టాలీవుడ్ చరిత్ర చూసుకుంటే ఒకే కుటుంబం నుంచి వచ్చిన హీరోల్లో ఒకరు హిట్ అయితే, మరొకరు ఫ్లాప్ అవుతున్నారు. దశాబ్దాలుగా కొనసాగుతోంది ఈ సెంటిమెంట్. ఒకే ఫ్యామిలీ నుంచి వచ్చిన ఏ ఇద్దరు హీరోలు క్లిక్ అయిన దాఖలాలు లేవు. మరి అక్కినేని కాంపౌండ్ లో ఉన్న అఖిల్ ఈ సెంటిమెంట్ కు బలైపోతాడా..? అన్నను అధిగమించలేక చతికిలపడిపోతాడా?
ఒకే కుటుంబాన్నుంచి వచ్చినవారైనా సరే ఒకరు క్లిక్ అయితే మరొకరు సైడైపోతుంటారు. అక్కినేని ఫ్యామిలీలో నాగార్జున మాత్రమే తెరపైకొస్తే, వెంకట్ తెరవెనుకే ఉండిపోయారు. దగ్గుబాటి ఫ్యామిలీలో వెంకటేష్, తెరపై విక్టరీలు నమోదు చేస్తే, సురేష్ బాబు తెరవెనక నిర్మాతగా సరిపుచ్చుకున్నాడు.
ఇక నందమూరి ఫ్యామిలీలో ఎంతమంది తెరపైకి వచ్చినా.. హీరోగా నిలదొక్కుకుంది, ఎన్టీఆర్ వారసుడిగా పేరు నిలబెట్టింది ఒక్క బాలకృష్ణే. ఆ తర్వాత కృష్ణ తన ఇద్దరు కొడుకుల్ని హీరోలుగా నిలబెట్టే ప్రయత్నాలు చేశాడు. మహేశ్ బాబు సూపర్ స్టార్ అయ్యాడు కానీ, రమేశ్ ని ప్రేక్షకులు ఆదరించలేదు.
కొత్త జనరేషన్ లో కూడా ఈ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోంది. నందమూరి హరికృష్ణ ఇద్దరు కొడుకుల్లో ఎన్టీఆర్ కి ఉన్నంత క్రేజ్ కల్యాణ్ రామ్ కి లేదు. అల్లువారి ఫ్యామిలీలో అల్లుఅర్జున్ ఇమేజ్, అల్లుశిరీష్ అందుకుంటాడా లేదా అనేది డౌటే. ఇక మంచు ఫ్యామిలీ విషయానికొస్తే.. దొందూ దొందే.. మోహన్ బాబు స్టార్ డమ్ ని, వెర్సటాలిటీని అందుకోవాలంటే విష్ణు, మనోజ్ కి ఎంత టైమ్ పడుతుందో చెప్పలేం.
ఇప్పుడీ సెంటిమెంట్ అఖిల్ ను కూడా వెంటాడుతోంది. నాగచైతన్య ఇప్పటికే తన స్టామినా ప్రూవ్ చేసుకున్నాడు. అప్పుడప్పుడు బ్రేక్ పడుతున్నా మొనాటనీ లేకుండా చూసుకుంటూ యూత్ హీరోగా దూసుకెళ్తున్నాడు. అఖిల్ మాత్రం వెనకబడిపోయాడు. 2 ఫ్లాపులిచ్చాడు. మూడో సినిమా విషయంలో దర్శకుడితో మాట కలవడంలేదని వినికిడి. అన్న నాగచైతన్య ఇంట్రడక్షన్ మూవీ ఫ్లాపయినా, రెండో సినిమా నుంచే లైన్లోకి వచ్చేశాడు. తమ్ముడు అఖిల్ ని మాత్రం రెండు సినిమాలూ వెనక్కి లాగేశాయి.
ఈ బ్యాడ్ సెంటిమెంట్ కు పవన్-చిరు సోదరులు మాత్రం మినహాయింపు. మరి ఈ మినహాయింపు నాగచైతన్య-అఖిల్ కు కూడా వర్తిస్తుందా.. లేక అన్నదమ్ముల సెంటిమెంట్ కు అఖిల్ బలైపోతాడా?