మరో వారంరోజుల్లో సినిమా విడుదల. మూవీకి సోలో రిలీజ్ కోసం నిర్మాతలు తెరవెనక చాలా కష్టపడ్డారు. మొత్తానికి అనుకున్నది సాధించారు. ఇక సెన్సార్ పూర్తిచేసి విడుదల చేయడమే ఆలస్యం అనుకున్న టైమ్ లో ఊహించని విధంగా చిక్కుల్లో పడింది సాక్ష్యం సినిమా. అవును.. ఈనెల 27న విడుదల కావాల్సిన ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు.
కథ డిమాండ్ మేరకు సాక్ష్యం సినిమాలో కొన్ని జంతువులు, పక్షుల్ని వాడారట. షూటింగ్ అయితే పూర్తిచేశారు కానీ ఆ మేరకు అనుమతులు, వాటికి సంబంధించిన ఎన్ఓసీలు తీసుకురాలేదట. దీంతో సినిమాకు సెన్సార్ చేసేందుకు అధికారులు నిరాకరించినట్టు తెలుస్తోంది.
మంగళవారం నాటికి ఎన్ఓసీలు అందించకపోతే అది సినిమా విడుదలపై పెద్ద ప్రభావమే చూపిస్తుంది. కానీ ఇది అనుకున్నంత ఈజీకాదని తెలుస్తోంది. ఎందుకంటే ప్రస్తుతం దేశంలో జంతు సంరక్షణ చట్టాలు చాలా కఠినంగా ఉన్నాయి. అందుకే ఒకప్పట్లా జంతుపులు, పక్షుల్ని పెట్టి విచ్చలవిడిగా సినిమాలు తీయడంలేదు.
కానీ పంచభూతాలు కాన్సెప్టుతో వస్తున్న సాక్ష్యం సినిమాలో మాత్రం తప్పనిసరి పరిస్థితుల్లో కొన్ని జంతువుల్ని వాడారు. ట్రయిలర్ లో కూడా మనకు ఆ విషయం తెలుస్తుంది. షూటింగ్ లో వీటి వాడకానికి సంబంధించి యూనిట్ వద్ద ఎలాంటి ముందస్తు అనుమతులు లేవని తెలుస్తోంది.