ఒకేమాటలు చెప్పాలంటే.. నిజమే, సెలబ్రిటీలతో ఇంటర్వ్యూ చేయాలంటే దానికో రేటు ఉంది. ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయిన చాలా మ్యాగజైన్ల వారుకూడా తాము ఎంచుకున్న హీరోయిన్లకు డబ్బులిచ్చే ఇంటర్వ్యూలు చేస్తాయి. డబ్బులిచ్చే ఫొటో షూట్లు నిర్వహిస్తాయి. డబ్బులిచ్చే ఆ ఫొటోలను మ్యాగజైన్లో ప్రచురించుకుంటాయి. ఆ డబ్బులు తీసుకునే హీరోయిన్లు ఆ ఇంటర్వ్యూస్‌లో కూడా యాక్ట్ చేస్తూ ఉంటారు. చాలా ఫేమస్ మ్యాగజైన్లు కూడా అలా ఇంటర్వ్యూలను డబ్బుతోనే డీల్ చేస్తూ ఉంటాయి. ఇక ఫేమస్ అయిన హీరోయిన్లు కూడా అలాంటి డబ్బులు తీసుకొంటూ ఉంటారు.
అయితే అప్ కమింగ్ హీరోయిన్ల గురించి ఇక్కడ ఊసే ఉండదు. అప్ కమింగ్ వాళ్లను పేరున్న మీడియా సంస్థలు పట్టించుకోవు. స్టార్ అయిన వాళ్లతోనే ఆ మ్యాగజైన్లకు కూడా పని. వాళ్ల ఫొటోలే కావాలి. అందుకని డబ్బులిచ్చి కవర్ పేజీకి సంబంధించిన ఫొటోలను తీసుకొంటూ ఉంటాయి మ్యాగజైన్లు. అదంతా వేరే కథ. హైక్లాస్ జనాలకు మాత్రమే వెళ్తాయి ఆ మ్యాగజైన్లు. వాటి ధర కూడా భారీస్థాయిలో ఉంటుంది. వాటికి యాడ్స్ ఇచ్చేవాళ్లు కూడా భారీగా చెల్లించుకోవాల్సిందే. అలాంటి మ్యాగజైన్లు హైక్లాస్ స్పాల్లోనూ, ఔడీ, బెంజ్ కార్లలోనూ… పెద్ద పెద్ద బుక్ స్టోర్లలో మాత్రమే కనిపిస్తాయి.
వాటి సంగతలా ఉంటే.. ఇప్పుడు ఇలా డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు తీసుకునే సంప్రదాయం సాధారణ మీడియా సంస్థలకు కూడా మొదలైంది. ప్రత్యేకించి ఇప్పుడు తామరతంపరలా పెరిగిన యూట్యూబ్ చానళ్ల కథ గురించి ఆరాతీస్తే ఈ వైనం స్పష్టం అవుతోంది. యూట్యూబ్ చానల్ పెట్టేసి సంపాదించేయాలన్న కలలతో చాలామంది వచ్చేస్తున్నారిప్పుడు. చానల్ పెట్టేయడం అయితే ఈజీనే. కానీ దాన్ని పాపులర్ చేసుకోవడం, వ్యూస్ తెచ్చుకోవడం మాత్రం ఈజీకాదు. దానికోసం కొంతమంది సిన్సియర్‌గా ప్రయత్నిస్తుంటే కొందరు అడ్డదారులు తొక్కుతున్నారు.
అబద్ధాలను చెబుతూ వీడియోలు తయారుచేసి వదలడం వీళ్లలో కొందరు చేస్తున్న పని. ఆ అబద్ధాలు ఎలా ఉంటున్నాయంటే… 'వీళ్ల మధ్య బంధుత్వం తెలుసా' అంటూ ఎవరో ఐదారు మంది సెలబ్రిటీల ఫొటోలను చూపిస్తారు. వాళ్ల మధ్య ఏ బంధుత్వం లేకపోయినా ఉందని వీడియోలో చెబుతారు. ఇవెంత కామెడీగా ఉంటాయంటే.. ఆ మధ్య ఫేమస్ అయిన ప్రియాప్రకాష్ వారియర్ ఫేమస్ విలన్ ఆశిష్ విద్యార్థి కూతురు.. ఇలా ఉంటాయి వీళ్ల మాటలు. ఇలాంటి వీడియోలు చేసి వదులుతున్నారు జనాల మీదకు.
ఇలాంటి ఫేక్ వీడియోలకు కూడా లక్షల సంఖ్యలో వ్యూస్ ఉంటుండటం జనాలు కూడా ఎలా ఉన్నారో చెబుతోంది. ఇక రెండోరకం యూట్యూబ్ చానళ్ల వాళ్లు.. ఏదో చేసేయాలని ప్రయత్నిస్తున్నారు. వీళ్లు ఒరిజినల్ వీడియోలను క్రియేట్ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ప్రయత్నాల్లో వీళ్లు.. చాలాకష్టమే పడుతున్నారు పాపం. యూట్యూబ్ చానళ్ల ఇంటర్వ్యూస్‌కు కొన్నాళ్ల నుంచి మంచి క్రేజే ఉంది. సెలబ్రిటీలను పట్టుకుని వారిని కూర్చెబెట్టి గంట, రెండుగంటలు, మూడు గంటలసేపు వాళ్లతో అనేక అంశాలను చెప్పించేసి వాటిని అప్‌లోడ్ చేస్తే వ్యూస్ బాగా వస్తున్నాయి.
అలాగే వాళ్ల ఇంటర్వ్యూలను కట్ అండ్ పీసెస్‌గా చేసి అప్‌లోడ్ చేసినా వ్యూస్‌కు కొదవలేదు. అందుకే అలాంటి ప్రయత్నాలూ సాగుతున్నాయి. అయితే ఇప్పుడు యూట్యూబ్‌లో చానళ్లు ఎక్కువయ్యాయి. సెలబ్రిటీలు తక్కువయ్యారు. దీంతో ప్రతివాళ్లూ సినిమా వాళ్ల తలుపు తడుతున్నారు. ఈ డిమాండ్‌ను కొంతమంది సినిమా వాళ్లు క్యాష్ చేసుకుంటున్నారని టాక్. తాము ఇంటర్వ్యూ ఇస్తాం కానీ.. ఇంత అవుతుంది అని చెబుతున్నారట.
పదివేల రూపాయల నుంచి లక్షవరకూ అడుగుతున్న వాళ్లు ఉన్నారిప్పుడు. ఇండస్ట్రీలో పాతుకుపోయిన సీనియర్లు ఇలా డబ్బులు తీసుకుని ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఈ చానళ్ల నిర్వాహకులు కూడా తమ చానల్ పాపులర్ కావాలంటే ఆ ఇంటర్వ్యూలు తప్పనిసరి అని లెక్కలేసి.. డబ్బులు ఇచ్చి ఇంటర్వ్యూలు తీసుకుంటున్నారని సమాచారం.