ఓవ‌ర్ ఎమోష‌న్‌తో వెళ్లిపోయిన న‌ట‌రాజ్ మాస్ట‌ర్‌

బిగ్‌బాస్‌ని స్క్రిప్ట్ అంటారు. అంతా ముంద‌స్తు నిర్ణ‌యాల మేర‌కే నిర్వ‌హిస్తార‌ని కూడా అంటారు. దీంట్లో నిజ‌మెంతో తెలియ‌దు. అంతా స్క్రిప్ట్  అయితే ప్లేయ‌ర్స్ అంతలా ఎమోష‌న‌ల్ కావ‌డమెందుకు? ఎమోష‌న్ కూడా న‌ట‌నే అనుకుంటే బ‌య‌ట…

బిగ్‌బాస్‌ని స్క్రిప్ట్ అంటారు. అంతా ముంద‌స్తు నిర్ణ‌యాల మేర‌కే నిర్వ‌హిస్తార‌ని కూడా అంటారు. దీంట్లో నిజ‌మెంతో తెలియ‌దు. అంతా స్క్రిప్ట్  అయితే ప్లేయ‌ర్స్ అంతలా ఎమోష‌న‌ల్ కావ‌డమెందుకు? ఎమోష‌న్ కూడా న‌ట‌నే అనుకుంటే బ‌య‌ట సినిమాల్లో కానీ, టీవీల్లో కానీ వీళ్లు స‌క్సెస్ కావ‌డం లేదెందుకు?

ఇవ‌న్నీ ప‌క్క‌న పెడితే కోట్లాది మంది షో చూస్తున్నారు. ఎందుకు ఇంట్రెస్ట్ అంటే బిగ్‌బాస్‌లో శాశ్వ‌త మిత్రులు , శాశ్వ‌త శ‌త్రువులుండ‌రు. అంతా ఆట‌. మిత్రుల‌తో శ‌త్రుత్వం చేయాలి. శ‌త్రువుల‌తో స్నేహం చేయాలి. లేదంటే బిగ్‌బాస్ వూరుకోడు. ఏదో ఒక టాస్క్ పెట్టి ఇరికిస్తాడు. ప్రేక్ష‌కుల‌కి నచ్చే అంశం కూడా ఇదే. బ‌య‌ట జీవితం కూడా బిగ్‌బాస్‌లానే వుంది. ఎవ‌రిని న‌మ్మాలో, న‌మ్మ‌కూడ‌దో తెలియ‌దు. అంద‌రూ మ‌న‌సులో ఏదో పెట్టుకుని, బ‌య‌ట ఇంకోలా వ్య‌వ‌హ‌రిస్తారు. ప్ర‌యోజ‌నాల విష‌యంలో అయిన వాళ్లే వెన్నుపోటు పొడుస్తున్నారు. ఇళ్ల‌లో, ఆఫీసుల్లో ఇదే జ‌రుగుతోంది.

ఆదివారం రాత్రి న‌ట‌రాజ్ మాస్ట‌ర్ ఎలిమినేట్ అయ్యారు. ఆయ‌న ముందు నుంచి స్ట్రాంగ్ ప్లేయ‌ర్‌. టాస్క్‌ల్లో గెల‌వ‌డానికి స‌ర్వ‌శ‌క్తులు ఒడ్డుతారు. గెలిస్తే విప‌రీత‌మైన ఆనందం, లేదంటే బాధ‌. అయితే గేమ్‌ని గేమ్‌లా తీసుకోరు. పూర్తిగా ప‌ర్స‌న‌ల్‌గా తీసుకుంటారు.

నామినేట్ చేసిన వాళ్ల‌పై ప‌గ‌బ‌ట్టిన‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తారు. దూషిస్తారు. తాను పాప కోసం ఆడ‌డానికి వ‌చ్చాన‌ని ప‌దేప‌దే చెబుతుంటారు. ఆయ‌న ఎమోష‌న్ ఆయ‌నిష్టం. అయితే న‌ట‌రాజ్‌కి వ్య‌తిరేకంగా ఆడే వారంద‌రినీ ప‌దేప‌దే పాప సెంటిమెంట్‌తో ఇరుకున పెట్టేవాడు. ఇదే విష‌యాన్ని బిందు మాధ‌వి ఎత్తి చూపితే పిచ్చిదని తిట్టాడు. ఆయ‌న ఎమోష‌న్ లెవెల్స్ ఎట్టుంటాయంటే పిచ్చి ప‌ట్టిన వాడిలా మాట్లాడుతాడు. దీనికి ప‌రాకాష్ట దేవుడితో మాట్లాడ‌డం. ఆకాశం వైపు చూసి ఏడుస్తూ చంపేయ‌మ‌ని వేడుకున్నాడు.

ఆయ‌న వోవ‌ర్ ఎమోష‌న్ ఆడియ‌న్స్‌కి న‌చ్చ‌లేదో, లేదా స్క్రిప్ట్ ప్ర‌కారం ఎలిమినేట్ అయ్యాడో తెలియ‌దు కానీ, వెళ్లిపోయాడు.

కొస‌మెరుపు ఏమంటే వెళ్లే ముందు కూడా అఖిల్‌ని త‌ప్ప మిగ‌తా అంద‌రికీ నెగెటివ్ బిరుదులిచ్చి వెళ్లాడు. బిందుని పాముతో పోల్చాడు. విషం క‌క్కుతూనే వుంటుంద‌ట‌. బాబా మాస్ట‌ర్‌ని దున్న‌పోతు, అరియానాని విశ్వాసం లేని కుక్క అన్నాడు.

అసూయ‌, ద్వేషం, నెగెటివిటీ విప‌రీతంగా వున్న సీరియ‌ల్స్ ఇలాంటి షోలు హిట్ ఎందుకు అవుతున్నాయో మ‌న‌ల్ని మ‌నం ప‌రిశీలించుకుంటే అర్థ‌మ‌వుతుంది.

జీఆర్ మ‌హ‌ర్షి