కాంగ్రెస్ పార్టీ తెలంగాణ శాసనసభ పక్ష నేత మల్లు భట్టి విక్రమార్క తాజాగా ఒక చిత్రమైన వాదనను తెరమీదకు తీసుకువచ్చారు. తెలంగాణను వరద వెల్లువ ముంచెత్తుతుండడానికి గల కారణాలను ఆయన విశ్లేషించారు.
కాళేశ్వరం ప్రాజెక్టును ఆశాస్త్రీయంగా నిర్మించారని దానివల్లనే వరదలు వస్తున్నాయని, ప్రస్తుతం సీతారామ ప్రాజెక్టును కూడా అదే తరహాలో అశాస్త్రీయంగా నిర్మిస్తున్నారని భట్టి విక్రమార్క ఆరోపిస్తున్నారు. తెలంగాణలో పలు ప్రాంతాలను వరద వెల్లువ ముంచెత్తుతున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు భట్టి విక్రమార్క అందుకు చెబుతున్న కారణాలే చిత్రంగా ఉన్నాయి.
తెలంగాణ ఏర్పడిన తర్వాత.. కాళేశ్వరం ప్రాజెక్టు డిజైన్లను మార్చి మరింత పెద్ద స్థాయిలో మార్పు చేర్పులతో నిర్మించిన సంగతి అందరికీ తెలుసు. ఇలా డిజైన్లు మార్చడం వెనుక కేసీఆర్ స్వాహా పర్వం ఉన్నదని ఇన్నాళ్లు విపక్ష నాయకులు ఆరోపిస్తూ వచ్చారు. వందల కోట్ల రూపాయల సొమ్మును కాజేయడానికి మాత్రమే కేసీఆర్ ఇలా డిజైన్లను మార్చారని ప్రతిపక్షాలు నిందించాయి.
ఇన్నాళ్లు కేవలం సొమ్ము స్వాహా కోసమే అన్నట్టుగా అభివర్ణించిన డిజైన్ల మార్పు, ఇవాళ వరదలు వెల్లువెత్తేసరికి హఠాత్తుగా అశాస్త్రీయత రూపం సంతరించుకున్నది. వరదలకు ముడిపెట్టి ఇప్పుడు సీతారామ ప్రాజెక్టు గురించి కూడా మాట్లాడుతున్న విధంగానే, ఆశాస్త్రీయ డిజైన్లు అయితే నిర్మాణంలో ఉండగా ఆ అంశాన్ని విపక్షాలు ఎందుకు లేవనెత్తలేదనేది ఒక ప్రశ్న.
ఇప్పుడు తెలంగాణను వరదలు ఇబ్బంది పెడుతుండడంతో ప్రభుత్వంపై నింద వేయడానికి ప్రాజెక్టులను వాడుకుంటూ ఉంటే గనుక.. దానిని రాజకీయంగా చవకబారుతనంగా భావించాలి. ఎందుకంటే గోదావరి ప్రాంతంలో వరదలకు కాళేశ్వరాన్ని కారణంగా చూపించగలరు కానీ.. హైదరాబాదు ముంచెత్తుతున్న వరదలకు ఏమి నిందలు వేస్తారు? చినుకు పడితేచాలు.. నరకప్రాయంగా మారుతున్న రాజధాని నగర జీవితాలకు ఎవరు బాధ్యులని అంటారు? అనేది అర్థం కావడం లేదు.
వరదలు ఒక్క తెలంగాణలో మాత్రమే కాదు. ఇతర ప్రాంతాల్లో కూడా వస్తున్నాయి. వరద సహాయక చర్యలు, ముందు జాగ్రత్త చర్యల విషయంలో ఫెయిలయితే ప్రభుత్వాన్ని నిందించడంలో అర్థముంటుంది గానీ.. ప్రాజెక్టుల కారణంగానే వరద వెల్లువలంటూ.. ప్రజలను భయపెట్టే ప్రకటనలు నాయకులు మానుకోవాలి. అలా అంటున్న నాయకులు.. తాము గెలిస్తే.. వరదల ముప్పు దూరం చేయడానికి ఈ ప్రాజెక్టులను కూల్చి మళ్లీ కట్టిస్తారా? అనేది కూడా వారు చెప్పగలగాలి!