సినిమా జనాలు గొప్పోళ్లు. కెమేరా వెనుకే కాదు, తెరముందు కూడా నటించేయగలగుతున్నారు. మొన్నటికి మొన్న హలో గురూ ప్రేమ కోసమే సినిమా షూట్ లో చిన్న ఇస్యూ జరిగిందని వార్తలు వినవచ్చాయి. జరిగింది ఏమిటంటే, సినిమాలోని ఓ కీలక సన్నివేశంలో క్యూ అందుకోవడంతో హీరోయిన్ అనుపమ తడబడ్డారు. దానికి కో ఆర్టిస్ట్ అయిన ప్రకాష్ రాజ్ కాస్త ఏదో అన్నారు. దీంతో అనుపమ ఫీలయ్యారు. కాస్తగట్టిగా సమాధానం చెప్పి, కళ్ల నీళ్లు పెట్టుకుని, కుర్చీలో కూలబడ్డారు.
ఇలా జరిగిన విషయాన్ని అదే సమయంలో అక్కడే వుండి చూసిన వాళ్లు బయటకు పీలర్ వదిలారు. ఈ సంగతి తెలిసిన తరువాత నిర్ణారణ కోసం ఆ మర్నాడు ఉదయం, దిల్ రాజు యూనిట్ లో జనాలకే ఫోన్ చేసి అడగడం జరిగింది. ఆరోజు షూటింగ్ క్యాన్సిల్ అయింది. ముందురోజు వచ్చిన ఫీలర్ల ప్రకారం అనుపమ కాస్త బరస్ట్ అయ్యారనే తెలిసింది.
కానీ యూనిట్ లోని సభ్యులకు ఫోన్ చేస్తే, విషయం ఇదీ, క్యూ అందుకోవడంలో ఆమె కాస్త తడబడ్డారు. అందులో ఆమె తప్పులేదు. ప్రకాష్ రాజ్ కామెంట్ వల్లే బాధపడ్డారు అని యూనిట్ సభ్యుల నుంచి తెలియవచ్చింది. ఇవన్నీ కలిపి వార్తగా అందించడం జరిగింది.
ఈరోజు షూటింగ్ మళ్లీ ఓకె అయింది. అంతా ఆటలో అరటిపండు అని మళ్లీ యధావిధిగా షూటింగ్ స్టార్ట్ చేసారు. అనుపమ, ప్రకాష్ రాజ్ మళ్లీ మామూలయ్యారు. అంతవరకు ఓకె. ఓ సెల్ఫీ తీసుకుని, అసలు తమ ఇద్దరి మధ్య ఏమీ జరగలేదని, అంతా క్రియేషన్ అని, జోక్ లా ఎంజాయ్ చేసామనే అర్థం వచ్చేలా ట్వీట్ చేసారు అనుపమ.
ఇదే విషయం ముందు ఫీలర్ అందించిన వారిని, మర్నాడు క్లారిటీ ఇచ్చిన యూనిట్ జనాలను అడిగితే, 'మామూలే కదా… వాళ్లు వాళ్లు కలిసిపోయిన తరువాత, వార్త తప్పు అనడం ఇండస్ట్రీలో కామనే కదా' అని ముక్తాయించారు. దీన్నిబట్టి చూస్తుంటే సినిమా జనాలు ఆఫ్ ది స్క్రీన్ కూడా బ్రహ్మాండంగా నటించేస్తున్నారు అనుకోవాల్సి వస్తోంది.
అవును, ఇంతకీ ఈ ఉదంతంలో, వార్తలో ప్రకాష్ రాజ్ కూడా వున్నారు కదా? మరి ఆయనేమీ ట్వీటు చేయలేదుగా?