ఎన్నో శతాబ్దాలు రాచరికాల్లోనూ, నియంతృత్వాల్లోనూ ప్రపంచం నలిగింది. మానవస్వేచ్ఛకి, మానవహక్కులకి ఆ రకమైన వ్యవస్థలు సరికావని నెమ్మదిగా ఒక్కొక్కదేశం ప్రజాస్వామ్యం వైపు అడుగులు వేస్తూ వస్తున్నాయి. ఈ ప్రక్రియ ఎప్పటినుంచో కొనసాగుతోంది. వీటిల్లో 200 ఏళ్లకు పైగా ప్రజాస్వామ్యచరిత్ర ఉన్న దేశం అమెరికా. ఎన్నో దేశాలకి మార్గదర్శకంగా నిలబడిన స్వేచ్ఛాయుత దేశమది.
ప్రజలు తమ నాయకుడిని ఎన్నుకోవడం, ఆ నాయకుడు తాను ప్రజలకు సేవకుడినని భావించి పని చేయడం, ఆ నాయకుడిని అదే ప్రజలు ఎన్నికల్లో ఓడించినప్పుడు మౌనంగా తప్పుకుని గెలిచిన వ్యక్తికి పాలనాబాధ్యతలు అప్పజెప్పడం…ఇదీ ప్రజాస్వామ్యంలో ఉన్న అందం, ఆదర్శం.
కానీ ఎన్నో దశాబ్దాల అమెరికా ప్రజాస్వామ్యవ్యవస్థకి చెదలు పట్టించిన ఒకే ఒక్కడు డొనాల్డ్ ట్రంప్. అతను ప్రజాస్వామ్య వ్యవస్థలో నియంతృత్వపోకడలున్న వ్యక్తి. ఓటమిని అంగీకరించకుండా తానే ఎప్పటికీ సర్వంసహాచక్రవర్తినని భావించే ఒకానొక ఉన్మాది. తాను ఓడిపోయానన్న అక్కసుతో అమెరికన్ ప్రెసిడెన్షియల్ బిల్డింగ్ మీద దాడి చేయించిన తీవ్రవాది. ఇంత జరిగినా ఇప్పటికీ తాను 2024 ప్రెసిడెంట్ ఎన్నికల్లో పోటీ చేసి గెలుస్తానని నమ్ముతున్న అతివాది.
అసలు అంత పెద్ద ప్రజాస్వామ్యవ్యతిరేక చర్య చేసాక జైలుకెళ్తానన్న భయం లేకుండా జో బైడెన్ కొడుకు మీద నేరారోపణలు చేస్తూ, బైడెన్ కుటుంబమే నేరస్థుల కుటుంబమని ప్రజల్ని నమ్మించాలని చూస్తున్న వ్యక్తి ట్రంప్. నమ్మించడమంటే కేవలం మాటలతో కాదు. దీని మీద లాయర్లను పెట్టుకుని కోర్టులో కేసులు నడుపుతున్నాడు. తన మీద పెట్టబడ్డ కేసులపై పోరాడడానికి, కొత్తగా తాను బైడెన్ పై పెట్టిన కేసులను ముందుకు తీసుకువెళ్లడానికి ట్రంప్ తన లాయర్లపై పెడుతున్న ఖర్చు కొండంత.
చాలా దేశాల్లో ప్రజాస్వామ్య ముసుగులో రాచరికం నడుస్తుంటుంది. పైకి న్యాయం అందరికీ సమానమే అనుకున్నా, విషయానికొచ్చేసరికి పదవి ఉన్నవాడికి ఒక న్యాయం, లేని వాడికి మరొక న్యాయం, సామాన్యుడికి ఇంకొక న్యాయం…మామూలే. అయితే అది ఉన్మాద స్థితికి చేరుకుని తాను అన్ని చట్టాలకు అతీతుడినని భావించే వ్యక్తులు వచ్చినప్పుడే ప్రమాదం. తనకి పదవుంటేనే దేశం..పదవి లేకపోతే వల్లకాడైపోయినా పర్వాలేదు అనుకునే నియంతలు బయలుదేరతారు.
డొనాల్డ్ ట్రంప్ గొడవని కేవలం అమెరికాకి సంబంధించిన గొడవగా చూడకూడదు. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజాస్వామ్యాలన్నింటికీ గుణపాఠం. అటువంటి నాయకులు ఆయా దేశాల్లో పుట్టుకొస్తే ఎలా నిలువరించాలో ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఈ తరహా నాయకులు తమ వర్గం ప్రజల్ని రెచ్చగొట్టగలరు, అంతర్యుద్ధాలకి కూడా తెరలేపగలరు.
ట్రంప్ ని న్యాయబద్ధంగా విచారించాక అతడు అపరాధి అని కోర్టు సమక్షంలో తేలితే జైలుకు పంపే ధైర్యం ఆ దేశం చేయలుగుతుందా? అలా చేస్తే రిపబ్లికన్ అతివాదులు రెచ్చిపోయి మరింత విధ్వంసం సృష్టిస్తే దేశంలో ఏ ఆఫ్ఘనిస్తాన్ లాంటి వాతవరణమో రాకుండా నివారించగలరా! అదే జరిగితే అంతర్జాతీయంగా అమెరికా ఇమేజ్ ఏమౌతుంది? స్టాక్ మార్కెట్లు ఏమౌతాయి? అమెరికన్ డాలర్ మీద ఆధారపడిన అంతర్జాతీయ విపణి ఏమౌతుంది?
అలా కాకుండా ఈ గొడవంతా ఎందుకని కోర్టు అతనిని శిక్ష నుంచి తప్పిస్తే అది ప్రజాస్వామ్యానికి చేసిన అన్యాయం అనిపించుకోదా! ట్రంపుని ఆదర్శంగా తీసుకుని ఇతర ప్రజాస్వామ్యదేశాల్లోని నాయకులు నియంతృత్వధోరణి పెంచుకోరా?
ట్రంప్ కేసులపై తీర్పు కోసం ప్రపంచం మొత్తం వేచి చూస్తోంది. ఒక అంచనా ప్రకారం ఈ కేసులో న్యాయబద్ధంగా అయితే ట్రంప్ కి 20 ఏళ్లు జైలు శిస్ఖ పడే అవకాశముందని లాయర్లంటున్నారు. అది జరిగే పనేనా? ఏం జరుగుతుందో చూడాలి.
పద్మజ అవిర్నేని