గులాబీ దళాల్లో రగులుతున్న విప్లవాగ్నులు!

ఎన్నికల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకం కష్టం ఎదురవుతోంది. ప్రధానంగా తెలంగాణలో రెండో దఫా కూడా తిరుగులేని మెజారిటీతో గెలిచి అప్రతిహతంగా అధికారాన్ని కొనసాగిస్తున్న భారత రాష్ట్ర సమితికి…

ఎన్నికల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క రకం కష్టం ఎదురవుతోంది. ప్రధానంగా తెలంగాణలో రెండో దఫా కూడా తిరుగులేని మెజారిటీతో గెలిచి అప్రతిహతంగా అధికారాన్ని కొనసాగిస్తున్న భారత రాష్ట్ర సమితికి తిరుగుబాట్లు బెడద చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అనేక నియోజకవర్గాలలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పట్ల పార్టీ నాయకులు స్థానిక కార్యకర్తలు అసంతృప్తితో ఉడికిపోతున్నారు. 

ఇప్పుడున్న ఎమ్మెల్యేకే మళ్లీ టికెట్ ఇచ్చేటట్లయితే గనుక ఓడించి తీరుతామని ప్రతిజ్ఞలు చేస్తున్నారు. తిరుగుబాటు చేస్తున్న వారంతా ప్రత్యేకంగా సమావేశాలు పెట్టుకుని ఈ మేరకు తీర్మానాలు కూడా చేస్తున్నారు. ఇతర సీనియర్ నాయకులకు స్థానిక ఎమ్మెల్యేల మీద పితూరీలు చెబుతున్నారు. అసంతృప్త నాయకులను బుజ్జగించడం, సర్దుబాటు చేయడం అనేది భారాస అధినాయకత్వానికి పెద్ద తలనొప్పిగా మారే ప్రమాదం కనిపిస్తోంది.

రాష్ట్రంలోని అనేక ప్రాంతాలలో ఒకే రోజున సిటింగ్ ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా పార్టీ కార్యకర్తలు నిరసన గళాలు వెల్లువెత్తడం గమనార్హం. పెద్దపల్లి ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం వలన తాను భారాసను వీడుతున్నట్లుగా మాజీ ఎమ్మెల్యే బిరుదు రాజమల్లు ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా కూడా ఆయన వెల్లడించారు. ఎమ్మెల్యే సొంత పార్టీ నాయకులను పట్టించుకోవడంలేదని, విపరీతమైన అవినీతికి పాల్పడుతున్నారని ఆయన ఆరోపిస్తున్నారు. 

అలాగే నల్గొండ జిల్లా దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తమను పట్టించుకోవడం లేదంటూ స్థానిక నాయకులు ఏకంగా ఒక సమావేశం నిర్వహించడం విశేషం. ఇక్కడ మాజీ మునిసిపల్ చైర్మన్ దేవేందర్ నాయక్ ఆధ్వర్యంలో తిరుగుబాటు జెండా ఎగురుతోంది. ప్రస్తుత ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ తమను పట్టించుకోవడం లేదని ఆయనను మార్చకపోతే ఓడిస్తామని కార్యకర్తలు అంటున్నారు. దేవేందర్ నాయక్ కు టికెట్ ఇస్తే కనుక రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తాం అని కూడా అంటున్నారు. 

కరీంనగర్ జిల్లా చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మీద కూడా ఇలాంటి అసమ్మతి గళాలు వెల్లువెత్తుతున్నాయి. చొప్పదండి పరిధిలో ఉన్న అసంతృప్తులను బుజ్జగించడానికి సర్దుబాటు చేయడానికి మంత్రి గంగుల కమలాకర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ లు నియోజకవర్గస్థాయి నాయకులతో నిర్వహించిన ఒక సమావేశంలో ఎమ్మెల్యే సమక్షంలోనే ఆయన పట్ల పార్టీ నాయకులందరూ తీవ్రమైన నిరసనను తెలియజేశారు. ఎమ్మెల్యే వైఖరితో తామందరం ఇబ్బంది పడుతున్నామని పోలీసులను అడ్డుపెట్టుకొని సొంత పార్టీ నాయకుల మీదనే కేసులు బనాయిస్తున్నారని వారు ఆరోపించినట్లుగా తెలుస్తోంది. 

మంత్రి, మాజీ ఎంపీ సర్ది చెప్పిన నేపథ్యంలో పార్టీ తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటాం అని హామీ ఇస్తూనే గెలిచే అభ్యర్థికి మాత్రమే టికెట్ ఇవ్వాలని ఈ అసమ్మతి నాయకులంతా ప్రకటించడం ఒక హెచ్చరికగా భావించాల్సి ఉంటుంది. ఇవి మచ్చుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రంలోని చాలా నియోజకవర్గాల్లో ఇదే మాదిరి పరిస్థితి ఉంది.

సాధారణంగా భారత రాష్ట్ర సమితిలో వ్యవహారం ఎప్పుడూ ఏక ధ్రువ వ్యవస్థగా ఉంటుంది. పార్టీ హైకమాండ్ తీసుకునే నిర్ణయానికి ఎదురు చెప్పే సాహసం కార్యకర్తలు ఎవ్వరూ చేయరు. ఇష్టం లేకపోయినా సరే తమ అభిప్రాయాలు బయట పెట్టే ప్రయత్నం చేయరు. కానీ ఇప్పుడు కాస్త పరిస్థితులు మారుతున్నట్లుగా కనిపిస్తోంది. కాంగ్రెస్ పార్టీ, భారతీయ జనతా పార్టీ కూడా ఇదివరకటి కంటే ఎక్కువ బలంగా కనిపిస్తూ ఉండడం, తమ మాట నెగ్గకపోతే భారాసను వీడి ఆ పార్టీల్లోకి వెళ్ళగలమని హెచ్చరించగల అవకాశం ఉండడంతో తెలంగాణలోని చాలా నియోజకవర్గాలలో స్థానిక నాయకులు తిరుగుబాటు జెండా ఎగరేస్తున్నారు.

ఒకవైపు భారాస హైకమాండ్ సిటింగ్ ఎమ్మెల్యేలకే టికెట్లు అని ఇప్పటికే ప్రకటించింది. అతికొద్ది స్థానాలలో మాత్రం అభ్యర్థుల మార్పు ఉంటుందని కేసీఆర్ సూచనప్రాయంగా సెలవిచ్చారు. అయితే తిరుగుబాట్లు మాత్రం పదుల సంఖ్యలో నియోజకవర్గాలలో వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే కొందరు నాయకులు పార్టీని వీడి కాంగ్రెస్ బాట పట్టారు కూడా. 

ఇలాంటి నేపథ్యంలో ప్రతి చోటా తిరుగుబాటులను సర్దుబాటు చేయడం పార్టీ నాయకత్వానికి సాధ్యమవుతుందా? జాతీయ పార్టీగా ఆవిర్భవించే ప్రయత్నాలలో రాష్ట్ర పార్టీ వ్యవహారాల మీద కేసీఆర్ ఫోకస్ తగ్గుతున్న నేపథ్యంలో, పార్టీని కట్టుబాటులో ఉంచడం వారికి కుదురుతుందా అనే సందేహం పలువురిలో కలుగుతోంది.