తుంటారు. ఈ సకల అరాచక పోకడలకు కార్పొరేట్ విద్యాసంస్థలు కారణం అవుతున్నాయి.
ప్రభుత్వం కూడా ఇన్నాళ్లుగా వీటిని చూసీ చూడనట్లు వ్యవహరిస్తూ వస్తోంది. పైగా 2014 ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి ఎన్నికల ఖర్చులకు కూడా ఈ కార్పొరేట్ విద్యాసంస్థలే వందల కోట్ల పెట్టుబడులు సమకూర్చాయనే పుకార్లు కూడా వినిపించాయి. వాటితో ఆ వ్యాపారులకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. చెలరేగిపోయారు. నిబంధనల గురించి వారిని అడిగేవారు లేరు. ప్రభుత్వాన్ని నడిపేదే మేం అన్నట్లుగా వారు వ్యవహరించారు.
మార్కులు ర్యాంకులు తప్ప మరొకటి పట్టవు
కార్పొరేట్ విద్యా వ్యాపారులకు మార్కులు ర్యాంకులు తప్ప మరొకటి పట్టవు. పదో తరగతి ఏ గవర్నమెంటు స్కూల్లోనే చదివి అత్యుత్తమ మార్కులు తెచ్చుకున్న స్టూడెంట్ ఉంటే.. ఈ కాలేజీలు ఎగబడి వేలం పాట పాడతాయి. లక్షలు చెల్లించి.. వాడిని తమ కాలేజీలో చేర్చుకుంటాయి. అక్కడినుంచి బోధన పేరుతో ర్యాంకు సాధించే టూల్ గా పరిగణిస్తూ.. వాడు సాధించబోయే ర్యాంకు ద్వారా.. వేలం పాటలో వాడిని కొనుక్కోవడానికి తాము పెట్టిన పెట్టుబడి, వడ్డీతో సహా గిట్టుబాటు అయ్యేలా ప్రయత్నాలు సాగిస్తుంటాయి.
మార్కుల కోసం ర్యాంకుల కోసం వీళ్లు తొక్కని అడ్డతోవలు ఉండవు. అన్ని రకాల భ్రష్టాచారాలు వీరు పాటిస్తుంటారు. పైన చెప్పుకున్న వేలం పాట మాదిరిగానే.. తమ కాలేజీలో చదవని చిన్న కాలేజీలో చదివిన పిల్లవాడికి బెస్ట్ ర్యాంక్ ఏదైనా వస్తే గనుక.. వెంటనే వాడిని కొనడానికి ప్రయత్నిస్తాయి.. అడ్వర్‌టైజ్ మెంట్లలో మాత్రం.. తమ కాలేజీ స్టూడెంట్ గా సిగ్గులేకుండా ప్రచారం చేసుకుంటాయి.
ఇవన్నీ కొనుగోళ్ల వ్యవహారాలు. అలాగే మార్కులు సాధించడానికి పిల్లల్ని రాచిరంపాన పెట్టడం మరో ఎత్తు. పిల్లలను మనుషుల్లాగా కాకుండా ర్యాంకర్లుగా చూడడం వీరికి మాత్రమే చేతనైన విద్య. ప్రతి ఏటా కొన్ని వందల మంది కార్పొరేట్ జూనియర్ కాలేజీల్లో ఇంటర్మీడియట్ చదువుతున్న వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారంటే.. వారు పెట్టే మార్కుల ఒత్తిడి ఏ రేంజిలో ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
అలాగే ఇంటర్మీడియట్ లో మార్కులు గరిష్టంగానూ, ర్యాంకులు గొప్పగానూ సాధించిన విద్యార్థులు కూడా ఐఐటీ వంటి విద్యాసంస్థల్లో ప్రవేశించాక.. అక్కడ అసలైన పద్ధతిలో చదువుకోవాల్సి వచ్చినప్పుడు అజ్ఞానులుగా ముద్రపడుతున్నారని, వారి డొల్లతనం బయటపడుతున్నదనే ఉదాహరణలు కూడా మనం అనేకం వింటూ ఉంటాం.
లీకేజీల పాపం పండింది..
తెర వెనుక కార్పొరేట్ స్కూళ్లు ఉన్నాయి. ప్రభుత్వ స్కూళ్లలో లీక్ చేయిస్తున్నారు. ఆ పాపం తమ మీదికి రాదని అనుకున్నారు. కానీ.. పోలీసులు సాక్ష్యాలతో సహా కేసును బిగించారు. నారాయణ విద్యాసంస్థల మాజీ అధినేత మాజీ మంత్రి నారాయణ అరెస్టు అయి ప్రస్తుతం బెయిలు తెచ్చుకున్నారు. అయితే ఒక్క నారాయణ సంస్థ అనేది ప్రస్తుతానికి బయటకు వచ్చిన పేరు మాత్రమే. నిజానికి దాదాపు సమూహంగా కాలేజీలు, స్కూళ్లు నిర్వహిస్తున్న విద్యాసంస్థలు అన్నీ కూడా మార్కుల, లీకేజీల పాపానికి ఒడిగడుతున్నవే. పాపాల పుట్ట పగిలింది. ఇప్పుడు నారాయణ పేరు బయటకు వచ్చింది. ఇంకా అనేక పేర్లు బయటకు రావాల్సి ఉంది.
లీకేజీల అరాచకం ఇప్పుడు బయటకు వచ్చింది. ఇన్విజిలేటర్లకు లంచాలు ఇచ్చి మాస్ కాపీయింగ్ ప్రోత్సహించే వ్యవహారాలు, మార్కులు వేసే వారికి లంచాలు ఇచ్చి మార్కులు దండిగా వేయించే వ్యవహారాలు ఇలాంటి అనేక అరాచకాలు బయటకు రావాల్సి ఉంది.
అన్నిటికంటె గొప్ప పరిణామం ఏంటంటే.. ప్రెవేటు కాలేజీలు, స్కూళ్లు సాగించే అరాచక వ్యవహారాల గురించి ఇప్పుడు ప్రజల్లో చర్చ జరుగుతోంది. అందుకే ఇది మంచి తరుణం. ఈ రంగాన్ని మొత్తం ప్రక్షాళన చేయడానికి ప్రభుత్వం పూనుకోవాల్సిన సమయం.
నిబంధనల కత్తెర వేస్తే చాలు..
అసలు ఇవి విద్యాసంస్థల్లాగా నడుస్తున్నాయా? కార్ఖానాల్లాగా నడుస్తున్నాయా? అనే దిశగా నిబంధనలను గట్టిగా సమీక్షిస్తే చాలు.. వందల విద్యాసంస్థలు గాలికి కొట్టుకుపోతాయి. చదవడం తప్ప.. విద్యార్థులకు స్పోర్ట్స్ గ్రౌండ్, రిక్రియేషన్ లాంటి ఏ వసతులూ లేని కాలేజీలే అత్యధికం. దాదాపు 90 శాతం ఇలాంటివే ఉంటాయి. మిగిలిన సంస్థల్లో ఎలాంటి ఎక్స్‌ట్రా కురికులర్ వసతులు ఉండవు. వాటిని కోచింగ్ సెంటర్లు అనే ముసుగులో నడుపుతుంటారు. అక్కడి విద్యార్థుల్ని కాలేజీ స్టూడెంట్స్ గా కాకుండా, ప్రెవేటు విద్యార్థులు అనే ట్యాగ్ లైన్ల కింద పరీక్షలు రాయిస్తుంటారు. ఇలా సకల వక్రమార్గాలను అనుసరిస్తూ ఉంటారు. ఇలాంటి అన్నింటికీ చెక్ పెట్టేలా ప్రభుత్వం నిబంధనలను సమీక్షించాలి.
ఒక పాపం ఇవాళ పండింది. మిగిలిన పాపాలు కూడా పండేవరకు వెయిట్ చేయకుండా కార్పొరేట్ విద్యా అరాచకత్వాలకు చెక్ పెట్టాలి. విద్యాసంస్థలు దుర్మార్గంగా ఉంటే భవిష్యత్ తరాలు మొత్తం సర్వనాశనం అవుతాయి. ఇది కేవలం ఒక వ్యాపారాన్ని సక్రమమార్గంలో పట్టే పని మాత్రమే కాదు.. భవిష్యత్తు తరాలను కాపాడే వ్యవహారం కూడా అందుకే ప్రభుత్వం పద్ధతిగా కార్పొరేట్ విద్యా వ్యాపారాన్ని క్లీనప్ చేసే విషయంలో దృష్టి సారించాలి.
..ఎల్ విజయలక్ష్మి