రామ-కృష్ణ: నందమూరి నయా సెంటిమెంట్

రామ, కృష్ణ శబ్దాలకు నందమూరి వంశానికి ఉన్న అవినాభావ సంబంధం కొత్తగా చెప్పక్కర్లేదు. పెద్ద ఎన్టీఆర్ తన కొడుకుల పేర్లన్నిటికీ కృష్ణ శబ్దాన్ని జోడించారు. జయకృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ.. ఇలా పేర్లు పెట్టారు.…

రామ, కృష్ణ శబ్దాలకు నందమూరి వంశానికి ఉన్న అవినాభావ సంబంధం కొత్తగా చెప్పక్కర్లేదు. పెద్ద ఎన్టీఆర్ తన కొడుకుల పేర్లన్నిటికీ కృష్ణ శబ్దాన్ని జోడించారు. జయకృష్ణ, రామకృష్ణ, హరికృష్ణ, బాలకృష్ణ.. ఇలా పేర్లు పెట్టారు. అయితే ఈ కృష్ణ అనే పదప్రయోగం పెద్ద ఎన్టీఆర్ తోనే ఆగిపోయింది. ఆయనకు వారసులం అని చెప్పుకునే క్రమంలో తారక రామారావులో రామ అనే శబ్దాన్ని ఎన్టీఆర్ కొడుకులు ఉపయోగించడం స్టార్ట్ చేశారు. మరీ ముఖ్యంగా హరికృష్ణ.

ఎన్టీఆర్ కొడుకుల్లో హరికృష్ణ తన కొడుకుల పేర్లకు రామ శబ్దాన్ని జోడించి కల్యాణ్ రామ్, తారక రామ్, జానకి రామ్ అని పేర్లు పెట్టి ఆ సంప్రదాయాన్ని కొనసాగించారు. ఇదే సెంటిమెంట్ ని ఆయన కొడుకులు కూడా ఇప్పుడు కొనసాగిస్తున్నారు. జానకి రామ్ తన కొడుక్కి తారక రామ్ అనే పేరుపెట్టారు. కల్యాణ్ రామ్ కూడా రామ శబ్దంతో తన కొడుక్కి శౌర్యా రామ్ అనే పేరుపెట్టారు.

ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇదే సెంటిమెంట్ ఫాలో అయ్యాడు. తన ఇద్దరి కొడుకుల పేర్లకు రామ శబ్దాన్ని జోడించారు. రామ్ అనే శబ్దంతో ముగిసేలా పేర్లు పెట్టారు. పెద్దోడికి అభయ్ రామ్ అని పేరుపెట్టిన ఎన్టీఆర్, తాజాగా చిన్నోడికి భార్గవ రామ్ అని పేరుపెట్టాడు. ఈ రెండు పేర్ల వెనక మరో మ్యాచింగ్ ఎలిమెంట్ కూడా ఉంది. ఇంగ్లిష్ అక్షరాల క్రమంలో చూసుకుంటే.. ఈ రెండు పేర్లు వరుసగా A, B అక్షరాలతో స్టార్ట్ అయ్యాయి. పెద్దోడికి Aతో మొదలయ్యేలా అభయ్ రామ్ అనే పేరుపెట్టారు. చిన్నోడికి Bతో మొదలయ్యేలా భార్గవ్ రామ్ అనే పేరుపెట్టారు.

సో.. ఎన్టీఆర్ కి మరో సంతానం కలిగితే ఆ పేరు C అనే అక్షరంతో మొదలవుతుందేమో.