బీఆర్ఎస్‌లో అధికారంపై న‌మ్మ‌కం స‌డ‌లుతోందా?

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా మొద‌లైంది. మ‌రోవైపు బీఆర్ఎస్‌, కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ ఇంకా అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్…

తెలంగాణ అసెంబ్లీ ఎన్నిక‌ల పోరు ర‌స‌వ‌త్త‌రంగా సాగుతోంది. నామినేష‌న్ల ప్ర‌క్రియ కూడా మొద‌లైంది. మ‌రోవైపు బీఆర్ఎస్‌, కాంగ్రెస్ అగ్ర‌నేత‌లు ప్ర‌చారాన్ని హోరెత్తిస్తున్నారు. బీజేపీ ఇంకా అభ్య‌ర్థుల ఎంపిక‌పై క‌స‌ర‌త్తు చేస్తోంది. ఈ నేప‌థ్యంలో బీఆర్ఎస్ నేత‌ల ప్ర‌చారంలో తెలంగాణ సెంటిమెంట్ డైలాగ్స్ ఎక్కువ‌య్యాయి. ఇటీవ‌ల సీఎం కేసీఆర్ తెలంగాణ‌, ఆంధ్రా రోడ్ల‌పై త‌న‌దైన వెట‌కారంతో చెప్పిన సంగ‌తి తెలిసిందే.

తాజాగా మంత్రి హ‌రీశ్‌రావు తెలంగాణ సెంటిమెంట్ డైలాగ్స్‌లో ఘాటు పెంచారు. వీరి మాట‌లు వింటుంటే… గ‌త తొమ్మిదేళ్ల‌లో తెలంగాణ రాష్ట్రానికి చేసిన మంచి ప‌నులేంటో చెప్ప‌డం కంటే, తెలంగాణ‌, ఆంధ్రా అంటూ ప్రాంతీయ విద్వేషాల‌ను రెచ్చ‌గొట్టి రాజ‌కీయ ప‌బ్బం గ‌డుపుకోవాల‌నే ప్ర‌య‌త్నాల్ని చూడొచ్చు. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ అధినేత చంద్ర‌బాబునాయుడిని బూచిగా చూపి కేసీఆర్ రెండో ద‌ఫా అధికారాన్ని ద‌క్కించుకున్నారు.

ఇప్పుడు మ‌రోసారి అలాంటి ఫార్ములానే అమ‌లు చేయాల‌నే ప్ర‌య‌త్నాల్ని హ‌రీశ్‌రావు ప్ర‌సంగాల్లో చూడొచ్చు. కాంగ్రెస్‌, బీజేపీ ముసుగులో తెలంగాణ ద్రోహులందరూ ఒక్కటవుతున్నారని హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ ఏర్పాటైతే భోజనం మానేస్తానన్న జనసేన అధినేత పవన్‌కల్యాణ్‌ బీజేపీతో జతకట్టారని గుర్తు చేశారు. అలాగే వైఎస్ ష‌ర్మిల ఎన్నిక‌ల బ‌రి నుంచి త‌ప్పుకుని కాంగ్రెస్‌కు మ‌ద్ద‌తు ప‌లికార‌న్నారు. ఓట్లు చీలకుండా చేసి, తద్వారా బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగించేలా టీడీపీ పోటీ నుంచి తప్పుకుందని ఆయ‌న విమ‌ర్శించారు. ఇలా తెలంగాణ ద్రోహులందరూ ఒక్కటై కుట్రలతో మన మీదకు దాడికి వస్తున్నార‌ని రెచ్చ‌గొట్టే వ్యాఖ్య‌లు చేశారు.

తెలంగాణ వ్యతిరేకులతో రేవంత్‌రెడ్డి దోస్తీ చేశారని, పదవిని త్యాగం చేయకుండా పట్టుకుని వేలాడారని మంత్రి విమర్శించారు. తెలంగాణ కోసం నిలబడిన నిఖార్సైన కేసీఆర్‌తో తెలంగాణ వ్యతిరేకులు పోటీ పడుతున్నారన్నారు. తెలంగాణ‌లో తాము త‌ప్ప మ‌రెవ‌రూ అధికారంలోకి రాకూడ‌ద‌ని బీఆర్ఎస్ భావ‌న‌. అయితే ఇందుకు తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకోవ‌డం ఆ పార్టీకే చెల్లింది. ఎన్నిక‌లు వ‌చ్చిన ప్ర‌తిసారీ ఆంధ్రా నేత‌ల‌పై విద్వేషం చిమ్మ‌డం అల‌వాటుగా మారింది. నిజానికి వారికి ఆంధ్రా ప్రాంతంపై విషం చిమ్మ‌క‌పోతే, ఉనికి కాపాడుకోలేని ప‌రిస్థితి. తెలంగాణ‌లో అధికారాన్ని నిల‌బెట్టుకోడానికి బీఆర్ఎస్ చేతిలో ఏకైక అస్త్రం ఆంధ్రప్ర‌దేశ్‌.

నిజంగా తెలంగాణ‌పై కేసీఆర్‌, కేటీఆర్‌, హ‌రీశ్‌రావుల‌కు అంత చిత్త‌శుద్ధి వుంటే….త‌మ పార్టీలోని తెలంగాణ‌ను తుంగ‌లో తొక్కి భార‌తీయ‌త‌ను ఎందుకు తీసుకొచ్చారో స‌మాధానం చెప్పాల‌నే డిమాండ్స్ వెల్లువెత్తుతున్నాయి. సీఎం కేసీఆర్‌, ఆయ‌న త‌న‌యుడు కేటీఆర్‌, మేన‌ల్లుడి హ‌రీశ్‌రావు రాజ‌కీయ విన్యాసాల‌ను ప్ర‌జ‌లంతా గ‌మ‌నిస్తున్నారు. అదును చూసి వాత పెట్టే ప‌రిస్థితి క‌నిపిస్తోంది. అందుకే వారు భ‌య‌ప‌డుతున్న‌ట్టున్నారు. మ‌రోసారి ఆంధ్రాపై విద్వేషం త‌మ‌కు అధికారం క‌ట్ట‌బెడుతుంద‌నే న‌మ్మ‌కం అవాకులు చెవాకులు పేలేలా ప్రేరేపిస్తోంద‌నే అనుమానం క‌లుగుతోంది.