కాంగ్రెస్ అంటే ఒక అగ్రశ్రేణి పార్టీ అనే హోదానే మసకబారిపోయింది. సుదీర్ఘ కాలం అధికారం వెలగబెట్టిన ఈ పార్టీ.. కేంద్రంలో ఇక సొంతంగా, ఎవ్వరి సాయమూ అవసరం లేకుండా, మళ్లీ అధికారంలోకి రావడం అనేది కేవలం కలలో మాటగానే మారిపోయింది. ప్రస్తుత నేపథ్యంలో కాంగ్రెస్ సారథ్యంలోని కూటమి అధికారంలోకి వస్తే రావొచ్చు గానీ.. అందులో కాంగ్రెస్ అతిపెద్ద భాగస్వామిగా ఉండగలదనే గ్యారంటీ కూడా లేని పరిస్థితి.
ఇలాంటి సంక్లిష్ట పరిస్థితుల్లో పార్టీని ఉద్ధరించడానికి వారు నిర్వహించిన చింతన్ బైఠక్ వారికి మేలుచేస్తుందా? చేటు చేస్తుందా?
తమ పార్టీ వరుసపెట్టి ఓడిపోతుండడానికి నెపం ఈవీఎంల మీదకు నెట్టేయడానికి ఈ బైఠక్ లో ప్రయత్నం జరిగింది. అది అసమర్థ ప్రయత్నం. పార్టీ ఓడిపోతుండడానికి ప్రజలకు తాము దూరమవుతున్నామనే సంగతిని గుర్తించకుండా.. ఈవీఎంలు నెపం అని తమలో తాము ఆత్మవంచన చేసుకుంటూ.. తాము అధికారంలోకి వస్తే.. ఈవీఎంలను రద్దుచేసి బ్యాలెట్ పద్ధతి తీసుకువస్తాం అని కాంగ్రెస్ ప్రకటించడం హాస్యాస్పదం. ఇలాంటి ప్రయత్నం వారికి మేలు చేయదు.
ప్రెవేటు రంగంలో కూడా రిజర్వేషన్లు తీసుకువస్తాం అని ప్రకటించడం ద్వారా.. ఏ వర్గాల ఓటు బ్యాంకును నమ్ముకుని కాంగ్రెస్ రాజకీయం చేయాలనుకుంటున్నదో అర్థమవుతుంది. ఆ విషయంలో కాంగ్రెస్ పార్టీ ఆలోచన సరళి, నూటయాభయ్యేళ్లుగా అలాగే ఉన్నదని, ఇవాళ్టి సామాజిక పరిస్థితులకు తగ్గట్టుగా మారలేదని కూడా అనిపిస్తుంది.
ఇక వారు ప్రకటించిన యాత్రల సంగతి. కాశ్మీర్ టూ కన్యాకుమారి మొత్తానికి రెండు యాత్రాలు చేయాలనేది పార్టీ నిర్ణయం. ఆగస్టు 15న ఒకటి, అక్టోబరు 2న ఒకటి ప్రారంభిస్తారుట. నిరుద్యోగం గురించి రోజ్ గార్ యాత్ర, తర్వాత భారత్ జోడో పేరుతో దేశాన్ని ఐక్యం చేసే యాత్ర నిర్వహిస్తారట. పాదయాత్రలు అయినా దేశవ్యాప్త యాత్రలు అయినా.. వాటి లక్ష్యం నిర్దిష్టంగా, చిత్తశుద్ధితో లేకుండా ఏం చేసినా దండగే.
ఈ విషయంలో హైదరాబాదులోని ప్రొఫెసర్ హరగోపాల్ ఇటీవల ఇక్కడకు వచ్చిన రాహుల్ కు దేశంలో తిరగాలని సలహా ఇచ్చారు. హరగోపాల్ సలహా పనిచేసిందో లేదా పాదయాత్రలు, అధికారంలోకి తీసుకువచ్చే సెంటిమెంట్ మార్గాలుగా ముద్రపడ్డాయి గనుక.. వారలా నిర్ణయించారో తెలియదు. కానీ.. హరగొపాల్ సలహా వెనుక ఉద్దేశ్యం వేరు. నెహ్రూ డిస్కవరీ ఆఫ్ ఇండియా రాశారని, ఇప్పుడు రాహుల్ కూడా భారతీయ గ్రామీణ ప్రాంతాల్లో పర్యటిస్తే.. అసలైన అభివృద్ధి ఆనవాళ్లు–వాస్తవాలు తెలుస్తాయని హరగోపాల్ చెప్పారు. పార్టీ ప్రకటించిన రెండు యాత్రలు అలా కనిపించడం లేదు. కేవలం రాజకీయ గిమ్మిక్ గా మాత్రమే ఉన్నాయి.
మొత్తానికి కాంగ్రెస్ పార్టీ చింతన్ బైఠక్ ద్వారా చాలా సుదీర్ఘమైన కసరత్తుతో అనేక నిర్ణయాలు తీసుకున్నది గానీ.. ఇవి అధికారాన్ని అందిస్తాయని చెప్పలేం. ఇంత కసరత్తు జరిగినా కాంగ్రెస్ తేల్చలేకపోయిన అంశాలు అనేకం ఉన్నాయి. నాయకత్వం కూడా అందులో ఒకటి. ఆ పార్టీకి నాయకుడు ఎవరు? పగ్గాలు పట్టుకోవడం ఇష్టంలేని ప్రేక్షకసారథిగా రాహుల్ ఎంతకాలం ఉండదలచుకున్నారు.
నాయకత్వం విషయంలో సందిగ్ధతలను తొలగించాలని హరగోపాల్ చెప్పిన సలహాలు మాత్రం వారికి ఎందుకు గుర్తుకు రాలేదు.. ఇవన్నీ కూడా ప్రశ్నార్థకాలే.!