అభిమానులే దేవుళ్లు హీరోలకు. కండిషన్ ఏమిటంటే సినిమా విడుదలకు వున్నపుడల్లా. ప్రతి సినిమా విడుదలకు ముందు మెగాభిమానులకు పిలుపు అందడం కామన్. తెలుగు రాష్ట్రాల్లోని కీలక మెగాభిమానులను ఆహ్వానించడం, సమావేశం నిర్వహించడం, ఆపై విందు ఏర్పాటు చేయడం, విడుదల కాబోయే సినిమా విషయంలో సహకరించాలని కోరడం ప్రతీసారీ జరిగేదే.
ఈసారి కూడా అలాంటి మీటింగ్ కు ఏర్పాట్లు జరుగుతున్నట్లు సమాచారం. మెగాఅల్లుడు కళ్యాణ్ ధేవ్ నటించిన తొలి సినిమా విజేత విడుదలకు రెడీ అయింది. సెన్సారు కార్యక్రమం కూడా పూర్తి చేసుకుంది. ఈ సినిమాను 12న విడుదల చేస్తున్నారు. అంటే మరో నాలుగు రోజులు. అందుకే ఈ లోగా హీరోను అభిమానులందరికీ ఓసారి పరిచయం చేసి, సినిమా గురించి చెప్పి, సహకరించమని కోరే కార్యక్రమం ఏర్పాటు చేస్తన్నట్లు తెలుస్తోంది.
మెగాహీరోలైనా, మరే హీరోలైనా సినిమాలకు ఓపెనింగ్స్ కీలకం. అలా మంచి ఓపెనింగ్స్ రావాలంటే పెద్ద సినిమా అన్నా అయి వుండాలి. లేదా మాంచి ఫ్యాన్స్ బేస్ అయినా వుండాలి. మెగాభిమానుల సమావేశం ప్రతీసారీ నిర్వహించేది కీలకంగా ఇందుకోసమే. ఈసారి మరో ముఖ్యమైన పాయింట్ మెగా అల్లుడు తొలి సినిమా కావడం.
ఇదిలా వుంటే మెగాభిమానుల సమావేశం వారందరినీ జనసేనలో చేరడానికి అంటూ వేరే విధమైన గ్యాసిప్ లు రావడం విశేషం.