హీరోలకు ఓ క్లోజ్ సర్కిల్ అనేది ఎప్పుడూ వుంటుంది. అయితే తరచుకాకపోయినా, అప్పుడప్పుడు అందులో జనాలు మారుతూ వుంటారు. దానికి ఒకటి అనికాదు, చాలా కారణాలు వుంటాయి. లేటెస్ట్ గా సరైన లైనప్ కోసం కిందామీదా అవుతున్న హీరో అల్లు అర్జున్ దగ్గరి సర్కిల్ జనాలు కూడా మారినట్లు వినిపిస్తోంది. బన్నీకి ఇన్నాళ్లు అన్నీ బన్నీవాసే. కానీ బన్నీవాసు ఇప్పుడు చాలా వ్యవహారాలు చూస్తున్నారు. జిఎ-2 బ్యానర్ లో నిర్మాణ వ్యవహారాలు, గీతాసంస్థ వ్యవహారాలు ఇలా.
బహుశా అందుకే కావచ్చు, బన్నీ దగ్గర సాయి చేరినట్లు తెలుస్తోంది. ఈ సాయి ఎవరో కాదు. ఒకప్పుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కు అత్యంత సన్నిహితుడు. ఆయన దగ్గర వుండే వేరే వ్యక్తి కారణంగా, త్రివిక్రమ్ కు సాయికి మధ్య దూరం పెరిగిందని ఇండస్ట్రీలో గుసగుసలు వున్నాయి. దాంతో దాదాపు రెండు మూడేళ్లుగా సాయి దూరంగా వుంటున్నారు త్రివిక్రమ్ కు.
ఇప్పుడు ఆ సాయి కొత్తగా బన్నీ క్యాంప్ లో చేరారు. ప్రైమరీగా కథలు వినడం, వాటి గురించి బన్నీకి వివరించడం ఇలా చాలా వ్యవహారాలు ఇప్పుడు సాయి చక్కబెడుతున్నట్లు తెలుస్తోంది. అలాగే డైరక్టర్ హరీష్ శంకర్ ఇప్పడు బన్నీకి మాంచి దోస్తానాగా మారారు. బన్నీకి ఇప్పుడు కాలక్షేపం అంతా హరీష్ శంకర్ తోనే అని గుసగుసలు వినిపిస్తున్నాయి.
మొత్తంమీద సరైన లైనప్ లు లేకపోవడం, మిగిలిన హీరోల చేతుల్లో ఒకటికి రెండు మూడు సినిమాలు వుండడం, బన్నీలో చాలా మార్పులే తెస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఇండస్ట్రీలో చెప్పుకునేది వేరు. బన్నీ క్యాంప్ లోకి వెళ్తే దర్శకులను కట్టేస్తారని, ఎప్పటికీ ప్రాజెక్టులు ఎక్కనివ్వరని, అలా అని బయటకు వెళ్లనివ్వరని, అందుకే డైరక్టర్లు ఎవ్వరూ అటు చూడడంలేదని ఇండస్ట్రీ టాక్. బన్నీ దగ్గర అది ముందు మారాలేమో?