తెలంగాణ కాంగ్రెస్ పార్టీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నదా? రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికకు సంబంధించి కసరత్తు చేయడానికి ఏర్పాటుచేసిన స్క్రీనింగ్ కమిటీ కూర్పు విషయంలో.. హై కమాండ్ తమ వ్యూహచాతుర్యాన్ని ప్రదర్శిస్తున్నదా? అనే అభిప్రాయం పలువురికి కలుగుతోంది.
పారిపోయే అవకాశం లేకుండా ముందరి కాళ్లకు బంధాలు వేసే వైఖరిని చూపిస్తున్నట్లుగా విశ్లేషకులు భావిస్తున్నారు. పిసిసి సారధుల మీద అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతున్న మాజీ చీఫ్ మరియు ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కి స్క్రీనింగ్ కమిటీలో చోటు కల్పించడం ద్వారా కాంగ్రెస్ హై కమాండ్ మంచి ఎత్తుగడ వేసింది అని పలువురు అనుకుంటున్నారు.
పిసిసి మాజీ చీఫ్ ఉత్తంకుమార్ రెడ్డి కాంగ్రెస్ ను వీడి భారతీయ జనతా పార్టీలోకి వెళతారని ప్రచారం కొంతకాలంగా జరుగుతూ వస్తోంది. తన ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ ను వీడే అవకాశం లేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు సందర్భాలలో వివరణ ఇచ్చుకోవాల్సిన అవసరం కూడా ఏర్పడింది.
పిసిసి లోని కొందరు నాయకుల అనుచర గణాలు ఉద్దేశపూర్వకంగా తనకు వ్యతిరేకంగా ఇలాంటి ప్రచారాన్ని నడిపిస్తున్నాయని ఉత్తం చెబుతూ వచ్చారు. అయితే నిప్పు లేనిదే పొగరాదు అన్నట్లుగా ఉత్తంకుమార్ రెడ్డి పార్టీ ఫిరాయించే ఆలోచన లేకుండా ఇలాంటి పుకారు పుట్టి ఉండకపోవచ్చుననే కూడా అభిప్రాయాలు వినిపించాయి.
అయితే ఒకవేళ పార్టీ ఫిరాయించే ఆలోచన ఆయనకి ఉన్నప్పటికీ కూడా అలాంటి అవకాశం లేకుండా ఆయన భుజస్కంధాల మీద పార్టీ హై కమాండ్ ఇప్పుడు కొత్త బాధ్యతలు పెట్టేసింది. త్వరలో ఎన్నికలు జరగబోతున్న నాలుగు రాష్ట్రాలలో అభ్యర్థుల ఎంపిక కోసం స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేసిన పార్టీ, తెలంగాణ కోసం వేసిన కమిటీలో ఉత్తంకుమార్ రెడ్డికి చోటు కల్పించింది.
కేరళ మాజీ ముఖ్యమంత్రి కరుణాకరన్ కుమారుడు, లోక్ సభ సభ్యుడు కే మురళీధరన్ చైర్మన్ గా వ్యవహరించే ఈ కమిటీలో పిసిసి సారధి రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే లతోపాటు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా ఉంటారు.
సాధారణంగా ఇలాంటి కమిటీల ఏర్పాటులో కులాల సమతూకానికి ప్రాధాన్యం ఇస్తుంటారు. అయితే రెడ్డి సామాజిక వర్గం నుంచి ఇద్దరు నాయకులకు చోటు కల్పించడానికి హై కమాండ్ వెనుకాడలేదు. మాజీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డిలో వేరే ఆలోచనలు రాకుండా ఉండడానికి, నాయకుల మధ్య వైరం ఉన్నదనే భావన పార్టీ శ్రేణులలో ఏర్పడకుండా చూడడానికి.. ఎంతో కీలకమైన ఈ స్క్రీనింగ్ కమిటీలో ఉత్తమ్ కు చోటు కల్పించినట్లుగా తెలుస్తోంది.