వామపక్షాలపై ఢిల్లీ లెవెల్లో ఒత్తిడి!

సీపీఐ చాలా తెలివిగా వ్యవహరించింది. కాంగ్రెస్ తో పొత్తుల విషయంలో తమ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వారు తేల్చి చెప్పేశారు. నిజానికి మొన్నటిదాకా కాంగ్రెసుతో సీపీఐకు పేచీ లేదు. సీపీఎం అడిగిన…

సీపీఐ చాలా తెలివిగా వ్యవహరించింది. కాంగ్రెస్ తో పొత్తుల విషయంలో తమ పార్టీ కేంద్ర కమిటీ నిర్ణయం తీసుకుంటుందని వారు తేల్చి చెప్పేశారు. నిజానికి మొన్నటిదాకా కాంగ్రెసుతో సీపీఐకు పేచీ లేదు. సీపీఎం అడిగిన సీట్లు దక్కలేదని అలుగుతూ వచ్చినా.. సీపీఐకు ఆ ఇబ్బంది ఎదురు కాలేదు. 

కాంగ్రెస్ చెన్నూరు, కొత్తగూడెం ఆఫర్ చేస్తే.. వీరు కూడా అందుకు సుముఖంగానే ఉన్నారు. అయితే వివేక్ కాంగ్రెసులో చేరిన తర్వాత.. చెన్నూరు సీటు ఆయనకు దక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీపీఐకు కేవలం కొత్తగూడెం మాత్రం దక్కే అవకాశం ఉంది. పార్టీలో ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

కేవలం ఒక్క సీటు తీసుకుని గెలిచినా కూడా పార్టీ పరంగా నష్టం జరుగుతుందని కొందరు అభిప్రాయం పడుతున్నారు. కనీసం ఒక్కటైనా గెలిచి.. శాసనసభలో అడుగుపెట్టవచ్చు కదా.. చెన్నూరును త్యాగం చేసినందుకు కాంపెన్సేషన్ గా ఎమ్మెల్సీ స్థానాలు పొందవచ్చుననేది కొందరి వాదన. ఒకవైపు సీపీఎం ఇంకా అలకపాన్పు మీదనే ఉంది. 

తాము మాత్రం కాంగ్రెసుతో పొత్తు పెట్టుకుంటే.. వామపక్షాల మైత్రి చెడుతుందని కొందరంటున్నారు. అధికారంలోకి రావడమే ముఖ్యం గానీ.. ఒక్క సీటు అయినా తీసుకోవాలనేది అంతర్గతంగా వారిలో ఉన్న కోరిక. అందుకే అరవై మంది కూర్చున్న సమావేశంలో ఏమీ తేల్చకుండా ఢిల్లీలోని కేంద్ర కమిటీ మీదకు నెట్టేశారు.

ఇప్పుడు ఢిల్లీలోని కాంగ్రెస్ పెద్దలు మంత్రాంగం నడుపుతున్నట్టు సమాచారం. ఆల్రెడీ ఇం.డి.యా. కూటమిలో కాంగ్రెస్, సీపీఐ, సీపీఎం అంతా మిత్రపక్షాలుగానే ఉన్నాయి. ఇప్పుడు కాంగ్రెస్ పెద్దలు ఆయాపార్టీల కేంద్ర కమిటీలతో మంతనాలు సాగిస్తున్నట్టు సమాచారం. సీపీఎం కూడా విడిగా పోటీచేయడం వలన సాధించేదేమీ లేదని.. కలిసి పోటీచేయడం వల్ల.. కనీసం కేసీఆర్ ను ఓడించడం సాధ్యమవుతుందని వారు వాదిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇలాంటి చిన్న చిన్న పంతాలకు పోవడం వలన.. కేసీఆర్ మళ్లీ గెలిస్తే.. తెలంగాణలో వామపక్షాల మనుగడే ప్రశ్నార్థకం అవుతుందని కాంగ్రెస్ పెద్దలు హెచ్చరిస్తున్నట్టుగా  సమాచారం. అయితే వారి ఒత్తిడి ఎంత మేర ఫలిస్తుందో తెలియదు. నామినేషన్లు విడివిడిగా వేసినప్పటికీ.. ఉపసంహరణ సమయానికి ఈ రాజీచర్చలు ఒక కొలిక్కి వస్తాయని.. వామపక్షాలు కాంగ్రెస్ కలిసే పోటీచేయవచ్చునని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీపీఎం విషయంలో ఏమైనా తేడా వచ్చినా, సీపీఐ తప్పక కలిసే పోటీచేస్తుందని అంటున్నారు.