సినిమా నటులు రాజకీయాల్లోకి రావడం, ఏ మాత్రం తేడా వచ్చినా తిరిగి మాతృరంగంలోకి వెళ్లడం మామూలే. మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించి రాజకీయాల్లో అదృష్టాన్ని పరీక్షకు పెట్టారు. అయితే అంచనాకు తగ్గట్టు ప్రజాదరణ లభించలేదు. ప్రస్తుత రాజకీయాలు తన మనస్తత్వానికి పడవని త్వరగానే తెలుసుకున్నారు. కాంగ్రెస్‌లో ప్రజారాజ్యాన్ని విలీనం చేసి, ఆ తర్వాత పూర్తిగా రాజకీయాలకు స్వస్తి చెప్పారు.
అనంతరం రాజకీయాల్లో రెండో ఇన్నింగ్స్ స్టార్ట్ చేశారు. ఈ నేపథ్యంలో అన్న రాజకీయ అనుభవాన్ని గుణపాఠంగా నేర్వని పవన్‌కల్యాణ్, ప్రశ్నించడానికి అంటూ జనసేన పార్టీని స్థాపించారు. పవన్ ప్రశ్న సంగతేమోగానీ, ఆయనే ప్రశ్నలకు గురి కావడం విశేషం. రాజకీయ పార్టీ అధినేతగా ఇకపై సినిమాలు చేయనని పవన్ ప్రకటించారు. అయితే సినిమాలు చేయకపోతే మనుగడ సాగించలేనంటూ తిరిగి షూటింగ్‌లతో బిజీ అయ్యారు.
పవన్‌కల్యాణ్ తిరిగి సినిమాల్లో నటించాలనే నిర్ణయానికి వ్యతిరేకంగా జనసేన సీనియర్ నేత, సీబీఐ మాజీ అధికారి లక్ష్మినారాయణ పార్టీ నుంచి బయటికెళ్లారు. రాజకీయాలను పవన్ సీరియస్‌గా తీసుకోలేదనేది ఆయన వాదన. షూటింగ్‌లు లేని సమయంలో మాత్రమే ఆయన అడపాదడపా ప్రజల్లోకి వచ్చి, తోచిందేదో మాట్లాడుతుంటారు.
ఈ నేపథ్యంలో తమిళనాడు సీఎం స్టాలిన్ తనయుడు, డీఎంకే ఎమ్మెల్యే ఉదయనిధి ఇకపై పూర్తి స్థాయిలో రాజకీయాలకే అంకితమవుతానని ప్రకటించడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఉదయనిధి హీరోగా నటించిన ‘నెంజుక్కునీది’ ఈ నెల 20న విడుదలవుతోంది. అలాగే ‘మామన్నన్’ అనే చిత్రంలో ఉదయనిధి నటిస్తున్నారు. ఇదే తన చివరి చిత్రమని ఉదయనిధి వెల్లడించారు. పూర్తి స్థాయిలో రాజకీయాలకే పరిమితమవుతానని ఆయన స్పష్టం చేశారు.
మరో రెండేళ్లలో ఎన్నికలున్న నేపథ్యంలో ఉదయనిధిని జనసేనాని పవన్‌కల్యాణ్ స్ఫూర్తిగా తీసుకోవాలని పార్టీ కార్యకర్తలు, నేతలు కోరుతున్నారు. ఒకేసారి రెండు పడవలపై ప్రయాణం కుదరదని, రాజకీయాల్లో నిబద్ధతను చాటుకోవాలంటే నిత్యం వాళ్ల మధ్యే ఉండాలని జనసేన కార్యకర్తలు, నాయకులు అంటున్నారు.
ఇప్పటికైనా షూటింగ్‌లు మానుకుని, పూర్తిస్థాయిలో ప్రజలకే అంకితమవుతాననే నమ్మకాన్ని కలిగించాల్సిన బాధ్యత పవన్‌పై ఉంది. ఉదయనిధిని చూసేనా పవన్ నేర్చుకుంటారా? అనేది ప్రశ్న.