అన్ని పాములు లేచి ఆడుతోంటే.. వానపాము కూడా లేచి ఆడే ప్రయత్నం చేసిందని పెద్దలు అంటుంటారు. ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు అలాంటి వాతావరణమే కనిపిస్తోంది. అటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర, ఇటు జనసేన పవన్ కల్యాణ్ పోరాటయాత్ర, ‘యాత్ర’ అంటూ పేరు పెట్టకపోయినా.. జిల్లాలు తిరిగేస్తున్న కన్నా లక్ష్మీనారాయణ, ఊమెన్ చాందీ- రఘువీరా… ఇందరి యాత్రల నడుమ తాను కూడా జిల్లాల యాత్ర చేసేయాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ముచ్చట పడ్డట్లుగా కనిపిస్తోంది. ఆయన రాష్ట్రంలోని అన్ని జిల్లాలూ పర్యటించి.. కార్యకర్తలు, నియోజకవర్గ స్థాయి పార్టీ నాయకులతో సమావేశాలు పెట్టుకుని దిశానిర్దేశం చేస్తారని ఇప్పటికే వార్తలు వచ్చాయి.
మొన్నటికి మొన్న కర్నూలుకు మంత్రిగా అధికారిక పర్యటనకు వెళ్లి.. లోకేష్ పెట్టిన చిచ్చు రావణ కాష్టంలా రగులుతూనే ఉంది. ఇప్పట్లో చల్లారే దాఖలాలు కూడా లేవు. ఆయన ఇంకా జిల్లాల యాత్రలు కూడా చేస్తే.. ఎన్నిచోట్ల ఎలాంటి తకరార్లు తయారవుతాయో అని పార్టీ నేతలు తలలు పట్టుకుంటున్నారట. చంద్రబాబునాయుడు ఇప్పటికే కర్నూలు, ప్రకాశం, కడప ఇలా.. పార్టీలో ముఠా కుమ్ములాటలు విపరీతంగా ఉన్న కొన్ని జిల్లాల విషయంలో రాజీ చర్చలు పలుమార్లు నిర్వహించారు.
ఈ జిల్లాల బాగోతం రచ్చకెక్కాయి గనుక.. మిగిలిన అన్ని జిల్లాల్లో పార్టీ లో చాలా సుహృద్భావ వాతావరణమే ఉన్నదని అనుకుంటే పప్పులో కాలేసినట్టే. దాదాపుగా అన్ని జిల్లాల్లోనూ లోలోన నిప్పు రగులుతూనే ఉంది. లోకేష్ ఇప్పుడు జిల్లా యాత్రల పేరిట నియజకవర్గ స్థాయి ముఖ్యులతో సమావేశాలు పెట్టుకోవడం షురూ అయితే.. అలాంటి ముఠా కుమ్ములాటలన్నీ బయటపడకుండా ఉంటాయా? అనేది పార్టీలో ఉన్న పెద్ద భయం.
చంద్రబాబు దృష్టిలో లోకేష్ ఎంతో తెలివైన వాడే కావొచ్చు. తెలివితేటలతో పార్టీ నాయకులతో వ్యూహాలను చర్చించడమూ గైడ్ చేయడమూ ఇదంతా ఒక ఎత్తు. సమావేశాల్లో హఠాత్పరిణామంలాగా.. ఒక సంక్షోభం ఒక రచ్చ తలెత్తినప్పుడు… దానిని డీల్ చేయడం వేరు. క్రైసిస్ మేనేజిమెంట్ కు తెలివితేటలు మాత్రం చాలవు. అనుభవం కూడా తప్పనిసరి. నలభయ్యేళ్ల అనుభవం ఉన్న చంద్రబాబునాయుడు రాజీలు కుదరిస్తుంటేనే… గదిలోంచి బయటకు వచ్చిన ముఠా నాయకులు ఎవరి తీరులో వారు మాట్లాడుతున్నారు. మరి… లోకేష్ యాత్రలు మొదలెడితే.. రాష్ట్రమంతా పార్టీలో కుమ్ములాటలు రోడ్డున పడకుండా ఉంటాయా.. దావానలంలా భగభగలు పుట్టకుండా ఉంటాయా? అనేది ప్రశ్న.